Share News

Kavitha: నాన్నా.. జాగ్రత్త..!

ABN , Publish Date - Sep 04 , 2025 | 03:59 AM

బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, సంతోష్‌రావుపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్‌, సంతోష్‌ అవినీతి వల్లే కేసీఆర్‌కు సీబీఐ మరక అంటిందని చెప్పారు. కాళేశ్వరం అవినీతి డబ్బుతోనే హరీశ్‌రావు 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు సొమ్ములు ఇచ్చారని ఆరోపించారు.

Kavitha: నాన్నా..  జాగ్రత్త..!

మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి.. కేటీఆర్‌కూ ప్రమాదం పొంచి ఉంది

రామన్నా.. నాన్న ఆరోగ్యాన్ని, పార్టీని కాపాడుకో

కాళేశ్వరం డబ్బుతో 25 మంది ఎమ్మెల్యేలకు హరీశ్‌ ఫండింగ్‌

సిరిసిల్లలో కేటీఆర్‌ను ఓడించేందుకు రూ.60 లక్షలు పంపారు

సంతోష్‌కి ధన దాహం.. అడవులను కొట్టేయాలని చూశారు

మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్లకు అధికారం అన్న కుట్ర

అందులో భాగంగానే మొదట నన్ను బయటకు పంపారు

హరీశ్‌రావు వల్లే విజయశాంతి, ఈటల బీఆర్‌ఎ్‌సను వీడారు

ఫోన్‌ట్యాపింగ్‌ చేసింది హరీశ్‌, సంతోష్‌, శ్రవణ్‌రావులే..

నా సిబ్బంది, రామన్న సిబ్బంది ఫోన్లనూ ట్యాప్‌ చేశారు

రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సరెండరైందినిజం కాదా?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

బీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా

హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, సంతోష్‌రావుపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్‌, సంతోష్‌ అవినీతి వల్లే కేసీఆర్‌కు సీబీఐ మరక అంటిందని చెప్పారు. కాళేశ్వరం అవినీతి డబ్బుతోనే హరీశ్‌రావు 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు సొమ్ములు ఇచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను తన వెంట ఉంచుకొని పార్టీకి నష్టం చేయాలన్న కుట్రతోనే పార్టీ ఫండ్‌ కాకుండా ఆయన సొంత డబ్బులు ఇచ్చారన్నారు. ఆ ఎమ్మెల్యేల పేర్లూ తనకు తెలుసని, వారికి ఇబ్బంది కలిగించే ఉద్దేశం లేదు కాబట్టి వారెవరన్నది బయటపెట్టనని చెప్పారు. అలాగే సిరిసిల్లలో కేటీఆర్‌ను ఓడించేందుకు హరీశ్‌ ఓ వ్యక్తికి రూ.60 లక్షలు ఇచ్చారని.. అతనే తనకీ విషయం చెప్పారని అన్నారు. అత్యధిక ధనదాహం ఉన్న సంతోష్‌రావు ఏకంగా అడవులను కొట్టేయాలని చూశారని.. ప్రభుత్వం హరితహారం చేపడితే, ఆయన గ్రీన్‌ చాలెంజ్‌ పేరుతో కోట్లు కొల్లగొట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. బంగారు తెలంగాణ అంటే హరీశ్‌రావు, సంతోష్‌రావు ఇళ్లల్లో బంగారం ఉంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ‘‘నాన్నా.. జాగ్రత్త. మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి, బీఆర్‌ఎస్‌ పార్టీని ఆక్రమించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. మీ చుట్టూ ఏం జరుగుతుందో ఓసారి చూసుకోండి’’ అంటూ తండ్రి కేసీఆర్‌ను హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ నుంచి కవితను సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో బుధవారం జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్‌, సంతోష్‌ల అవినీతిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి, హరీశ్‌ ఒకే విమానంలో ప్రయాణం చేసిన విషయం నిజం కాదా..? అని కవిత ప్రశ్నించారు. ఆ రోజే వాళ్లిద్దరి మధ్య బంధం పెరిగిందని, తాను చెప్పేది తప్పయితే హరీశ్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌కు హరీశ్‌ సరెండరైన తర్వాతే తనపై కుట్రలు మొదలయ్యాయన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చేసిన రాజీనామా లేఖను కేసీఆర్‌కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా లేఖను మండలి చైర్మన్‌కు పంపుతున్నట్లు కవిత ప్రకటించారు. పార్టీలో ఉంటూ కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్లు తాను, కేసీఆర్‌, కేటీఆర్‌ కలిసి ఉండకూడదని కుట్రలు చేశారని ఆరోపించారు.


తమ కుటుంబం విచ్ఛిన్నమైతే బీఆర్‌ఎస్‌ పార్టీని హస్తగతం చేసుకోవాలని హరీశ్‌రావు, సంతోష్‌రావు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే మొదట తనను బయటకు పంపారని, రేపు రామన్నకూ ఇదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. ‘‘ఆరడుగుల బుల్లెట్టు స్వార్థం వల్లే ఈ రోజు నాకు గాయమైంది. రేపు రామన్నకు, మరో రోజు నాన్నకూ ప్రమాదం తప్పదు’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ట్రబుల్‌ షూటర్‌ కాదు.. బబుల్‌ షూటర్‌ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో మాట్లాడి రెండో అభ్యర్థిని పెట్టాలని హరీశ్‌రావు ప్రతిపాదించారని.. ఆ విషయం బీజేపీ ఎమ్మెల్యే ఒకరు తనకు చెబితే, కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లానని కవిత వెల్లడించారు. ట్రబుల్స్‌ ఆయనే క్రియేట్‌ చేసి.. తర్వాత తానే పరిష్కరిస్తున్నట్లు నటించడం హరీశ్‌ నైజం అన్నారు. ‘‘హరీశ్‌కు పాల వ్యాపారం ఉండేది. అధికారంలోకి రాగానే హాస్టళ్లకు పాలు సరఫరా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్‌రెడ్డి అంటారు. కానీ, ఆయనపై ఎటువంటి కేసులుండవు. అదే కేటీఆర్‌ను పనికిరాని కేసులు పెట్టి, పదేపదే విచారణకు పిలుస్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరం అంశంలో కేసీఆర్‌ను టార్గెట్‌ చేశారు. ఆయనపై సీబీఐ విచారణకు కారణం హరీశ్‌, సంతోష్‌లే. హరీశ్‌పై మొదటి రోజు ఆరోపణలు వస్తాయి. రెండో రోజు నుంచి ఆయన పేరు కనిపించదు. రేవంత్‌రెడ్డి గురించి హరీశ్‌ ఏనాడూ మాట్లాడలేదు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? హరీశ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేద ని రేవంత్‌ను నిలదీస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి హరీశ్‌రావు లేరు. పార్టీ పెట్టిన 10 నెలల తర్వాత వచ్చారు. గతంలో పార్టీకి కొంచెం చెడ్డపేరు రాగానే హరీశ్‌ వెళ్లి వైఎ్‌సని కలవలేదా?’’ అని కవిత ప్రశ్నించారు.

హరీశ్‌ను నమ్ముకున్న ఎందరో బీఆర్‌ఎ్‌సను వీడారు

హరీశ్‌రావును నమ్ముకున్న ఈటల రాజేందర్‌, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు.. ఇలా ఎందరో బీఆర్‌ఎస్‌ పార్టీని వీడారని కవిత చెప్పారు. ‘‘కాళేశ్వరం నివేదికపై అర్ధరాత్రి దాకా అసెంబ్లీలో చర్చ జరిగింది. హరీశ్‌రావు బ్రహ్మాండంగా మాట్లాడారని పొగడ్తలు గుప్పిస్తున్నారు. కానీ, ఆ ఆరడుగుల బుల్లెట్టు నాకు గాయం చేసింది. ఆ తర్వాత మీవంతే రామన్నా. జాగ్రత్తగా ఉండండి’’ అని కేటీఆర్‌కు సూచించారు.


రామన్నా.. బుజ్జగించి అడుగుతున్నా..

‘‘నేను రామన్న (కేటీఆర్‌)ను గడ్డం పట్టుకొని, బుజ్జగించి అడుగుతున్నా. ఒక చెల్లిని, మహిళా ఎమ్మెల్సీని అయిన నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పా. మీరు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఏం జరిగిందో నాకు ఫోన్‌ చేసి కనీసం అడగరా? నేను ప్రెస్‌మీట్‌ పెడితేనే న్యాయం జరగలేదంటే.. మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా? సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌ ఎప్పుడో లొంగిపోయారు. ఆయన్ను గమనించుకో రామన్నా. కేసీఆర్‌ ఆరోగ్యాన్ని, పార్టీని కాపాడుకో. శరీరం బీఆర్‌ఎస్‌ అయితే.. జాగృతి ఆత్మ లాంటిది. తెలంగాణ సంస్కృతి, చరిత్రను కాపాడేందుకు కృషి చేశా. పార్టీ అభివృద్ధిలో నా పాత్ర లేదా? మేకవన్నె పులులను పార్టీలో ఉంచుకుంటే ఎలా ఉంటుందో బీఆర్‌ఎస్‌ పెద్దలు ఆలోచించాలి. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. వాళ్లు ఇంతకు అంత అనుభవించే రోజు వస్తుంది’’ అని కవిత హెచ్చరించారు. కేసీఆర్‌పై ఒత్తిడి ఉండడం వల్లే తనను సస్పెండ్‌ చేయాల్సి వచ్చిందని భావిస్తున్నానని చెప్పారు. ఆయన ఎప్పుడూ ఆడబిడ్డల చెడు కోరుకోరన్నారు. కుటుంబంలో ఎన్నో అవమానాలు జరిగాయని, అవన్నీ బయటకు చెప్పుకోలేనని అన్నారు. అందుకే పార్టీ పరంగా ఉన్న సమస్యల గురించి మాత్రమే మాట్లాడానని, నిజాయితీని నిరూపించుకునేందుకే రాజీనామా చేశానని చెప్పారు. పార్టీ నుంచి బయటకు వెళ్తున్నందుకు బాధగా లేదన్నారు. రాజకీయంగా పొరపచ్చాలు ఇవ్వాళ ఉంటాయి, రేపు పోతాయని చెప్పారు. కానీ, తన తల్లికి దూరంగా ఉండాల్సి రావడమే బాధిస్తోందని కవిత ఉద్వేగానికి గురయ్యారు.

సంతోష్‌రావుకు ధనదాహం ఎక్కువ..!

‘‘సంతోష్‌రావు.. చెప్పులో రాయి, చెవిలో జోరీగ లాంటోడు. అతనికి ధనదాహం ఎక్కువ. పెద్ద సార్‌ తెలంగాణ బాగు కోసం హరితహారం పేరిట మంచి కార్యక్రమం చేపడితే.. గ్రీన్‌ చాలెంజ్‌ అంటూ సంతోష్‌రావు నకిలీ ప్రోగ్రాం పెట్టి, సినీనటులతో ఫొటోలకు పోజులిప్పిస్తారు. దాని వెనక ఉన్న కుట్ర ఏంటంటే.. సంతోష్‌ కోసం వెంటనే ప్రభుత్వం నుంచి జీవో అమెండ్‌మెంట్‌ అవుతది. 10 శాతం ఆదాయం ఎవరైనా ఇస్తే.. అడవులను అమ్యూజ్‌మెంట్‌ పార్కులకు ఇస్తారు. చిరంజీవి, ప్రభాస్‌ వంటి సినిమా నటులను మోసం చేసి వాళ్లను తీసుకెళ్లి.. ఫొటోలకు పోజులిచ్చి, ఫారెస్టులను కొట్టేయాలని ఆయన ప్లాన్‌. ఈ సంతోషన్నకు ఇద్దరు ముగ్గురు మనుషులుంటారు. వాళ్లను సంప్రదించి.. అటవీ పరిరక్షణ పేరుతో వాళ్ల ఫొటోలు తీయించి, అడవులను కొట్టేయాలని చూశారు. రామన్న నియోజకవర్గం నేరెళ్లలో ఇసుక లారీ గుద్ది, దళిత బిడ్డ చనిపోతే నిరసన చేపట్టిన ఏడుగురు దళితులపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి విపరీతంగా కొట్టారు. పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పి కొట్టించింది సంతోష్‌ అయితే, రాజకీయంగా బద్నామ్‌ అయింది మాత్రం రామన్న. ఇక పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన్ను ఇప్పుడు శ్రీమంతుడని అక్కడి ప్రజలు పిలుస్తున్నారు. నాకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పిన సమాచారం ప్రకారం.. ఓ కంపెనీతో కలిసి ఇదే పోచంపల్లి మోకిలలో రూ.750 కోట్లతో విల్లా ప్రాజెక్టులు చేస్తున్నారు. అవినీతి డబ్బులు కావా? ఆయనెవరు? సంతోష్‌రావు క్లాస్‌మేట్‌. ఆయనకు ఎమ్మెల్సీ పదవి వస్తుంది. కాంట్రాక్టులు వస్తాయి. అదేవిధంగా నవీన్‌రావు అనే ఎమ్మెల్సీ మాముందే ‘నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆరే అయినా. నా దేవుడు సంతోష్‌రావు’ అని అంటారు. ఈయనపై భూకబ్జా కేసులుంటే అవి కూడా వదిలేశారు. నా దగ్గరున్న సమాచారాన్ని బయటపెడితే బీఆర్‌ఎస్‌ నేతలందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. భవిష్యత్తుపై ఎలాంటి ప్రణాళికలు లేవు. ఏ పార్టీలో చేరను. ముఖ్యులతో సంప్రదించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తా’’ అని కవిత చెప్పారు.


నాడు సమీక్షించుకుంటే..

‘‘ఓ వైపు సంతోష్‌రావు, హరీశ్‌రావు గ్యాంగ్‌.. కాంగ్రెస్‌ పార్టీతో, పైన ఉన్న బీజేపీతో సమన్వయం చేసుకుంటూ బీఆర్‌ఎ్‌సను జలగల్లాగా పట్టి పీడిస్తున్నారు. ఎంత దారుణానికి ఒడిగడుతున్నారంటే.. నా ఓటమితోనే అది ప్రారంభమైంది. నా ఓటమికి కుట్రలు చేస్తే సమీక్షించుకోలేదు. కామారెడ్డిలో కేసీఆర్‌ ఓడిపోవడంతో పాటు మూడోసారి అధికారం కోల్పోయే పరిస్థితికి చేరింది. గెలిచిన, ఓడిన వారందరినీ పిలిపించి మీరు మాట్లాడండి. సంతోష్‌రావు బాధితులు నాకు మామూలుగా ఫోన్లు చేయడం లేదు. బ్లూఫిన్‌ మోకిల.. ఇంత స్పష్టమైనవి నేను ఇస్తున్నా.. రేవంత్‌రెడ్డిని చాలెంజ్‌ చేస్తున్నా.. ఎందుకు మీ ఏసీబీ వాళ్లకు వీళ్ల ఇంటి అడ్ర్‌సలు దొరకడం లేదా? మీ మధ్య అండర్‌స్టాండింగ్‌ లేకపోతే మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నా. నాకు 27 ఏళ్లు ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం వచ్చా. 20 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డా. ఇప్పుడు సస్పెండ్‌ చేస్తే చాలా బాధపడ్డా. సంతోష్‌ వల్లే మాకు సంబంధించిన టీవీ, పేపర్లలోనూ నా వార్తలు రావడం లేదు. సంతోష్‌, హరీశ్‌ గ్యాంగులు కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాయి. వారిని పక్కన పెడితేనే పార్టీ బతుకుతుంది’’ అని కవిత పేర్కొన్నారు.

కేటీఆర్‌ సిబ్బంది ఫోన్లు కూడా..

తన వద్ద పనిచేసే సిబ్బంది ఫోన్లను కూడా హరీశ్‌రావు, సంతోష్‌రావు, శ్రవణ్‌రావు ట్యాపింగ్‌ చేశారని కవిత ఆరోపించారు. అదే బ్యాచ్‌ కేటీఆర్‌కు సంబంధించిన వారి ఫోన్లను కూడా ట్యాపింగ్‌ చేసిందన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తమ కుటుంబంలోని నలుగురికి నోటీసులు వచ్చాయని.. హరీశ్‌, సంతోష్‌రావుకు మాత్రం రాలేదని చెప్పారు. కేసీఆర్‌కు తాను రాసిన లేఖను బహిర్గతం చేసింది కూడా సంతోష్‌రావే అని, ఓ టీవీ ఛానెల్‌కు, కాంగ్రెస్‌ నేతలకూ ఆయన లీక్‌ చేశారని తెలిపారు. ఈ గ్యాంగ్‌ గురించి కేసీఆర్‌కు గతంలో తాను స్వయంగా చెప్పానని.. బీఆర్‌ఎ్‌సలో ఉండి ఇంతకాలం అంతర్గతంగా పోరాడానని, ఇప్పుడు బయటకు వచ్చి పోరాడతానని కవిత వెల్లడించారు.


ఇవన్నీ.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలా?

అక్రమ కేసుల్లో అరెస్టయి, తిహాడ్‌ జైల్లో ఐదున్నర నెలలు ఉండి వచ్చాక గత ఏడాది నవంబరు 23 నుంచి ప్రజాక్షేత్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని కవిత చెప్పారు. గురుకులాల్లో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడానని, బీసీ రిజర్వేషన్లు, మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం అందించాలని పోస్టు కార్డు ఉద్యమం చేశామని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని మార్చినప్పుడు గళమెత్తి నినదించామన్నారు. సీఎం సొంత జిల్లాలో భూ నిర్వాసితులకు అండగా ఉన్నామన్నారు. పార్టీ శ్రేణులు హాజరయ్యేలా చూడాలని తెలంగాణ భవన్‌ కార్యాలయ కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి ద్వారా ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులకు సమాచారం ఇప్పించినట్లు ఆమె వెల్లడించారు. ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై బీఆర్‌ఎస్‌ పెద్దలు పునరాలోచించాలన్నారు.

పనిగట్టుకొని తప్పుడు ప్రచారం

పనిగట్టుకొని తనపై తప్పుడు ప్రచారం చేశారని.. తాజా పరిణామాలు తనను ఎంతో బాధ పెట్టాయని కవిత అన్నారు. ‘‘ఎన్నో జన్మల పుణ్యముంటే కేసీఆర్‌కు కూతురిగా పుట్టా. కేసీఆర్‌ను, పార్టీని నేనెందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటా? అధికారంలో ఉన్నప్పటికీ నన్ను ప్రతిపక్ష ఎంపీగానే చూశారు. పార్టీ భవిష్యత్తు గురించి, కుట్రదారుల వల్ల తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడా. కనీసం నా వివరణ కూడా తీసుకోకుండానే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం వెనక కుట్రదారులు ఉన్నారు. కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా బీసీ అంశంపై మాట్లాడుతుంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని ప్రచారం చేశారు. సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నానని చెబితే దాన్ని కూడా వక్రీకరించి దుష్ప్రచారం చేశారు. కేసీఆర్‌ చిటికెన వేలు పట్టుకొని ఓనమాలు నేర్చుకున్నా. ఆయన స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ అని మాట్లాడా. స్వతంత్ర భారతంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్‌. ఆయన చెప్పింది చెప్పినట్లు చేశారు. అది సామాజిక తెలంగాణ కాదా? నేను తప్పు మాట్లాడానా? సామాజిక తెలంగాణ బీఆర్‌ఎ్‌సకు అవసరం లేదా?’’ అని కవిత వ్యాఖ్యానించారు.


రాజీనామా లేఖల అందజేత

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ కల్వకుంట్ల కవిత రాసిన లేఖను జాగృతి నాయకులు బుధవారం చైర్మన్‌ కార్యాలయ ఓఎస్డీకి అందజేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చేసిన రాజీనామా లేఖను తెలంగాణభవన్‌ కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డికి అందజేశారు. కాగా, నిజం మాట్లాడినందుకు తనను పార్టీ నుంచి తొలగించారని.. ఇదే మూల్యం అయితే, తెలంగాణ ప్రజల కోసం వంద రెట్లు చెల్లించుకునేందుకు సిద్ధమని కవిత ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘సత్యమేవ జయతే.. జై తెలంగాణ’ అని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..

వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత

Updated Date - Sep 04 , 2025 | 03:59 AM