Share News

Hardik Pandya: ఇంత పొగరు అవసరమా హార్దిక్.. ఆల్‌రౌండర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Jan 29 , 2025 | 01:48 PM

Hardik Pandya-Dhruv Jurel: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాండ్యాకు ఇంత పొగరెందుకు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అసలేం జరిగిందంటే..

Hardik Pandya: ఇంత పొగరు అవసరమా హార్దిక్.. ఆల్‌రౌండర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
Hardik Pandya

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు కొత్త కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. ఒక్క పనితో అటు క్రిటిక్స్‌, ఇటు సీనియర్ క్రికెటర్లకు టార్గెట్‌గా మారాడు పాండ్యా. రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత బ్యాటింగ్ సమయంలో యువ బ్యాటర్ ధృవ్ జురెల్‌తో అతడు ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. దీంతో పాండ్యాకు ఇంత పొగరు ఎందుకు? రుబాబు తగ్గించుకో అంటూ విమర్శలు వస్తున్నాయి. అసలు పాండ్యా చేసిన తప్పేంటి? అతడు ఇంతలా వార్తల్లోకి ఎక్కడానికి కారణం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..


ఆ మాత్రం నమ్మకపోతే ఎలా?

రాజ్‌కోట్ మ్యాచ్‌లో భారత్ 26 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ సంధించిన 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది సూర్య సేన. 20 ఓవర్లు ఆడి 145 పరుగులకే పరిమితమైంది. ఒకదశలో మ్యాచ్ మనదేనని అంతా అనుకున్నారు. హార్దిక్ పాండ్యా (40) క్రీజులో ఉండటంతో గెలుపు తీరాలకు చేరుస్తాడని భావించారు. కానీ అతడి ఔట్‌తో మ్యాచ్ పూర్తిగా ప్రత్యర్థి జట్టు చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో 18వ ఓవర్‌లో పాండ్యా సింగిల్ తీసేందుకు నిరాకరించడం, జురెల్ మీద నమ్మకం ఉంచకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


ఎందుకిలా చేశాడు?

భారత ఇన్నింగ్స్ 18వ ఓవర్‌ ఆఖరి బంతిని స్క్వేర్ లెగ్ బౌండరీ దిశగా తరలించాడు జురెల్. అయితే నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న హార్దిక్.. కనీసం సింగిల్ తీసేందుకు కూడా నిరాకరించాడు. ఈజీగా 2 పరుగులు రావాల్సిన చోట.. ఒక్క పరుగు కూడా తీయలేదు. తర్వాతి ఓవర్‌లో తాను స్ట్రయిక్ తీసుకొని భారీ షాట్లు కొడదామని భావించిన పాండ్యా.. జురెల్‌ను క్రీజులోనే ఆపేశాడు. దీంతో అంతా షాకయ్యారు. రన్‌రేట్ పెరిగిపోయిన వేళ ఒక్కో పరుగు కీలకంగా మారిన తరుణలో హార్దిక్ అలా చేయడం ఎవరికీ అర్థం కాలేదు.


హార్దిక్.. కాస్త తగ్గు!

సింగిల్ నిరాకరించిన హార్దిక్.. తర్వాతి ఓవర్‌లో జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మరింత ఒత్తిడి పెరగడంతో జురెల్ కూడా భారీ షాట్‌కు వికెట్ పారేసుకున్నాడు. దీంతో పాండ్యాపై విమర్శలు వస్తున్నాయి. జురెల్‌ను అతడు నమ్మలేదని.. ఓటమి కంటే కూడా యంగ్ బ్యాటర్‌తో పాండ్యా వ్యవహరించిన తీరు బాధాకరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అతడు కూడా స్పెషలిస్ట్ బ్యాటర్ అని.. తానే అందరికంటే తోపు అనే భావన మంచిది కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. క్రికెట్ టీమ్ గేమ్ అని.. ఒకర్నొకరు నమ్మకుంటే విజయాలు రావని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత పొగరు అక్కర్లేదు.. కాస్త తగ్గు అంటూ పాండ్యాకు వార్నింగ్ ఇస్తున్నారు.


ఇవీ చదవండి:

టీమిండియాకు ఎలా ఆడాలి.. బాలుడి ప్రశ్నకు విరాట్ సమాధానం

సురేఖను ఖేల్‌రత్నకు పరిగణించండి

‘అత్యుత్తమ క్రికెటర్‌’ బుమ్రా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 29 , 2025 | 01:55 PM