School Bus Accident: స్కూల్ బస్ బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు
ABN , Publish Date - Dec 25 , 2025 | 11:32 AM
శంషాబాద్‌లో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. విహారయాత్రకు వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
రంగారెడ్డి జిల్లా, డిసెంబర్ 25: ఆ విద్యార్థులంతా ఎంతో సంతోషంగా విహారయాత్రకు బయలుదేరారు. అంతా కలిసి బస్సులో ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా గడుపుతున్నారు. అంతలోనే వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఏం జరిగిందో తెలిసేలోపే విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అప్పటివరకూ ఉత్సాహంగా గడిపిన ఆ విద్యార్థులు.. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో భయాందోళనకు గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే...
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ దగ్గర ఈరోజు(గురువారం) ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్ధులు ఉన్నారు. వీరంతా హైదరాబాద్ జలవిహార్‌కు విహారయాత్రకు వెళ్తుండగా.. శంషాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సు బోల్తాపడిన వెంటనే స్థానికులు, పోలీసులు అక్కడకు చేరుకుని బస్సులో ఉన్న విద్యార్ధులను సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలిసిన వెంటనే విద్యార్ధుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఇక బస్సు ప్రమాదంలో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
పిచ్చికుక్క దాడి.. 20 మంది భక్తులకు గాయాలు
ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మహిళలు మృతి
Read Latest Telangana News And Telugu News