School Education: పాఠశాల విద్య.. ఇకపై 12వ తరగతి దాకా!
ABN , Publish Date - Jul 03 , 2025 | 03:19 AM
రాష్ట్రంలో ప్రస్తుతం పదో తరగతి వరకు ఉన్న పాఠశాల విద్యను ఇకపై 12వ తరగతి వరకు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఉన్నత పాఠశాలల స్థాయిని పెంచి 12వ తరగతి వరకు కొనసాగించాలని భావిస్తోంది.
హైస్కూళ్ల స్థాయిని పెంచే యోచన
విద్యార్థుల డ్రాపౌట్లను నివారించేందుకు..
ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలి
పదో తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి.. ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలి
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాల ప్రగతిపై నివేదిక సమర్పించాలి
విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రస్తుతం పదో తరగతి వరకు ఉన్న పాఠశాల విద్యను ఇకపై 12వ తరగతి వరకు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఉన్నత పాఠశాలల స్థాయిని పెంచి 12వ తరగతి వరకు కొనసాగించాలని భావిస్తోంది. ఈ అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పలు ఇతర రాష్ట్రాల్లో పాఠశాల విద్య 12వ తరగతి వరకు ఉంటోందని, దీంతో 9వ తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్య 12వ తరగతి వరకూ కొనసాగుతోందని అన్నారు. కానీ, తెలంగాణలో పదో తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నా, మంచి ఫలితాలు వస్తున్నా.. ఇంటర్మీడియట్‌కు వచ్చేసరికి సంఖ్య ఎందుకు తగ్గుతోందని ప్రశ్నించారు. ఇందుకు.. ఆయా రాష్ట్రాల్లో పాఠశాల విద్య 12వ తరగతి వరకు ఉండడం వల్లే డ్రాపౌట్ల సంఖ్య తక్కువగా ఉంటోందని అధికారులు బదులిచ్చారు. దీంతో ఇంటర్మీడియట్ వేరుగా ఉన్న రాష్ట్రాలు, పాఠశాలల్లో 12వ తరగతి వరకు ఉన్న రాష్ట్రాల్లో అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో విద్యా కమిషన్, ఆ విభాగంలో పని చేసే స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలన్నారు. విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ దశ కీలకమైనది అయిందున.. ఆ దశలో సరైన మార్గదర్శకత్వం అందాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను మెరుగుపరిచేందుకు అన్ని స్థాయుల్లో చర్చించి.. శాసనసభలోనూ చర్చకు పెడతామని తెలిపారు.
హాజరుపైనా దృష్టి పెట్టాలి..
ఇంటర్మీడియట్‌లో విద్యార్థుల చేరికతోపాటు వారి హాజరుపైనా దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ స్కూళ్ల నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి.. ప్రతి పాఠశాల ఆవరణలో భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేయాలన్నారు. భవనాల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని, నిర్మాణాల ప్రగతిపై ప్రతి వారం తనకు నివేదిక సమర్పించాలని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో బాలురు, బాలికలకు ఒక్కొక్కటి చొప్పున యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలు చేపడతామని తెలిపారు. ఇప్పటికే ఒక్కో పాఠశాలకు సంబంధించి స్థల సేకరణ పూర్తయిందని, రెండో పాఠశాలకు స్థల గుర్తింపు, సేకరణ ప్రక్రియపై దృష్టి సారించాలని నిర్దేశించారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం నిర్మాణ నమూనాను సీఎం పరిశీలించి పలు మార్పులను సూచించారు. సాధ్యమైనంత త్వరగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి రాత్రి 10 నుంచి 11-30 వరకు ఇంజనీరింగ్‌లో అదనపు సీట్ల అంశమ్మీద సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో అదనపు సీట్లపై చర్చించారు. అయితే సీఎస్‌ఈ సీట్లు పెరిగితే కోర్ ఇంజినీరింగ్ కోర్సులైన సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్ ఇంజినీరింగ్ సీట్లకు ప్రాధాన్యం తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి