PM Modi: అటల్ 101వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రేరణా స్థల్ నేడు జాతికి అంకితం
ABN , Publish Date - Dec 25 , 2025 | 07:49 AM
అటల్‌జీ 101వ జయంతి సందర్భంగా లక్నోలోని గోమ్తీ నది ఒడ్డున నిర్మించిన రాష్ట్ర ప్రేరణ స్థల్‌ను ప్రధాని నేడు జాతికి అంకితం చేస్తారు. 65 ఎకరాల విస్తీర్ణంలో రూ.230 కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఈ జాతీయ స్మారక సముదాయంలో..
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 25: భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ 101వ జయంతి (డిసెంబర్ 25, 2025) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నో సందర్శిస్తారు. ఈ మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు ఆయన గోమ్తీ నది ఒడ్డున నిర్మించిన రాష్ట్ర ప్రేరణా స్థల్ (Rashtra Prerna Sthal)ను జాతికి అంకితం చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
సుమారు 65 ఎకరాల విస్తీర్ణంలో రూ.230 కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఈ జాతీయ స్మారక సముదాయంలో అటల్ బిహారీ వాజ్‌పేయీతో పాటు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయల ఆదర్శాలకు అనుగుణంగా వారి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇలా ఆ మహనీయులకు నివాళి అర్పిస్తున్నారు.
ఈ సముదాయంలో ముఖ్య ఆకర్షణగా ముగ్గురు నాయకుల 65 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేశారు. వీటిని చుట్టుపక్కల నీటితో కూడిన ప్లాట్‌ఫాం మీద ఏర్పాటు చేశారు. వీటికి తోడు, కమలాకారంలో రూపొందిన అత్యాధునిక మ్యూజియం (సుమారు 98,000 చదరపు అడుగులు) ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇందులో అడ్వాన్స్‌డ్ డిజిటల్, ఇమ్మర్సివ్ టెక్నాలజీల ద్వారా భారత జాతీయ ప్రయాణం, నాయకత్వ వారసత్వాన్ని ప్రదర్శిస్తారు.
ఈ స్మారక పార్క స్వచ్ఛమైన నాయకత్వం, మంచి పాలన ఆదర్శాలను కాపాడుతూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అటల్ జయంతిని 'సుశాసన దివస్'గా జరుపుకునే సందర్భంలో మరింత ప్రాధాన్యత సంతరించింది. అటల్ జీ జీవితం, ఆదర్శాలు యువతను ఎల్లప్పుడూ ప్రేరేపిస్తాయని, ఈ ప్రేరణా స్థల్ దానికి నిజమైన నివాళి అని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
2 రోజుల్లోనే అలర్జీ వచ్చింది.. ఢిల్లీ వాయి కాలుష్యంపై నితిన్ గడ్కరి కీలక వ్యాఖ్యలు
నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి