Share News

KTR: ఢిల్లీలో రేవంత్‌ ధర్నా ఓ డ్రామా

ABN , Publish Date - Aug 06 , 2025 | 04:33 AM

ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీసీల పేరుతో చేసే ధర్నా ఓ డ్రామా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

KTR: ఢిల్లీలో రేవంత్‌ ధర్నా ఓ డ్రామా

  • బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ముందుగా.. విద్య, ఉద్యోగాల్లో 42ు రిజర్వేషన్లు కల్పించండి

  • హామీలు నెరవేర్చకుంటే అనర్హత వేటేయాలి

  • కాళేశ్వరం నివేదికను బయట పెట్టాలి: కేటీఆర్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీసీల పేరుతో చేసే ధర్నా ఓ డ్రామా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీ రిజర్వేషన్లు కేంద్రం చేతిలో పనని చెబుతున్న రేవంత్‌.. ఆయన చేతిలోనే ఉన్న మిగిలిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇకనైనా ఢిల్లీలో డ్రామాలు, ఓట్ల కోసం డైలాగులు ఆపి.. బీసీలకు ఇచ్చిన మిగిలిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని సాకుగా చూపి కాలయాపన చేస్తామంటే, స్థానిక ఎన్నికల్లో ప్రజలే గుణపాణం చెబుతారని హెచ్చరించారు. మంగళవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కార్యాలయంలో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌, కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషీలతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఆయనతో పాటు బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు కేఆర్‌ సురేశ్‌ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీలు వినోద్‌ కుమార్‌, బాల్క సుమన్‌ ఉన్నారు. అనంతరం ఈసీఐ కార్యాలయం ఎదుట కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజల్లో ఈవీఎంలపై అనేక అనుమానాలు ఉన్నాయని, మళ్లీ బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.


బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతోనే బ్యాలెట్‌ విధానానికి శ్రీకారం చుట్టాలని కోరారు. బిహార్‌లో లోపాలను అరికట్టకపోతే, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయుకంటే ఆ అభ్యర్థి సభ్యత్వం రద్దు చేయాలని, వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత హామీలన్నీ గాలికి వదిలేసిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదిక అంతా ట్రాష్‌, గ్యాస్‌ అని కేటీఆర్‌ కొట్టిపారేశారు. 665 పేజీల నివేదికను 60 పేజీలకు కుదించడంతోనే కాంగ్రెస్‌ డ్రామా ప్రజలకు అర్థమైపోయిందన్నారు. రేవంత్‌కు దమ్ముంటే.. వెంటనే పూర్తి నివేదికను బహిర్గతం చేయాలని, అసెంబ్లీలో చర్చకు పెట్టి మైక్‌ కట్‌ చేయకుండా తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ వాసులకు కేసీఆర్‌ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి మసేనని కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 06 , 2025 | 04:33 AM