KTR: ప్రజలు తిడుతున్నా.. రేవంత్‌కు రోషం లేదు
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:15 AM
ప్రజలు తిడుతున్న తిట్లను వింటే పౌరుషం ఉన్న ఎవరైనా బకెట్ నీళ్లలో దూకి చచ్చేవాడని.. రేవంత్‌రెడ్డికి రోషంలేదు కాబట్టే అన్నీ దులుపుకొని తిరుగుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

వేరే వాళ్లు ఎవరైనా బకెట్ నీళ్లలో దూకి చచ్చేవాడు
ప్రతి కాంట్రాక్టును ఆ మంత్రికి అప్పగిస్తున్నారు
కాంగ్రెస్ సర్కార్ బీసీలను మోసగించింది: కేటీఆర్
హైదరాబాద్, పిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ప్రజలు తిడుతున్న తిట్లను వింటే పౌరుషం ఉన్న ఎవరైనా బకెట్ నీళ్లలో దూకి చచ్చేవాడని.. రేవంత్‌రెడ్డికి రోషంలేదు కాబట్టే అన్నీ దులుపుకొని తిరుగుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో జరిగిన ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లాలో కల్యాణలక్ష్మి చెక్కులిస్తున్న ఓ మంత్రిని.. తులం బంగారం లేదని మహిళలు ప్రశ్నించారని, తమ స్కూటీ హామీ ఏమైందని కాలేజీ పిల్లలు పోస్ట్‌కార్డు ఉద్యమం మొదలుపెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయామని అన్ని వర్గాల ప్రజలు అనుకుంటున్నారని, ఆ పార్టీ నాయకులను ప్రజలు గల్లాపట్టి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. సీఎం నియోజకవర్గంలోని పనులతో పాటు తెలంగాణలోని ప్రతిపని కాంట్రాక్టు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రికే దక్కుతోందన్నారు. కాంట్రాక్టు మంత్రి, ఆయన కమీషన్ల కోసమే ముఖ్యమంత్రి పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
డిప్యూటీ సీఎం 30ు కమీషన్లు తీసుకొని పనులు చేస్తున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేనే చెబుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ మంత్రి రుణమాఫీ కాలేదని చెప్తే.. సీఎం మాత్రం మొత్తం రుణ మాఫీ అయ్యిందని అబద్ధాలు చెబుతున్నారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ కుతంత్రాలను గులాబీ దండు అడ్డుకుంటుందని చెప్పారు. ఖమ్మం జిల్లాలో 2014 తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అసాధారణ అభివృద్ధి చేసిందని, పువ్వాడ అజయ్ వంటి మంచి నాయకుడు ఓడిపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. జిల్లాలోని ప్రత్యేక రాజకీయ సమీకరణల వల్ల బీఆర్‌ఎ్‌సకు నష్టం జరిగిందన్నారు. ఓడిపోయినా ప్రజలకు కష్టంవస్తే.. బీఆర్‌ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులు ఏడాది కాలంగా ప్రజలకు అండగా ఉంటున్నారన్నారు.
ఖమ్మంలో ఇటీవల వరదలు వస్తే ప్రజలకు పువ్వాడ అజయ్ గుర్తుకొచ్చారని తెలిపారు. డిప్యూటీ సీఎం సహా ఖమ్మంలో ముగ్గురు మంత్రులున్నా.. వరదల సమయంలో వారితో పైసా ఉపయోగం లేకుండా పోయిందదన్నారు. కేసీఆర్ సీఎంగా లేకపోవడంతో ఎంతో నష్టపోయామన్న భావనతో ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. 42ు రిజర్వేషన్, బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తామని, రూ.లక్షకోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు బీసీ జనాభాను తగ్గించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వర్గ ప్రజలను నిలువునా మోసం చేసిందని ఆరోపించారు. కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 51.5ు ఉంటే.. రేవంత్ కులగణన సర్వేలో ఐదున్నర శాతం తగ్గించి 46ు చూపించారన్నారు. రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఏడాది కాలంగా కేసులు పెట్టి వేధిస్తున్నా.. విచారణల పేరిట పిలిచి జైల్లో పెడతామని బెదిరిస్తున్నా.. ప్రజా సమస్యలపై రేవంత్‌రెడ్డితో పోరాడుతున్నామని, భవిష్యత్తులోనూ కొట్లాడతామని, త్వరలోనే ఖమ్మంలో పర్యటిస్తానని ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News