Share News

Hyderabad: పంచాయతీ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు తేలాకే!

ABN , Publish Date - Jan 30 , 2025 | 03:29 AM

అనంతరం పూర్తి నివేదికను క్యాబినెట్‌ సబ్‌ కమిటీకి ఫిబ్రవరి 2 నాటికి అధికారులు అందజేయనున్నారు. ఆ వెంటనే సబ్‌కమిటీ సమావేశమై.. నివేదికపై చర్చిస్తుంది. ఆపై రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయి.. బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకుంటుంది.

Hyderabad: పంచాయతీ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు తేలాకే!

  • ఫిబ్రవరి 2 నాటికి సబ్‌కమిటీకి కుల సర్వే నివేదిక

  • ఆ వెంటనే మంత్రివర్గ సమావేశం.. నివేదికపై చర్చ

  • అనంతరం అసెంబ్లీలో తీర్మానం.. బీసీ రిజర్వేషన్లను

  • పెంచుకునే అవకాశమివ్వాలని కేంద్రానికి వినతి

  • దేశానికే ఆదర్శంగా నిలిచిన సర్వే: రేవంత్‌రెడ్డి

  • టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు

  • ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకోవాలన్న సీఎం

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్లు తేలిన తరువాతే జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుల సర్వే వివరాల ముసాయిదా మరో రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందనుంది. అనంతరం పూర్తి నివేదికను క్యాబినెట్‌ సబ్‌ కమిటీకి ఫిబ్రవరి 2 నాటికి అధికారులు అందజేయనున్నారు. ఆ వెంటనే సబ్‌కమిటీ సమావేశమై.. నివేదికపై చర్చిస్తుంది. ఆపై రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయి.. బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకుంటుంది. అనంతరం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుచేసి బీసీల రిజర్వేషన్లపె తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. దీనిపై కేంద్రం నుంచి సమాధానం వచ్చిన తరువాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుతామని 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే 2024 ఫిబ్రవరిలోకులగణనకు శ్రీకారం చుట్టింది. ఈ సర్వేలో వచ్చిన వివరాల ఆధారంగా రాష్ట్రంలో బీసీల లెక్కలు తేలనున్నాయి. కాగా, బీసీలకు ఖరారు చేయాల్సిన రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌ను కూడా నియమించింది. కుల సర్వేలో వచ్చిన వివరాలను ఇచ్చిన అనంతరం.. రిజర్వేషన్లను సూచిస్తూ ప్రత్యేక కమిషన్‌ ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తుంది.


50 శాతం మించరాదని సుప్రీంకోర్టు తీర్పు

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. మరోవైపు ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం 27 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాల్సి ఉంది. దీంతో ప్రస్తుతం బీసీలకు 23 శాతం రిజర్వేషన్‌ మాత్రమే అమలవుతోంది. ఇప్పుడు కులసర్వేలో వచ్చిన వివరాల ఆధారంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలంటే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటాల్సి ఉంటుంది. ఇందుకు కేంద్రం నుంచి ఆమోదం అవసరం. దీంతో బీసీలకు రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని, ఇందుకోసం పార్లమెంటులో చట్టం చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ విజ్ఞప్తిని కేంద్రం అనుమతించకపోతే స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. పాత పద్ధతిలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చి.. కాంగ్రెస్‌ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం టిక్కెట్లు ఇస్తుందా? లేక ఇతర మార్గాలను అన్వేషిస్తుందా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.


సర్వేపై జాతీయ స్థాయిలో ప్రశంసలు: సీఎం

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే.. దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో ఈ సర్వేపై ప్రశంసలందుతున్నాయని చెప్పారు. సర్వేను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను అభినందించారు. బుధవారం సమగ్ర కులగణన, సర్వే నివేదికపై బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కులగణన ప్రక్రియ సామాజిక సాధికారతతోపాటు, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణన సర్వేను చేపట్టి తమ చిత్తశుద్దిని చాటుకుందన్నారు. ఫిబ్రవరి 2వ తేదీ లోగా క్యాబినెట్‌ సబ్‌ కమిటీకి తుది నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్కమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


టీటీడీ తరహాలో యాదగిరి గుట్టబోర్డు

యాదగిరిగుట్ట దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలోనే ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం యాదగిరిగుట్ట బోర్డు నియామకానికి సంబంధించిన అంశాలపై జాబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ధర్మకర్తలి మండలి ఏర్పాటుకు ఇప్పటికే రూపొందించిన ముసాయిదాలో ఆయన పలు మార్పులను సూచించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయం సమీపంలో రాజకీయాలకు తావులేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆలయం తరఫున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనల్లో మార్పులు చేయాలన్నారు. సమీక్షలో సీఎస్‌ శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.


‘కుంభమేళా’ మృతుల కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలి

  • రాష్ట్రం నుంచి సాయం అందిస్తాం: సీఎం

మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన కుటుంబాలను కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆదుకోవాలని, గాయపడిన వారికి చికిత్స అందించాలన్నారు. ఈ విషయంలో అవసరమైన సాయం అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ఈ మేరకు సీఎంవో బుధవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కుంభమేళాకు తెలంగాణ నుంచి వెళ్లిన వారు క్షేమంగా తిరిగివాలంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.


ఇవీ చదవండి:

పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది

అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య

టీమిండియాకు కొత్త కెప్టెన్.. చేజేతులా చేసుకున్న సూర్య

ఇంత పొగరు అవసరమా హార్దిక్.. ఆల్‌రౌండర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 06:01 AM