Harish Rao: తిప్పలు పెడితే రాసుకోండి.. మిత్తీతో సహా తీర్చేద్దాం: హరీష్ రావు
ABN , Publish Date - Dec 24 , 2025 | 03:04 PM
రెండు సంవత్సరాలైతే చాలు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్ల తర్వాత గులాబీ జెండా ఎగురుతుందన్నారు.
మెదక్, డిసెంబర్ 24: సర్పంచ్ ఎన్నికలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ... బతుకమ్మ చీరలు ఇచ్చిన వారు ఆ చీరలు కట్టుకొని వచ్చి ఓట్లు వేయాలని కోరినట్లు మాజీ మంత్రి హరీష్ అన్నారు. బుధవారం నాడు.. నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన సర్పంచులను హరీష్ రావు సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుండాయిజం చేసి పైసలు, సారా పంచి పోలీసులను పెట్టి కాంగ్రెస్ పార్టీ సర్పంచులను గెలిపించుకున్నారని ఆరోపించారు. ఈ ఎన్నిల్లో 4 వేలు మంది బీఆర్ఎస్ సర్పంచులు గెలుపొందారని తెలిపారు. బిడ్డా రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ అని.. ఆ పార్టీ గుండెలో నుంచి 4 వేల మంది సర్పంచులు మొలకెత్తారన్నారు.
ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని వ్యాఖ్యలు చేశారు. రెండు సంవత్సరాలైతే చాలు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్.. చెత్తను తీసేందుకు ట్రాక్టర్ పెట్టారని.. వీధి వీధినా లైట్లు పెట్టారని తెలిపారు. రెండు సంవత్సరాల తర్వాత గులాబీ జెండా ఎగురుతుందన్నారు. ఎవరన్నా తిప్పలు పెడితే రాసి పెట్టుకోండి మన గవర్నమెంట్ వచ్చాక మిత్తితో తీర్చేద్దామంటూ కొత్త సర్పంచులతో మాజీ మంత్రి అన్నారు. రైతుబంధు సగం సగం ఇచ్చారని.. బోనస్ బోనాల మిచ్చిండు యాసంగి ఎగ్గొట్టిండు అంటూ కామెంట్స్ చేశారు. బతుకమ్మ చీరలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సగం మందికి ఇచ్చి సగం మందికి ఎగొట్టారని అన్నారు.
పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం పిల్లలకు స్కాలర్షిప్స్ ఇచ్చారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ఆడితే ప్రజలకు ఏం వస్తుందని.. తెలంగాణ ప్రజలు త్వరలో రేవంత్‌ను ఫుట్‌బాల్ ఆడుతారంటూ వ్యాఖ్యలు చేశారు. ఫుట్బాల్ మీదున్న ప్రేమ రైతుల మీద లేదన్నారు. యూరియా కావాలంటే యాప్‌లు పెట్టారని..యాప్ ఎందుకు పంట పండించడానికా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు త్వరలో గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
లక్షల్లో శిశువుల విక్రయం.. 12 మంది అరెస్ట్
వీరన్న హత్య కేసులో వీడిన మిస్టరీ... అసలు నిజం ఇదే
Read Latest Telangana News And Telugu News