Share News

Kavitha: హరీశ్‌రావు, సంతోష్‌రావు అవినీతి అనకొండలు

ABN , Publish Date - Sep 02 , 2025 | 03:01 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ సీనియర్‌ నేత హరీశ్‌రావు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ అవినీతి అనకొండలు అని ఆరోపించారు. కేసీఆర్‌ నీళ్ల కోసం ఆలోచిస్తే....

Kavitha: హరీశ్‌రావు, సంతోష్‌రావు అవినీతి అనకొండలు
MLC Kavitha

కాళేశ్వరం ఎపిసోడ్‌లో ప్రధాన పాత్ర హరీశ్‌రావుదే

  • అందుకే ఆయనను రెండో టర్మ్‌లో ఇరిగేషన్‌ మంత్రిగా కేసీఆర్‌ తొలగించారు

  • ఆ ఇద్దరి వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక.. వారిని కాపాడుతున్నది సీఎం రేవంత్‌రెడ్డి

  • కాదంటే వాళ్ల అవినీతిని బయట పెట్టాలి.. మా నాన్న పరిస్థితిని దగ్గరుండి చూశాను

  • నా పెళ్లికి డబ్బుల కోసమూ ఇబ్బంది పడ్డారు.. డబ్బుపై ఆయనకు ఏనాడూ ఆశ లేదు

  • అలాంటి వ్యక్తిపై సీబీఐ కేసా?.. నాపై దుష్ప్రచారం చేశారో.. తోలుతీస్తా.. కవిత ఫైర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ సీనియర్‌ నేత హరీశ్‌రావు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ అవినీతి అనకొండలు అని ఆరోపించారు. కేసీఆర్‌ నీళ్ల కోసం ఆలోచిస్తే.. వారు మాత్రం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఆస్తులు పెంచుకునే ఆలోచన చేశారని అన్నారు. వారు చేసిన చెత్తపనుల వల్ల కేసీఆర్‌ అప్రతిష్టపాలయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. హరీశ్‌, సంతోష్‌ తోపాటు ఓ నిర్మాణ సంస్థ ప్రతినిధి కారణంగా కాళేశ్వరం ఎపిసోడ్‌లో కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ ధ్యాస తప్ప.. డబ్బుపై ఆశ లేదని, ఆయనపై సీబీఐ విచారణ చేపట్టే పరిస్థితి రావడం తనను వేదనకు గురిచేస్తోందని తెలిపారు. హరీశ్‌, సంతోష్‌ తనపై ఎన్ని కుట్రలు చేసినా భరించానని, ఇకపై ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేస్తే తోలు తీస్తానని హెచ్చరించారు. కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కవిత సోమవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కవిత మాట్లాడుతూ, ‘‘హరీశ్‌రావు, సంతోష్‌ అవినీతి అనకొండలు. ఈ అనకొండల వల్లే కాళేశ్వరం ఎపిసోడ్‌లో కేసీఆర్‌కు మరక అంటింది. కేసీఆర్‌ నీళ్ల కోసం ఆలోచిస్తే.. వీళ్లు మాత్రం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఆస్తులు పెంచుకోవాలని ఆలోచించారు. ఐదేళ్లు సాగునీటి మంత్రిగా చేసిన హ రీశ్‌కు ఇందులో మేజర్‌ పాత్ర లేదా? అందుకే కదా.. రెండో టర్మ్‌లో పార్టీ అధినేత ఆయనను తప్పించింది! ఇదే హరీశ్‌, సంతోష్‌ నాపై ఎన్ని కుట్రలు చేసినా భరించాను. నాపై బహిరంగంగా మీడియా మిత్రులతో రకరకాలుగా చెప్పించారు. సోషల్‌ మీడియా ద్వారా ఇప్పటివరకు నాపై జరిగిన పర్సనల్‌ ఎటాక్‌ను ఓర్చుకుంటూ వచ్చాను. ఇంతవరకు పేరు పెట్టి చెప్పలేదు. ఇప్పుడు మొదటిసారి చెబుతున్నా. దేవుడి లాంటి మా నాన్నపై సీబీఐ విచారణ చేస్తామంటుంటే.. ఒక బిడ్డగా కడుపు రగిలిపోతోంది. అందుకే చెబుతున్నా’’ అని అన్నారు.


ఇంకా వాళ్లనే మోస్తారా?

‘‘హరీశ్‌రావు, సంతోష్‌.. కేసీఆర్‌ పక్కన ఉండి, ఆయన పేరు చెప్పుకొని అనేక విధాలుగా లబ్ధి పొందారని కవిత తెలిపారు. వారి చర్యల వల్లే కేసీఆర్‌ పేరు బద్నామ్‌ అయ్యే పరిస్థితి వచ్చింది. అయినా వాళ్లనే మోస్తామని, వాళ్లనే మళ్లీ ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే.. పార్టీ ఎలా ముందుకుపోతుందని ప్రశ్నించారు. ‘‘ఒక బిడ్డగా నేను బాధపడుతున్నా. ఐదేళ్లు ఇరిగేషన్‌ మంత్రిగా చేసిన హరీశ్‌రావుకు ఇందులో మేజర్‌ పాత్ర లేదా? మా నాన్న పరిస్థితి నేను దగ్గరుండి చూశాను. నా పెళ్లికి డబ్బుల కోసం ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో నాకు తెలుసు. రాజకీయాల్లో 40, 50 ఏళ్లు ఉన్నా.. కేసీఆర్‌ ఆస్తులు సంపాదించుకోలేదు. నాకు తెలిసి ఆయనకు డబ్బుపై ఎన్నడూ ఆశలేదు. అలాంటి వ్యక్తిపై సీబీఐ విచారణ చేస్తామని, కేసులు వేస్తామని అంటే.. ఇందుకు ఎవరు కారణం? ఈ వయసులో ఆయనపై సీబీఐ కేసులేంటి? ఏం ఖర్మ? ఇలాంటి వాళ్లను ఎందుకు భరించాలి? ఎందుకు ప్రొటెక్ట్‌ చేయాలి? బీఆర్‌ఎస్‌ తమ్ముళ్లకు నాపై కోపం రావచ్చు. వాస్తవాలు చేదుగా ఉన్నా.. మందులాగా అప్పుడప్పుడు మాట్లాడితేనే ఆరోగ్యంగా ఉంటుంది’’ అని కవిత వ్యాఖ్యానించారు.

హరీశ్‌, సంతోష్‌ వెనక రేవంత్‌రెడ్డి..

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమని కవిత మండిపడ్డారు. ఏసీబీ మగ్గురు కాళేశ్వరం ఇంజనీర్లను పట్టుకుంటే, ఒక్కో ఇంజనీరు దగ్గర వందల కోట్ల ఆస్తులు బహిర్గతమైతే.. విచారణ చేసే దమ్ము ప్రభుత్వానికి లేకుండాపోయిందని ధ్వజమెత్తారు. వారి వెనకాల ఎవరున్నారని ప్రశ్నించారు. ‘‘హరీశ్‌రావు, సంతో్‌షరావు వెనక రేవంత్‌రెడ్డి ఉండి కాపాడుతున్నారు. బాణం గురి ఎంతసేపూ కేసీఆర్‌పైనే ఉంది. అందుకే అన్ని విషయాల్లో వాళ్లను ఏమీ అనరు. వాళ్ల గురించి మాట్లాడరు. ఈ అవినీతి అనకొండలతో రేవంత్‌కు ఉన్న రహస్య ఒప్పందం బహిర్గతం కావాలి. పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికలో ఏముందో చెప్పకుండానే టక్కున సీబీఐకి ఇస్తామనడం ముందస్తు కుట్ర. కేసీఆర్‌ ప్రతిష్ఠను దెబ్బతీయడమే వారి లక్ష్యం. మీరు బట్టకాల్చి మీదవేసినట్లు ఆరోపణలు చేయడం కాదు. నేను డిమాండ్‌ చేస్తున్నా.. పేర్లు కూడా చెప్పాను. దమ్ము ధైర్యం ఉంటే వారిపై విచారణ చేయించాలి. వాస్తవాలు బయటపెట్టి వారితో అండర్‌స్టాండింగ్‌ లేదని నిరూపించుకోవాలి’’ అని కవిత సవాల్‌ చేశారు.


ఎవరో చెబితే ఆడే తోలుబొమ్మను కాదు..!

తాను తన తండ్రికి రాసిన లేఖను లీక్‌ చేసిన సందర్భంలో అసలు విషయాలు బహిర్గతం చేసినందుకు 90 రోజులుగా తనను దుష్ప్రచారాలతో వేధిస్తున్నారని కవిత తెలిపారు. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో వాస్తవాలు మాట్లాడినందుకూ వాళ్ల సోషల్‌ మీడియా బ్యాచ్‌లు రేపటి నుంచి అడ్డగోలు విమర్శలు చేస్తాయన్నారు. ‘‘నన్ను బీజేపీ ఆపరేట్‌ చేస్తుందంటారు. కాంగ్రెస్‌ ఆపరేట్‌ చేస్తుందంటారు. ఒకరు రేవంత్‌రెడ్డి చెబితే మాట్లాడుతుందని, మరొకరు బండి సంజయ్‌ చెబితే మాట్లాడుతుందంటూ దుష్ప్రచారం చేస్తారు. ఖబడ్దార్‌ బిడ్డా.. నేను ఎవరో చెబితే ఆడే తోలుబొమ్మను కాదు. నాది కేసీఆర్‌ రక్తం.. తెలంగాణ బ్లడ్‌. వ్యక్తిగతంగా నేను అనుకున్న విషయాన్ని చెబుతున్నా. దానికి రాజకీయంగా ఇబ్బంది అయినా, నష్టమయినా, కష్టమయినా.. నేనే భరిస్తా’’ కవిత స్పష్టం చేశారు. ఆ

ఇలాంటి పార్టీ ఉంటే ఏంది? పోతే ఏంది?

దేశంలో ఎక్కడికి వెళ్లినా.. కేసీఆర్‌ మహానాయకుడు అంటారని కవిత తెలిపారు. ఇప్పుడు సీబీఐ విచారణ జరిపితే.. ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. ‘‘మా నాన్న పరువు పోతే నాకు బాధ. మీకా? వాళ్లకు పైసలు కావాలె. పేరుతో ఏం పని? ఇంక కూడా ఇటువంటి విషయాలు అర్థం చేసుకోకుండా, ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టకుంటే.. ఇలాంటి పార్టీ ఉంటే ఏంది? పోతే ఏంది? బీఆర్‌ఎస్‌ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే. స్థానిక ఎన్నికల్లో నష్టం జరుగుతదని అనుకున్నా సరే. మా నాన్నమీద సీబీఐ విచారణ పడ్డాక ఏముంది? ఎలక్షన్‌లో ఒకరు గెలుస్తరు, ఒకరు ఓడిపోతరు. అసలు పార్టీ ఓడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల ్లకాదా? ఊ అంటే.. మా దగ్గర పైసలున్నయని, టీవీలున్నయని, సోషల్‌ మీడియాలుయని ఎటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తం. గీత గీసుకుంటం బిడ్డా. మీరు ఒక కామెంట్‌ పెడితే.. మేం పది పెడతాం. ఇంతకాలం చూస్తూ ఊరుకున్నా. పెద్ద సారు దగ్గరికి వచ్చాక ఇక కాంప్రమైజ్‌ అయ్యేది లేదు. నిజంగానే ఆయన అవినీతికి పాల్పడితే వేరుమాట. కేసీఆర్‌కు ఎప్పుడూ తెలంగాణ ధ్యాసే.. అదే పిచ్చి. అలాంటి వ్యక్తిపై ఏది వడితే అది మాట్లాడితే.. రియాక్ట్‌ కాకపోవడం చాలా దారుణం. సీబీఐ విచారణ చేస్తున్నామని రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటిస్తే.. తెలంగాణ బంద్‌కు పిలుపు ఇవ్వొద్దా? తెలంగాణ భగ్గుమనొద్దా? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఏదేమైనా సీబీఐ విచారణ చేసినా.. కేసీఆర్‌ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు’’ కవిత పేర్కొన్నారు.


మూడు పిల్లర్లు కుంగిపోతే రెండున్నరేళ్లుగా లొల్లి!

కేసీఆర్‌ తరతరాలకు తరగని ఆస్తిలా కట్టిన కాళేశ్వరాన్ని బద్నామ్‌ చేస్తున్నారని కవిత అన్నారు. ‘‘మహాసముద్రం లాంటి కాళేశ్వరంలో చిన్న పార్ట్‌ అయిన మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగిపోతే.. ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని రెండున్నరేళ్లుగా లొల్లి పెడుతున్నారు. నేను 2006 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నాను. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రజల విషయం తప్ప.. వ్యక్తిగత విషయాలు మాట్లాడరు. అటువంటి మహానాయకుడు అవినీతికి పాల్పడ్డారని, లక్ష కోట్లు దోచుకున్నారని, నిజాం కన్నా ధనికుడు కావాలనుకున్నారని అంటున్నారు. అవును కచ్చితంగా నిజాం బాటలోనే నడుస్తాం. నిజాం కట్టిన ఉస్మాన్‌సాగర్‌ నీళ్లే కదా.. నేటికీ హైదరాబాద్‌ ప్రజలు తాగుతున్నది! ఆ నిజాం స్ఫూర్తి అని మా నాన్న చాలాసార్లు చెప్పారు. కచ్చితంగా 200 ఏళ్లు తెలంగాణ ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన కేసీఆర్‌ను తలుచుకుంటారు. కేసీఆర్‌కు ఉన్న అవగాహన, ఉమ్మడి ఏపీలో ఆయన అనుభవించిన వివక్ష, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రస్తుత సీఎంకు తెలియదు. నేటికీ ఆయన పక్క రాష్ట్రం ఎజెండాను అమలు చేస్తున్న వ్యక్తి. బనకచర్ల కడతామంటే మాట్లాడని వ్యక్తి.. కేసీఆర్‌ గురించి అసెంబ్లీలో ఉదయం నుంచి రాత్రి వరకు అనరాని మాటలు అంటుంటే నా గుండె బరువెక్కింది. ఇదే రేవంత్‌రెడ్డి గతంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘కేసీఆర్‌కు పైసల మీద ఆశలేదు. పాపం ఆయన మీటింగ్‌ పెట్టాలంటే కూడా.. అప్పుడు పైసల గురించి చూస్తారు’ అన్నారు. అటువంటి ఆలోచన ఉన్న వ్యక్తిమీద ఇంత కుట్రపూరితంగా అభాండాలు ఎందుకు వేస్తున్నారు? ప్రజలు తిరగబడతారనుకుంటే.. ప్రభుత్వం తప్పులు బయటపడతాయంటే.. కేసీఆర్‌పై ఆరోపణ చేయాలి. ఆయన పేరు చెప్పకుంటే రేవంత్‌రెడ్డి ఫొటో కూడా పేపర్లో వేయరని ఆయన్ను విమర్శిస్తున్నారు. సెప్టెంబర్‌ 30లోపు ఎన్నికలు పెడతామని, 50శాతం రిజర్వేషన్లు ఎత్తేస్తామని అంటున్నారు. రాహుల్‌గాంధీ బిహార్‌ ఎన్నికల ప్రచారం కోసం బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ రోజుకో కొత్తకథ చెబుతోంది. గవర్నర్‌ వద్ద పెండింగ్‌ పెడితే.. సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడంలేదు? బిహార్‌ ఎన్నికల కోసమే బీసీ బిడ్డలను రేవంత్‌రెడ్డి బలి పెడుతున్నారు. ఇలాగే చేస్తే.. కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా బిహార్‌కు వెళ్లి ప్రచారం చేస్తాం’’ అని కవిత హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ

తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు

For More TG News And Telugu News

Updated Date - Sep 02 , 2025 | 07:10 AM