Joint Committee: జలవివాదాలపై కమిటీ
ABN , Publish Date - Jul 17 , 2025 | 03:38 AM
తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి జలవివాదాల పరిష్కారానికి ముందడుగు పడింది. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల సమస్యల సమగ్ర పరిష్కారానికిగాను కమిటీని నియమించాలని నిర్ణయించారు.
రెండు రాష్ట్రాల నిపుణులు, అధికారులతో ఏర్పాటు.. 21లోగా నియామకం
రిజర్వాయర్ల ఔట్‌ఫ్లోల వద్ద టెలిమెట్రీలకు సుముఖం
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏపీకి తరలింపు
గోదావరి బోర్డు హైదరాబాద్‌లో కొనసాగింపు
శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకారం
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో నిర్ణయాలు
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి జలవివాదాల పరిష్కారానికి ముందడుగు పడింది. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల సమస్యల సమగ్ర పరిష్కారానికిగాను కమిటీని నియమించాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారులు, సాంకేతిక నిపుణులతో ఈ కమిటీని ఈ నెల 21లోగా నియమించనున్నారు. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు, కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి 13 అంశాలు ఎజెండాగా నిర్వహించిన ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు.. నీటి పారుదల శాఖ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నిమ్మల రామానాయుడు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు హాజరయ్యారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలు, నీటి నిర్వహణ పద్ధతులకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. వివాదాల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటుపై నిర్ణయంతోపాటు కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల నుంచి కాలువలకు వెళ్లే నీటి ప్రవాహాల తీరుతెన్నులను రియల్ టైంలో పర్యవేక్షించడానికి టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు శ్రీశైలం డ్యామ్‌ను పరిరక్షించడానికి జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక మేరకు మరమ్మతు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇక కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించాలన్న నిర్ణయం కూడా జరిగింది. గోదావరి బోర్డును హైదరాబాద్‌లో కొనసాగిస్తూ.. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడ లేదా అమరావతికి తరలించేందుకు ఇద్దరు సీఎం రేవంత్‌రెడ్డి, చంద్రబాబు అంగీకారం తెలిపారు.
ఇది తెలంగాణ విజయం..
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు ఇరు రాష్ట్రాలు, జలశక్తి అధికారులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కృష్ణా జలాల వినియోగంపై టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటుకు, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకరించిందని చెప్పారు. ఇది తెలంగాణ సాధించిన విజయమన్నారు. శ్రమశక్తి భవన్‌లో ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం ఢిల్లీలోని లీ మెరిడియన్ హోటల్‌లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమారెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సమావేశంలో బనకచర్లకు సంబంధించిన అంశాలేవీ ప్రస్తావనకు రాలేదన్నారు. గోదావరి-బనకచర్ల కడతామని ఏపీ అడిగితేనే కదా.. తాము అభ్యంతరం తెలిపేదని వ్యాఖ్యానించారు. అసలు ఎజెండాలో బనకచర్ల ప్రతిపాదనే లేదని, అలాంటప్పుడు ఆ ప్రాజెక్టును ఆపాలనే చర్చ ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. బనకచర్లపై తాము ఇప్పటికే ఫిర్యాదు చేశామని, తమ ఫిర్యాదును పరిగణలోనకి తీసుకుని పోలవరం అథారిటీ, సీడబ్ల్యూసీ, గోదావరి బోర్డు ఏపీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశాయని గుర్తు చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలు కూడా ఆ ప్రాజెక్టుపై అభ్యంతరాలు లేవనెత్తాయని తెలిపారు. కృష్ణా, గోదావరి నదులపై ఉమ్మడి రాష్ట్రాల సమస్యలను చర్చించడానికి, గుర్తించడానికి ఇంజినీర్లు, నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్మాణం, పాత ప్రాజెక్టులకు అనుమతులు, నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అభ్యంతరాలు.. వంటివన్నీ కమిటీ 30 రోజుల్లో గుర్తిస్తుందని అన్నారు. ఇది అపెక్స్ కమిటీ సమావేశం కాదని, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశమని పేర్కొన్నారు.
కృష్ణా జలాల వినియోగంపై టెలిమెట్రీ యంత్రాలు..
కృష్ణా జలాల నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నెన్ని నీళ్లను వినియోగిస్తున్నాయనే దానిపై టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు సీఎం రేవంత్ తెలిపారు. దీనివల్ల నీటి వినియోగానికి సంబంధించిన సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు డ్యామేజ్ అయ్యిందని, దీనికి తక్షణమే మరమ్మతు చేయాలని ఎన్‌డీఎ్‌సఏ సహా మిగిలిన సంస్థలు నివేదికలు ఇచ్చాయని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే అయినందున మరమ్మతుకు ఏపీ అంగీకారం తెలిపిందని చెప్పారు. గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులు చెరో రాష్ట్రంలో ఉండాలని పునర్విభజన చట్టంలో, 2020 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం జరిగిందని గుర్తు చేశారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. తెలంగాణకు తీరని అన్యాయం చేశారని, తెలంగాణ హక్కులను కేసీఆర్ ఆంధ్రాకు ధారాదత్తం చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. పదేళ్లలో ఏ జలవివాదానికీ పరిష్కార మార్గాన్ని చూపలేదన్నారు. 2020లో ఇద్దరు ముఖ్యమంత్రులు సంతకాలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరూ ఆ ప్రతిపాదనలు ఏమయ్యాయని ప్రశ్నించలేదని, కానీ.. ఇప్పుడు తాము పరిష్కరిస్తుంటే దాన్నొక సమస్యలా చూస్తున్నారని మండిపడ్డారు. జల వివాదాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, ఈ సమయంలో లడాయి చేసే అంశం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. ఈ చర్చలతో పరిష్కారం లభించకపోతే అప్పుడు పోరాటం గురించి ఆలోచిస్తామమన్నారు. ఈ భేటీ ఇరు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం కోసమేతప్ప.. సమస్యలను పెద్దవి చేసుకోవడానికి కాదన్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య గొడవల కోసం కొందరి ఎదురుచూపు..
తెలుగు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలు సహృద్భావ వాతావరణంలో జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే, రెండు రాష్ట్రాల మధ్య గొడవల కోసం కొందరు ఎదురు చూస్తున్నారని ఆరోపించారు. ఇరు రాష్ట్రాలు కొట్టుకుంటే తమకు బాగుంటుందని వాళ్లు (బీఆర్‌ఎ్‌సను ఉద్దేశించి) అనుకుంటున్నారని, వారిని చూసి జాలిపడడం తప్ప ఏమీ చేయలేమని అన్నారు. పదేళ్లు అవకాశమిచ్చినా ఏ సమస్యనూ పరిష్కరించలేకపోయారని, వాళ్ల దుఃఖాన్ని, బాధను తాము అర్థం చేసుకుంటామని ఎద్దేవా చేశారు. వాళ్లకు సమాధానం ఇవ్వడానికి తాము లేమని, తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉన్నామని చెప్పారు. పరిపాలన ఎలా చేయాలో తమకు తెలుసునన్నారు. వివాదాలు చెలరేగకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం తమ బాధ్యత అని అన్నారు. అపెక్స్ కమిటీ సమావేశం కూడా భేటీకి ఎటువంటి నిబద్ధత ఉంటుందని అడిగిన ప్రశ్నకు రేవంత్ బదులిస్తూ.. పార్లమెంట్ సాక్షిగా జరిగిన చట్టాలకే దిక్కులేదని, ప్రధాని నరేంద్రమోదీ వాటిని ఏ రోజూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. నమ్మకం మీదే ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, అభిషేక్ సింఘ్వీ, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రఘువీర్‌రెడ్డి, రఘురాంరెడ్డి, కడియం కావ్య, సురేష్ షెట్కార్, వంశీకృష్ణ, బలరాం నాయక్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి