Karla Rajesh Case: కర్ల రాజేశ్ లాకప్ డెత్ కేసు.. అధికారులపై ఫైర్ అయిన మందకృష్ణ మాదిగ..
ABN , Publish Date - Dec 20 , 2025 | 07:56 PM
లాకప్ డెత్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై సురేశ్ రెడ్డిని సస్పెండ్ చేయకుండా ఎస్పీ ఆఫీస్‌కి అటాచ్ చేయడంపై మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ఎస్సైను కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారని మండిపడ్డారు.
సూర్యాపేట: దళిత యువకుడు కర్ల రాజేశ్ లాకప్ డెత్ కేసు(Karla Rajesh Lockup Death Case)లో సరైన చర్యలు తీసుకోలేదంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఇవాళ(శనివారం) కోదాడ(Kodad) పబ్లిక్ క్లబ్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
కర్ల రాజేశ్ మృతికి కారకులైన పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలపై మందకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. ఎస్సైపై చర్యలు తీసుకోకుండా స్థానిక ఎమ్మెల్యేనే కాపాడుతున్నారంటూ మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై సురేశ్ రెడ్డిని సస్పెండ్ చేయకుండా ఎస్పీ ఆఫీస్‌కి అటాచ్ చేయడంపై ధ్వజమెత్తారు. ఎస్సైను కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారని మండిపడ్డారు. ఈ కేసులో బీసీ వర్గానికి చెందిన రూరల్ సీఐ ప్రతాప్ లింగంపై సస్పెన్షన్ వేయడం అన్యాయమని అన్నారు. ఎస్సై బలమైన సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టే వదిలేశారని మందకృష్ణ ఫైర్ అయ్యారు.
నిందితుడిపై కేసు నమోదు చేయని డీఎస్పీలు, ఎస్పీలను విచారణలోకి తేవాలంటూ డిమాండ్ చేశారు. రాజేశ్ మృతదేహానికి రీ-పోస్టుమార్టం చేయాలని.. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే రోడ్లపై ధర్నాలు తప్పవని మందకృష్ణ హెచ్చరించారు. మరియమ్మ కేసులో లాగానే నిందితులు అందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎసై సురేశ్ రెడ్డిపై 302 సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Deputy CM Bhatti Vikramarka: పరీక్షలకు వార్షిక జాబ్ క్యాలెండర్ తప్పనిసరి: డిప్యూటీ సీఎం భట్టి..
Maoists: త్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ