Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల.. బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్, బిల్ గేట్స్ ఫొటోలు వైరల్
ABN , Publish Date - Dec 20 , 2025 | 07:50 PM
జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్‌స్టీన్.. అమెరికన్ ఫైనాన్షియర్. ఇతనిపై అనేక లైంగిక ఆరోపణలున్నాయి. న్యూయార్క్‌లో పుట్టిన ఈయన టీచర్ ఉద్యోగం నుంచి తొలగించగా బ్యాంకింగ్ రంగంలోకి వచ్చి కుభేరుడయ్యాడు..
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 20: అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ తాజాగా 'జెఫ్రీ ఎప్‌స్టీన్'(Jeffrey Edward Epstein) సెక్స్ స్కాండల్‌కు సంబంధించిన వేలాది డాక్యుమెంట్లు, ఫోటోలను విడుదల చేసింది. కొన్ని ఫైల్స్‌లో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, గూగుల్ సహ-వ్యవస్థాపకుడు సెర్గేయ్ బ్రిన్, హాలీవుడ్ నటుడు క్రిస్ టకర్ తదితర ప్రముఖుల ఫోటోలు ఉన్నాయి.
క్లింటన్ పూల్‌లో మహిళలతో కలిసి ఉన్న ఫోటోలు, హాట్ టబ్‌లో రిలాక్స్ అవుతున్న చిత్రాలు సంచలనంగా నిలిచాయి. అయితే, ఈ ఫోటోల్లో కొందరి ముఖాలు కనిపించకుండా చేశారు. వీరు బాధితులని జస్టిస్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.
ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నప్పటికీ, ఈ ప్రముఖులపై ఎలాంటి నేరారోపణలు లేవని, ఫోటోలు మాత్రమే ఉన్నాయని అధికారులు వివరించారు. విడుదల చేసిన వాటిలో 300,000కు పైగా డాక్యుమెంట్లు, 3,500 ఫైల్స్, 2.5 GB ఫోటోలు ఉన్నట్లు తెలుస్తోంది.
కొన్ని ఫోటోల్లో 'లోలిటా' నవలలో ఉన్న సందేశాలు కొందరి మహిళల శరీరంపై రాసి ఉన్నాయి. అయితే, ఈ ఫైల్స్‌లో కొత్త ఆరోపణలు లేవు. ఎక్కువగా గతంలో విడుదలైనవే. కాగా, క్లింటన్.. ఎప్‌స్టీన్ నేరాల గురించి తెలియదని గతంలోనే చెప్పారు. మరిన్ని ఫైల్స్ త్వరలో విడుదల కానున్నాయి.
ఎవరీ.. ఎప్‌స్టీన్?
జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్‌స్టీన్ (Jeffrey Edward Epstein జనవరి 20, 1953న అమెరికాలో పుట్టి ఆగస్టు 10, 2019న అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇతనొక అమెరికన్ ఫైనాన్షియర్, ఇంకా.. అనేక, లైంగిక దాడుల కేసుల్లో దోషిగా తేలాడు. న్యూయార్క్‌లో జన్మించిన ఎప్‌స్టీన్, టీచర్‌గా కెరీర్ మొదలుపెట్టి, తర్వాత బ్యాంకింగ్ రంగంలోకి వచ్చి బేర్ స్టెర్న్స్‌లో పనిచేశాడు.
తన సొంత ఫైనాన్షియల్ ఫర్మ్ స్థాపించి వేల కోట్లు సంపాదించి ధనవంతుడయ్యాడు. అతను ప్రముఖులతో దగ్గరి సంబంధాలు పెట్టుకున్నాడు. మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బ్రిటిష్ రాజకుటుంబ సభ్యుడు ప్రిన్స్ ఆండ్రూ, బిల్ గేట్స్, సైంటిస్టులు, హాలీవుడ్ సెలబ్రిటీలు (మైఖేల్ జాక్సన్ వంటివారు) ఇందులో ఉన్నారు. కానీ ఎప్‌స్టీన్ పేరు చెప్పగానే ముఖ్యంగా భారీ సెక్స్ ట్రాఫికింగ్ స్కాండల్స్ గుర్తుకొస్తాయి.

ఇవి కూడా చదవండి:
ఉదయం పూట ఇలా చేస్తారా.. చిన్నతనంలోనే వార్ధక్య లక్షణాలు వస్తాయి జాగ్రత్త!
నా కుమారుడు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు: నటుడు మాధవన్