Share News

Srisailam: టన్నెల్‌లో ప్రాణాలు!

ABN , Publish Date - Feb 23 , 2025 | 03:44 AM

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో భారీ ప్రమాదం సంభవించింది. టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్‌ (టీబీఎం)తో సొరంగం తవ్వుతుండగా.. పైకప్పు కూలింది. శ్రీశైలం నుంచి మన్నెవారిపల్లి వైపు నీటిని తరలించే ఇన్‌ లెట్‌ భాగం నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Srisailam: టన్నెల్‌లో ప్రాణాలు!

కూలిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగం

  • చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు, ఉద్యోగులు

  • టీబీఎం తవ్వకం జరుపుతుండగా కూలిన పైకప్పు

  • ప్రాణాలతో బయటపడ్డ 46 మంది సిబ్బంది

  • సొరంగంలోకి 8 మీటర్ల మేర చేరిన నీళ్లు, రాళ్లు

  • 124 మీటర్ల దూరం వరకు ఊడి పడిన పెచ్చులు

  • నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో

  • టన్నెల్‌ ఇన్‌లెట్‌ వైపు 14వ కిలోమీటర్‌ వద్ద ఘటన

  • సహాయక చర్యలు ప్రారంభం.. టన్నెల్‌లోకి ఆక్సిజన్‌

  • చిక్కుకున్న వారిని కాపాడాలని సీఎం రేవంత్‌ ఆదేశం

  • బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ

  • సంఘటనా స్థలానికి మంత్రులు ఉత్తమ్‌, జూపల్లి

  • రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

  • సీఎం రేవంత్‌కు ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌ అన్ని విధాలా సహకారం అందిస్తామని భరోసా ఆ 8 మందిని కాపాడుతాం: మంత్రి ఉత్తమ్‌ ఘటనపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిగ్ర్భాంతి ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బలగాలను పంపాలని షాకు విజ్ఞప్తి

నాగర్‌కర్నూల్‌/అచ్చంపేట/దోమలపెంట/హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్ర‌జ్యోతి): శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో భారీ ప్రమాదం సంభవించింది. టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్‌ (టీబీఎం)తో సొరంగం తవ్వుతుండగా.. పైకప్పు కూలింది. శ్రీశైలం నుంచి మన్నెవారిపల్లి వైపు నీటిని తరలించే ఇన్‌ లెట్‌ భాగం నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్‌లో రాళ్లు, మట్టి పడటంతోపాటు పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో టన్నెల్‌లో పనిచేసేందుకు వెళ్లిన కార్మికులు, ఉద్యోగుల్లో 8 మంది అందులో చిక్కుకుపోయారు. 46 మంది ప్రాణాలతో బయటపడ్డారు. టన్నెల్‌లో 8 మీటర్ల మేర నీరు చేరడం, 124 మీటర్ల దూరం వరకు పెచ్చులూడి పడటంతో తక్షణ సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో అత్యవసరంగా మాట్లాడారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఆరా తీసి.. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు వేగవంతం చేయాలన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారందరికీ మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం ఆదేశాలతో ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హెలికాప్టర్‌లో హుటాహుటిన దోమలపెంటకు చేరుకున్నారు. ఆయనతోపాటు జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్‌, ఫైర్‌ సేఫ్టీ డీజీలు దోమలపెంటకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తక్షణ సహాయక చర్యల గురించి సమీక్ష నిర్వహించారు. చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు రెస్క్యూ టీంలను రంగంలోకి దించారు. ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా ప్రమాద స్థలికి చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో పాటు అధికారులు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. టన్నెల్‌లో చిక్కుకున్న వారికి అవసరమైన ఆక్సిజన్‌తోపాటు ఆహారం పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్‌ చేసి ఆరా తీశారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పంపిస్తామని సీఎంకు చెప్పారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని హామీ ఇచ్చినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.

1 copy.jpg


ప్రమాదం జరిగింది ఇలా..

నల్లగొండ జిల్లాలో 4లక్షల ఎకరాలకు సాగునీరు అందిచాలన్న ఉద్దేశంతో 2005లో అప్పటి ప్రభుత్వం నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ఆధారంగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులకు శ్రీకారం చుట్టింది. దోమలపెంటలోని కృష్ణానది నుంచి మన్నెవారిపల్లి మీదుగా 44.50 కిలోమీటర్ల దూరం టన్నెల్‌ పనులు జరుగుతున్నాయి. అయితే నాలుగేళ్ల నుంచి టన్నెల్‌ తవ్వకం పనులు పెడింగ్‌లో ఉన్నాయి. ఈ పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదిక పనులు చేపడుతోంది. దీంతో నాలుగు రోజుల క్రితమే తిరిగి ప్రారంభమయ్యాయి. రోజూ రెండు షిప్టులుగా పనులు జరుగుతున్నాయి. మొదటి షిప్టు ఉదయం 7 నుంచి సాయంత్రం 3 గంటల వరకు, రెండో షిఫ్టు సాయంత్రం 3 నుంచి రాత్రి ఒంటి గంట వరకు నడుస్తోంది. కాగా, శనివారం ఉదయం మొదటి షిప్టులో పనిచేయడానికి మొత్తం 54 మంది టన్నెల్‌ లోపలికి వెళ్లారు. అయితే 14వ కిలోమీటరు వద్ద టీబీఎం త్వవకం పనులు చేపడుతుండగా నీరు, మట్టి లీకేజీ కారణంగా టన్నెల్‌లో సిగ్మెంట్‌ బ్లాక్‌ ఆకస్మికంగా విరిగిపడి ప్రమాదం సంభవించింది. దీంతో ఆకస్మికంగా నీటి వరద రావడంతో పాటు రాళ్లు, రప్పలు మట్టి పడటం ప్రారంభమైంది. కేవలం అరగంట వ్యవధిలో 8 మీటర్ల మేర నీరు చేరడంతో ఒక్కసారిగా కలకలంరేగింది. 124 మీటర్ల దూరం వరకు టన్నెల్‌లో పెచ్చులూడిపడ్డాయి. దీంతో టన్నెల్‌ బోల్ట్‌ మెషిన్‌ వెనుకభాగంలో ఉన్న 46 మంది బయటకు పరుగులు పెట్టి ప్రాణాలను కాపాడుకున్నారు. టీబీఎం ముందు భాగంలో ఉన్న 8 మంది టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు.


చిక్కుకుపోయినవారు వీరే..

టన్నెల్‌ తవ్వకంలో టీబీఎం పనులను అమెరికాకు చెందిన రాబిన్‌ కంపెనీ చూస్తుండగా, సెగ్మెంట్‌ బ్లాకులను బిగించి.. ఊటనీటితోపాటు మట్టి కూలకుండా చేయడం జేపీ అసోసియేట్స్‌ చేపడుతోంది. కాగా, ప్రమాదంతో టన్నెల్‌లో జేపీ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులతోపాటు రాబిన్‌ కంపెనీకి చెందిన ఇద్దరు టెక్నికల్‌ ఉద్యోగులు, నలుగురు కార్మికులు చిక్కుకున్నారు. వీరిలో జమ్ము కశ్మీర్‌కు చెందిన సన్నీసింగ్‌(35), పంజాబ్‌కు చెందిన గురుప్రీత్‌సింగ్‌(40), ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనోజ్‌ కుమార్‌(51), శ్రీనివాస్‌(50), జార్ఘండ్‌కు చెందిన సందీప్‌ సాహు(38), జగత్‌సె్‌స(37), సంతోష్‌ సాహు(37), అంజు సాహు(25) ఉన్నారు. వీరిని కాపాడేందుకు తక్షణమే తెలంగాణ, ఏపీకి చెందిన 145 మంది ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బలగాలతోపాటు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలతో సహాయక చర్యలు చేపట్టారు. వారికి ఆక్సిజన్‌తో పాటు ఆహారం పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్తు సరఫరా లేకపోవడంతో టన్నెల్‌ లోపలకు డ్రోన్‌కు లైట్లు అమర్చి.. పంపించే ప్రయత్నాలు చేపట్టారు.


పట్టించుకునే నాథుడే లేడు: బాధితులు

సొరంగం పనుల్లో మట్టిలో కూరుకుపోయిన తమ స్నేహితులు, బంధువులను వెలికితీసేందుకు జేపీ కంపెనీ, అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రమాదం నుంచి బయటపడ్డ వారు ఆరోపించారు. ప్రమాదం జరిగి 12 గంటలు దాటడంతో సొరంగంలో తమవారి పరిస్థితి ఏవిధంగా ఉందోనని ఆందోళన చెందుతున్నారు. బతుకుదెరువు కోసం తమ కుటుంబ సభ్యులను వదిలేసి జార్ఖండ్‌ నుంచి వచ్చామని, ప్రమాద వివరాలను బయటికి చెప్పకుండా కంపెనీ యాజమాన్యం తమను బెదిరిస్తోందని అన్నారు. అధికారులు అనుమతిస్తే తామే ప్రమాదం జరిగిన చోటికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొంటామని చెప్పారు. వీలైనంత తొందరగా తమ వారిని ప్రాణాలతో బయటకు తీసుకురావాలని కోరారు.

ఊపిరాడకపోవచ్చు: నిపుణులు

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో చిక్కుకున్నవారికి ఆక్సిజన్‌ అందుతుందా? లేదా? అనేది సందేహంగా ఉంది. సముద్ర మట్టానికి 834 అడుగుల దిగువన టన్నల్‌ పనులు జరుగుతున్నాయి. అయితే శనివారం జరిగిన ప్రమాదంలో టన్నెల్‌ లోపలికి వెళ్లిన ఇంజనీర్లు, సిబ్బందికి ఆక్సిజన్‌ సిలిండర్లు లేవు. టన్నెల్‌ పైభాగం కూలిపోవడంతో వెనుక, ముందు భాగం నుంచి ఆక్సిజన్‌ అందే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్‌ ముందు భాగంలో చిక్కుకున్న వారికి ఊపిరి ఆడే పరిస్థితి ఉండదని ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. రెస్క్యూ టీంలు కూడా సహాయక చర్యలు ప్రారంభించాలంటే కచ్చితంగా ఆక్సిజన్‌ సిలిండర్లతో వెళ్లాల్సిందే. డీవాటరింగ్‌ ప్రకియ, మట్టిదిబ్బలు తొలగించకుండా రెస్క్యూ టీం ముందుకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఇదంతా ఎప్పటివరకు కొలిక్కివస్తుందో చెప్పలేకుండా ఉంది. ఈ నేపథ్యంలో టన్నెల్‌లో చిక్కుకున్న వారి పరిస్థితిపై వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కాగా, శనివారం పొద్దుపోయాక రెండు వాహనాల్లో రెస్క్యూటీం సభ్యులు, నాగర్‌కర్నూలు కలెక్టర్‌ బదాబత్‌ సంతోష్‌ టన్నెల్‌లోకి వెళ్లారు. అయితే వారు ఎంతవరకు వెళ్లగలరనేది అంచనా రాలేదు.


నేటి నుంచి రెస్క్యూ ఆపరేషన్‌

ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటనలో రెస్క్యూ ఆపరేషన్‌ ఆదివారం ఉదయం ప్రారంభం కానుంది. శనివారం ఉదయం ఈ సంఘటన జరిగిన క్రమంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఎన్‌డీఆర్‌ఎ్‌స, ఆర్మీని వెంటనే సంఘటనాస్థలానికి పంపించింది. అయితే శ్రీశైలం జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉండటం వల్ల ఆ బృందాలు.. హైదరాబాద్‌ నుంచి దాదాపు 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 3 నుంచి 4గంటల సమయం పట్టింది. ఈ నేపథ్యంలో శనివారం రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించడానికి సాధ్యపడలేదు. ఉన్నతాధికారులు సంఘటన స్థలంలోనే బస చేసి ఆదివారం ఉదయాన్నే చర్యలు చేపట్టే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.


పరుగులు పెట్టి బయటపడ్డాం

‘‘సొరంగంలోని 13.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. వాటర్‌ లీకేజీ అవుతోందని, మట్టి రాలుతోందని బోర్‌ మెషిన్‌ దగ్గర ఉన్నవారు కొందరు గుర్తించారు. ఈ విషయాన్ని పక్కవారికి చెప్పి అప్రమత్తం చేశారు. అంతలోనే కొందరు కేకలు వేయడంతో అందరం అప్రమత్తమయ్యాం. దీంతో ఎవరికి వారు బయటివైపు కొంత దూరం పరిగెత్తాం. అక్కడి నుంచి ట్రైన్‌ సహాయంతో టన్నెల్‌లో నుంచి బయటపడ్డాం’’

- ఎలక్ర్టీషియన్‌ శ్రీమన్‌ కరియ, ప్రత్యక్ష సాక్షి


ఈ వార్తలు కూడా చదవండి..

KTR: రేవంత్ యాక్సిడెంటల్ సీఎం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

Boy Death: మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న చిన్నారి మృతి

Hyderabad: స్వచ్ఛమైన గాలి.. అరగంటకు రూ.5 వేలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 23 , 2025 | 03:44 AM