Sangareddy: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 36 మంది ప్రయాణికులు
ABN , Publish Date - Dec 23 , 2025 | 10:01 AM
సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
సంగారెడ్డి, డిసెంబర్ 23: జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సును పెను ప్రమాదం తప్పింది. ఈరోజు (మంగళవారం) ఉదయం కోహిర్ మండలం చింతల్ ఘాట్ సమీపంలో ఎన్‌హెచ్ 65పై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ముందు వెళ్తున్న బస్సును తప్పించబోయే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడినట్లు తెలుస్తోంది. బస్సు కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడిన వెంటనే పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.
ఒక్కసారి బస్సు బోల్తా పడటంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమను రక్షించాలని కేకలు వేశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, హైవే సిబ్బంది, స్థానికులు కలిసి బస్సులో నుంచి ప్రయాణికులను ఒక్కొక్కరిగా బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
అయితే బస్సు ఓవర్ స్పీడ్‌తో ఉండటమే ప్రమాదానికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. ఇంత ప్రమాదం జరిగినప్పటికీ సురక్షితంగా బయటపడటంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వివిధ వాహనాల్లో వారు చేరుకోవాల్సిన గమ్య స్థానాలకు బయలుదేరి వెళ్లిపోయారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి కరెంట్ కట్..
వరుస బాంబు బెదిరింపులు.. పోలీసులు సీరియస్.. ఏం చేయనున్నారంటే?
Read Latest Telangana News And Telugu News