Share News

BRS vs Congress: ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సభకు వస్తారా..? ఏం జరుగనుందో..!

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:54 PM

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అందుకే.. జనాలు సైతం ఈ వ్యవహారంపై ఎక్కువ ఫోకస్‌గా ఉన్నారు.

BRS vs Congress: ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సభకు వస్తారా..? ఏం జరుగనుందో..!

హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అందుకే.. జనాలు సైతం ఈ వ్యవహారంపై ఎక్కువ ఫోకస్‌గా ఉన్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రకటనలు వస్తాయో.. ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. అని ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీకి సానుకూలంగా ఉంటూ వస్తున్నారు. ఈ వ్యవహారంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ, అటు జంపింగ్ ఎమ్మెల్యేల మధ్య టామ్ అండ్ జెర్రీ పోరు నడుస్తోంది. ఒకరికి మించి ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ రాజకీయాన్ని మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి. ఈ క్రమంలోనే శనివారం నాడు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభ మరింత ఆసక్తిని రేపుతోంది. ఎందుకంటే.. గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. ఆ తరువాత బీఆర్ఎస్‌కు దూరంగా.. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటూ వస్తున్న ఆయన.. తాను పార్టీ మారలేదని.. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని పలుమార్లు ప్రకటిస్తూ వచ్చారు. ఈ క్రమంలో గద్వాల గడ్డపై బీఆర్ఎస్ సభ నిర్వహించడం రాజకీయంగా ఉత్కంఠకు తెర లేపినట్లయ్యింది.


గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో ఇద్దరు కన్నుమూయగా.. 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌ పార్టీకి చేరువయ్యారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్లు వేశారు. అయితే, సుప్రీంకోర్టు ధర్మాసనం మూడు నెలల్లోకా సదరు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ స్పీకర్‌కు సూచించింది. దీంతో స్పీకర్ ఆ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. వీరంతా తాము పార్టీ మారలేదని.. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ తమ వివరణలో చెప్పారట. దీంతో ఖంగుతిన్న బీఆర్ఎస్ పార్టీ.. సదరు ఎమ్మెల్యేలకు ధీటుగా మాస్టర్ ప్లాన్ వేసింది. అందులో భాగమే.. జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు, సభలు నిర్వహించడం.


శనివారం నాడు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నియోజకవర్గమైన గద్వాలలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం హాజరవుతున్నారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బీఎస్ కేశవ్ ఈ సభా వేదికగా బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. అయితే, ఈ సభ గద్వాలలో రాజకీయంగా కాక రేపుతోంది.

గత కొంతకాలంగా తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఇటీవల స్పీకర్‌కు ఇచ్చిన వివరణలోనూ ఇదే అంశాన్ని పేర్కొన్నారట. దీని ప్రకారం.. ఎమ్మెల్యే బండ్ల.. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు లేవనెత్తుతున్నారు. ఎమ్మెల్యే బండ్ల చెబుతున్నట్లుగా ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే.. గద్వాల సభకు అధ్యక్షత వహించాలి కదా? అని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ సభకు హాజరవుతారా? లేదా? అన్న చర్చ గద్వాల రాజకీయంలో గరం గరంగా సాగుతోంది.


కేటీఆర్ రెచ్చిపోతారా..?

ఇదిలాఉంటే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మాట్లాడే అవకాశం ఉందని గులాబీ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆ 10 మంది ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. స్త్రీ లింగం, పురుష లింగం పేరిట ఘాటైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలే టార్గెట్‌గా గద్వాల గడ్డపై నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఇంకెన్ని కామెంట్స్ చేస్తారోనని పొలిటికల్ సర్కిల్‌లో గట్టి టాకే నడుస్తోంది.


Also Read:

Yamraj nephew: వామ్మో.. ఈ బాలుడు యమధర్మరాజుకు చుట్టమేమో.. సైకిల్ ఎలా తొక్కుతున్నాడో చూడండి..

Metro Trains: 15 నుంచి మెట్రోరైలు వేళల్లో మార్పులు

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 13 , 2025 | 12:54 PM