Road Accident: ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మహిళలు మృతి
ABN , Publish Date - Dec 25 , 2025 | 09:58 AM
మహారాష్ట్రలో వైద్యానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది.
కాగజ్‌నగర్, డిసెంబర్ 25: క్రిస్మస్ పండగ పూట దేశంలో పెను విషాదలు చోటు చేసుకుంది. ఈరోజు (గురువారం) తెల్లవారుజున కర్ణాటకలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 17 మంది మృతి చెందిన ఘటన జరిగి కొన్ని గంటలు కూడా గడవక ముందే... అటు మహారాష్ట్రలో మరో ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వైద్యం కోసం వెళ్లి వస్తున్న వారిని మృత్యువు కబళించింది. వైద్యం నిమిత్తం మహారాష్ట్ర వెళ్లిన ఓ పేద కుటుంబం తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా తెలంగాణ రాష్ట్రం కొమురం భీం జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే...
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా దేవాడ దగ్గర ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ జాకీర్ కుటుంబ సభ్యులు, తమ బంధువులతో కలిసి వైద్యం కోసం మహారాష్ట్ర నాగపూర్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యం చేయించుకున్న అనంతరం తిరిగి సొంతూరుకు బయలుదేరిన సమయంలో అనుకోని ప్రమాదం వారిని వెంటాడింది.
దేవాడ సమీపంలోని ఓ బ్రిడ్జ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారిలో నలుగురు మహిళలు మృతి చెందారు. మృతులు సల్మా బేగం, శబ్రీమ్, ఆఫ్జా బేగం, సహారగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ కుటుంబంలోని నలుగురు చనిపోవడంతో కాగజ్‌నగర్‌లో విషాదం నెలకొంది.
ఇవి కూడా చదవండి...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి
అటల్ 101వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రేరణా స్థల్ నేడు జాతికి అంకితం
Read Latest Telangana News And Telugu News