Justice PC Ghosh KCR: కేసీఆర్ పాపమే
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:01 AM
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల కుంగుబాటుకు, రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం కలగడానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నిర్ణయాలే కారణమని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది.
ఆయన వల్లే కాళేశ్వరం కుంగుబాటు.. ఖజానాకు భారీ నష్టం
ఆయన పై చట్టపరంగా చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది
కేసీఆర్ కల నిజం చేసే బాధ్యతను నాటి మంత్రి హరీశ్ తీసుకున్నారు
అప్పటి ఆర్థిక మంత్రి ఈటల నిశ్శబ్ద నేరస్థుడిలా సహకరించారు
సోలో నిర్ణయాలు, ప్రణాళికలు, డిజైన్ లోపాలు, ఆర్థిక అవకతవకలు
బాధ్యులైన అధికారులపై జాలి వద్దు.. కఠిన చర్యలు తీసుకోవాల్సిందే
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో పలు కీలక సిఫారసులు
క్యాబినెట్ ముందుంచాం.. ఏమో తెలియదు!.. స్మిత భిన్న జవాబులు
ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న కమిషన్
హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల కుంగుబాటుకు, రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం కలగడానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నిర్ణయాలే కారణమని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. ఒంటెద్దు పోకడతో ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారని, బ్యారేజీలు ఎక్కడ కట్టాలనే నిర్ణయంలో తీవ్ర తప్పిదాలు జరిగాయని పేర్కొంది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక, మంత్రివర్గం ఉపసంఘం, హైపవర్ కమిటీ.. ఏదీ కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల దగ్గర బ్యారేజీలు కట్టాలని సిఫారసు చేయలేదని, అది కేసీఆర్ సోలో నిర్ణయం అని నిర్ధారించింది. కేసీఆర్‌పై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఆదేశించిందన్న కారణంతో తప్పిదాలకు పాల్పడ్డ అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని.. వారిని శిక్షించాల్సిందేనని సిఫారసు చేసింది. మూడు బ్యారేజీల నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి కుంగే దాకా ప్లానింగ్, టెండరింగ్, పర్యవేక్షణలో విచ్చలవిడితనం, ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని కమిషన్ గుర్తు చేసింది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసిందన్న కేసీఆర్, హరీశ్, ఈటల వాదనను కమిషన్ తప్పుబట్టింది. 2016 మార్చి 7న మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తే.. అంతకు ముందే.. 2015 ఏప్రిల్ 13న మేడిగడ్డ (కాళేశ్వరం) నిర్మాణానికి సవివర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసే పనినిజీవోనెం.212 ద్వారా వ్యాప్కో్‌సకు అప్పగించారని గుర్తుచేసింది. ఈ ఈ నోట్ ఫైల్‌ను 2016 జూన్ 3న నాటి సీఎం కేసీఆర్, నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ర్యాటిఫై చేస్తూ సంతకాలు కూడా చేశారని గుర్తుచేసింది. ర్యాటిఫై చేయడానికి ముందే.. డీపీఆర్ కోసం సవరించిన పరిపాలనపరమైన అనుమతిని 2016 జనవరి 18న ఇచ్చారని పేర్కొంది. డీపీఆర్‌లో కొంతభాగాన్ని 2016 జనవరి 17న జరిగిన సమావేశంలో ఆమోదించారని.. ఆ వివరాలు ప్రభుత్వం వద్ద లేవని పేర్కొంది. 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగగా.. తర్వాత కొద్దిరోజులకే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు బయటపడ్డ సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు దీనిపై జస్టిస్ పినాకీ చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆదివారం శాసనసభలో బహిర్గతం చేసింది.

కేసీఆర్, హరీశ్ సంతకాలే.. ఈటల సంతకమేదీ?
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల విషయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిలాగా కాకుండా ఇంజనీర్‌లాగా నిర్ణయం తీసుకున్నారని ఘోష్ కమిషన్ నివేదిక నిగ్గుతేల్చింది. బ్యారేజీలు ఎక్కడ కట్టాలనే విషయంతోపాటు.. వాటి అలైన్‌మెంట్ ప్రణాళిక, ఎంత సామర్థ్యంతో కట్టాలనే నిర్ణయం తీసుకోవడానికి గూగుల్ మ్యాప్‌లు కూడా వాడారని చెప్పింది. దీనిపై 2016 మార్చి 7న వేసిన మంత్రివర్గ ఉపసంఘం కూడా.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి సిఫారసు చేయలేదని కమిషన్ నిగ్గుతేల్చింది. సీఎం, మంత్రి మాత్రమే సంతకాలు చేశారని, వ్యాప్కో్‌సకు పని అప్పగింత నిర్ణయాన్నీ మంత్రివర్గం ఆమోదించలేదని గుర్తు చేసింది. బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించిన నోట్ ఫైళ్లలోనూ కేసీఆర్, హరీశ్‌రావు సంతకాలు మాత్రమే ఉన్నాయని, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సంతకం కనబడలేదని కమిషన్ గుర్తు చేసింది. బ్యారేజీల నిర్మాణ అంచనాలను సిద్ధం చేయాలని 2016 జనవరి 17న కేసీఆర్ ఆదేశాలు ఇవ్వగా... ఐబీఎం కమిటీ అదే సంవత్సరం ఫిబ్రవరి 11న అంచనాలను ఆమోదించిందన్నారు. మంత్రివర్గ ఆమోదం లేకుండానే.. 2016 మార్చి 1న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు పాలనపరమైన అనుమతులిచ్చారని తేల్చింది. డ్యామ్ బ్రేక్ అనాలసిస్ పనులను రూ.0.708 కోట్లతో చేపట్టడానికి ఈఎన్‌సీ మురళీధర్, కాళేశ్వరం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు ప్రతిపాదనలు పంపిస్తే.. నాటి సీఎం కేసీఆర్, మంత్రివర్గ ఆమోదం, ర్యాటిఫికేషన్ లేకుండానే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారని గుర్తు చేసింది.
ముందే నిర్ణయం తీసుకొని..
విచారణకు హాజరైన కేసీఆర్, హరీశ్‌రావు చెప్పినవన్నీ అవాస్తవాలేనని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంపై వ్యాప్కోస్ నివేదిక ఇచ్చాకే నిర్ణయం తీసుకున్నట్టు ఇద్దరూ చెప్పారని, కానీ వాస్తవానికి తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం 2016 మార్చి 8నమహారాష్ట్ర, తెలంగాణ సీఎంల మధ్య అంగీకారం కుదిరితే.. మూడు బ్యారేజీల నిర్మాణం కోసం అంతకంటే ముందే 2016 మార్చి 1న పాలనపరమైన అనుమతుల జీవో ఇచ్చారని, 2016 మార్చి 14న బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన చేశారని.. తుది డీపీఆర్‌ను వ్యాప్కోస్ 2016 మార్చి 27న సమర్పించిందని కమిషన్ గుర్తుచేసింది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించలేదనేది వాస్తవం కాదని, బ్యారేజీని 148 మీటర్లతో కట్టుకోవడానికి సమ్మతి తెలిపిందని పేర్కొంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ ఆలోచన కేసీఆర్‌దేనని, ప్రాణహిత-చేవెళ్ల రీ ఇంజనీరింగ్ నుంచి వ్యాప్కో్‌సకు నామినేషన్ విధానంలో డీపీఆర్ తయారీ బాధ్యతలు అప్పగించడం, అంచనాలను సవరించడం, మంత్రివర్గం ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసే ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం, బ్యారేజీ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి, ఆదేశాలు ఇవ్వడం, నిర్వహణతో పాటు చివరికి బ్యారేజీల వైఫల్యంలో కేసీఆర్‌దే ప్రధాన పాత్ర ఉందని స్పష్టం చేసింది. బ్యారేజీల నిర్మాణ ప్రదేశాలను ఎంపిక చేసింది కేసీఆర్ కాగా.. ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ నిశ్శబ్ద నేరస్తుడిలాగా దీనికి సహ కరించారని, కేసీఆర్ కలను నిజం చేసే బాధ్యతను హరీశ్‌రావు నిర్వర్తించారని కమిషన్ గుర్తు చేసింది.
నిపుణుల కమిటీ నివేదికను దాచి..
జీవో 28 ద్వారా 2015 జనవరి 21న ఏర్పాటు చేసిన మాజీ ఇంజనీర్లతో కూడిన నిపుణుల కమిటీ.. మేడిగడ్డ బ్యారేజీ నిర్ణయం ఏమాత్రం సహేతుకం కాదని, ఆర్థికంగా లబ్ది చేకూరదని.. బదులుగా ప్రాణహితపై వేమనపల్లి వద్ద బ్యారేజీ కట్టాలని సిఫారసు చేసిందని కమిషన్ గుర్తు చేసింది. ఆ నివేదికను దాచిపెట్టి, మేడిగడ్డ నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టాలని హైపవర్ కమిటీ సిఫారసు చేయనే లేదని, కమిటీ సిఫారసులతోనే నిర్ణయం తీసుకున్నారనేది అవాస్తవమని పేర్కొంది.
సీడబ్ల్యూసీ ఆమోదానికి ముందే
కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను ఆమోదం కోసం 2017 ఫిబ్రవరిలో దాఖలు చేయడానికి దాదాపు 11 నెలల ముందే బ్యారేజీల నిర్మాణాలకు పాలనఅనుమతులు ఇచ్చారని.. 2016 జూలై/ఆగస్టులో నిర్మాణ సంస్థలతో ఒప్పందం కూడా చేసుకున్నారని కమిషన్ తేల్చింది. కాళేశ్వరం డీపీఆర్‌ను ఆమోదించడానికి ముందే 2018 మార్చి నాటికే రూ.30,653 కోట్లను వెచ్చించారని గుర్తు చేసింది. 2018 ఏప్రిల్ 13, అదే సంవత్సరం మే 11న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రాసిన లేఖలు పరిశీలిస్తే... కేవలం బెన్‌ఫిట్ కాస్ట్ రేషియోకే సీడబ్ల్యూసీ ఆమోదం ఉందని తెలిపింది. బ్యారేజీల నిర్మాణ స్థలాలపై సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రిసెర్చ్ స్టేషన్ కూడా తమ పరిశీలనలు ఇవ్వడానికి నిరాకరించిందని, 2018 మే 21న సీఎ్‌సఎంఆర్‌ఎస్ లేఖను పరిశీలిస్తే.. ఆ విభాగం పరిశీలనకు ముందే నిర్మాణ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు చేపట్టిన మూడేళ్లలోపు అంచనాలను సవరించరాదని సీడబ్ల్యూసీ పేర్కొనగా.. ప్రాజెక్టు చేపట్టిన మూడేళ్లలోపే 2018, 2022లో రెండుసార్లు నిర్మాణ అంచనాలను సవరిస్తూ పరిపాలనపరమైన అనుమతినిచ్చారని గుర్తు చేసింది. ముఖ్యమంత్రికి, నీటిపారుదల శాఖకి నోట్‌ఫైల్ పంపించ డానికి ముందే సవరించిన అంచనాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 2018 మే 19న ఆమోదించారని, క్యాబినెట్ మాత్రం 2018 మే 27న ఆమోదించిందని కమిషన్ పేర్కొంది. అంచనాలను అడ్డదిడ్డంగా సవరించినట్లు కమిషన్ గుర్తించింది. మేడిగడ్డతో ముడిపడిన పనులన్నీ పూర్తికాకముందే నిర్మాణం పూర్తయినట్లు సర్టిఫికెట్లు జారీ చేశారని గుర్తు చేసింది. బ్యారేజీ నిర్మాణంలో లోపాలు సవరించకుండానే సర్టిఫికెట్లు జారీ చేశారని తప్పుపట్టింది. సర్టిఫికెట్లు జారీ చేసి, మిగిలిన పనులు, లోపాలు సవరించాలని లేఖలు రాశారని.. మేడిగడ్డ నిర్మాణానికి వెచ్చించిన ప్రజాధనాన్ని నిర్మాణ సంస్థ, అధికారులు ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశాలతో, కుట్రపూరితంగా కాజేశారనే ఆధారాలున్నాయని పేర్కొంది. బ్యారేజీల నిర్మాణం జరిగినప్పటి నుంచి అవి విఫలమయ్యేంతవరకూ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పనులు జరగలేదని కమిషన్ గుర్తు చేసింది.
266 సార్లు కేసీఆర్ పేరు ప్రస్తావన హరీశ్‌రావు పేరు 63 సార్లు..
665 పేజీల నివేదికలో కేసీఆర్ పేరును అత్యధికంగా 266 సార్లు ప్రస్తావించారు. ప్రాజెక్టు అంచనాలు పెంచడం, నిపుణుల సూచనలు పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం, నిబంధనలు పాటించకపోవడం, ప్రజాధనం దుర్వినియోగం చేయడం వంటి అనేక అంశాలకు సంబంధించి మొత్తం 19 పేజీల్లో కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. అప్పటి మంత్రి హరీశ్ రావు పేరును నివేదికలో మొత్తం 63 సార్లు ప్రస్తావించారు. నివేదిక చివర్లో జస్టిస్ పీసీ ఘోష్ తన కార్యదర్శి ఎన్.మురళీధర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సహాయం లేకుండా ఈ నివేదికను లోతుగా విశ్లేషించడం సాధ్యమయ్యేది కాదన్నారు. కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఘోష్ ఏకసభ్య విచారణ కమిషన్‌ను గతేడాది మార్చిలో నియమించగా.. జూలై 31న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
గ్యారంటీ ఇచ్చినందున.. ప్రభుత్వమే చెల్లింపులు చేయాలి
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలకు ప్రభుత్వం పూచీ ఇచ్చినందున... రుణాల చెల్లింపు బాధ్యత ప్రభుత్వానిదేనని నాటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు నివేదించారు. ఆ విషయాన్ని కమిషన్ తన నివేదికలో పొందుపర్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వడ్డీల కింద రూ.6,519 కోట్లు, అసలు కింద రూ.7,382 కోట్లను కట్టామని.. కాళేశ్వరం రుణాల వార్షిక వడ్డీ రేటు 9 శాతం నుంచి 10.50 శాతం మధ్యలో ఉందని రామకృష్ణారావు పేర్కొన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణ పరిమితి రూ.24 వేల కొట్లు ఉండగా... దాన్ని 2018లో రూ.64 వేల కోట్లకు, 2019లో రూ.95 వేల కోట్లకు, 2021లో రూ.1.31 లక్షల కోట్లకు చేర్చినట్లు కమిషన్‌కు నివేదించారు. కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి కాళేశ్వరంతో పాటు పాలమూరు-రంగారెడ్డి, సదర్‌మట్ బ్యారేజీ పనులు పూర్తిచేసేందుకు రుణ పరిమితిని పెంచుకున్నామన్నారు. ఆర్థిక శాఖలో ఫైళ్ల క్లియరెన్స్‌కు ఆర్థిక మంత్రి ఆమోదం తీసుకుంటారా అని ప్రశ్నించగా... తీసుకుంటామని బదులిచ్చారు. ఏటా బడ్జెట్‌తో పాటు ఫిస్కల్ పాలసీ స్టేట్‌మెంట్ అసెంబ్లీకి సమర్పిస్తారా అని ప్రశ్నించగా... ఆ వివరాలు గుర్తు లేవు అని వివరించారు. కాగా.. రుణాలు సమీకరించడం, చెల్లింపుల కోసం చెక్కులు ఇవ్వడం తప్ప కాళేశ్వరం నిర్మాణంలో కార్పొరేషన్ పాత్రను ప్రభుత్వం విస్మరించిందని కమిషన్ పేర్కొంది. కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న ఎస్‌కే జోషి కూడా వాస్తవాలు చెప్పలేదని తెలిపింది. కార్పొరేషన్ తన బాధ్యతను నిర్వర్తించలేదనే విషయాన్ని బోర్డు సభ్యుడుగా ఉన్న రామకృష్ణారావు గుర్తించలేదని పేర్కొంది.
29,737 కోట్లు చెల్లించాం: బి.హరిరామ్,మాజీ ఎండీ
కాళేశ్వరం కార్పొరేషన్ కింద రూ.87,449కోట్ల రుణం మంజూరు కాగా... 2024సెప్టెంబరు 25నాటికి రూ.29,737 కోట్ల చెల్లింపులు చేశామని, ఇంకా మిగిలిన అసలు రూ.64,212కోట్లు కాగా.. దీనిపై వడ్డీ రూ.41,638కోట్లుగా ఉంటుందని కాళేశ్వరం కార్పొరేషన్ అప్పటి ఎండీ బి.హరిరామ్ నివేదించారు. కార్పొరేషన్ ప్రారంభించినప్పుడు 3 బ్యారేజీల పరిస్థితి ఏమిటని కమిషన్ ఆరా తీయగా... పనులు జరుగుతున్నాయని హరిరామ్ వివరించారు.
బ్యారేజీల పేరుతో రిజర్వాయర్లు పరీక్షలు లేకుండానే డిజైన్లు/డ్రాయింగ్‌లు
ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత ఉన్నప్పటికీ లేనట్లు ప్రచారం చేశారని, సీడబ్ల్యూసీ నీటి లభ్యతపై రాసిన లేఖ మేడిగడ్డకు కూడా వర్తిస్తుందని కమిషన్ గుర్తు చేసింది. మేడిగడ్డ నిర్మాణ గడువును ఆరుసార్లు, అన్నారం పూర్తి చేసే గడువును ఐదుసార్లు, సుందిళ్ల నిర్మాణ గడువును ఎనిమిదిసార్లు పొడిగించారని గుర్తు చేసింది. వాటి డిజైన్లు/డ్రాయింగ్‌లను పరీక్షలు చేయకుండానే సిద్ధం చేశారని పేర్కొంది. నమూనా అధ్యయనాలు చేయడంలో టీఎ్‌సఈఆర్‌ఎల్ పూర్తిగా విఫలమైందని.. బ్యాక్ వాటర్ అధ్యయనాలు, టెయిల్ వాటర్ రేటింగ్ కర్వ్, జీ-డీ కర్వ్‌లు, జియో టెక్నికల్ అధ్యయనాలు చేయకుండానే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణస్థలాల్ని మార్చారని తప్పుపట్టింది. ఇక.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తేలియాడే నిర్మాణం (పర్‌మియబుల్ ఫౌండేషన్)తో చేపట్టాలని వ్యాప్కోస్ నివేదిక ఇచ్చిందని.. నిర్మాణ ప్రదేశాలు రిజర్వాయర్లు/డ్యామ్‌లు కట్టడానికి అనుకూలం కాకపోయినా.. బ్యారేజీల పేరుతో రిజర్వాయర్లు/డ్యామ్‌లు కట్టారు అని గుర్తు చేసింది. బ్యారేజీలు నీటిని మళ్లించడానికేనని,.. నీటి నిల్వ కోసం కాదని.. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను నీటి నిల్వ కోసం వినియోగించారని త ప్పుపట్టింది. బ్యారేజీలు వైఫల్యం చెందడానికి ఇదే ప్రధాన కారణమని పేర్కొంది.
కమిషన్‌కు తప్పుడు సాక్ష్యాలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై 2016 అక్టోబరు 22న జరిగిన హైపవర్ కమిటీ సమావేశంలో తాను పాల్గొనలేదంటూ సీడీవో ఈఎన్‌సీ ఎ.నరేందర్‌రెడ్డి తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని కమిషన్ గుర్తు చేసింది. ఈఎన్‌సీ బి.హరిరామ్, సీడీవో సీఈ టి.శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఓంకార్ సింగ్ కూడా తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చారని గుర్తు చేసింది.
డీపీఆర్ ఇవ్వడానికి వ్యాప్కో్‌సకు 11 నెలలు.. కేసీఆర్‌కు 15 రోజులు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సవివర ప్రాజెక్టు నివేదిక తయారుచేసే పనిని కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కో్‌సకు 2015 ఏప్రిల్ 13న అప్పగించగా.. ఆ సంస్థ 11 నెలల సమయం తీసుకుని 2016 మార్చి 27న డీపీఆర్‌ను అందజేసింది. రూ.13,593.99 కోట్ల అంచనాలతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అనే మూడు బ్యారేజీలను, ఎత్తిపోతల ద్వారా చేపట్టవచ్చని ఆ సంస్థ తెలిపినట్లు ఘోష్ కమిషన్ పేర్కొంది. వ్యాప్కో్‌సకు డీపీఆర్ చేయడానికి పది నెలలు పట్టగా.. పదిహేను రోజుల్లోనే కేసీఆర్ డీపీఆర్ ఆధారంగా ఐబీఎం కమిటీ మూడు బ్యారేజీలను ఆమోదించిందని కమిషన్ తన నివేదికలో వెల్లడించింది.
ఒప్పంద పత్రాల కోసం 3 కోట్లా!
రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సుందిళ్ల బ్యారేజీకి సవరించిన అంచనాలను ఆమోదించింది. 2021 నవంబరు 18న.. సవరించిన అంచనా-2 అనుమతి కోసం ప్రభుత్వాన్ని కాళేశ్వరం ప్రధాన ఇంజినీరు కోరారు. 25న నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీరు ప్రత్యేక కార్యదర్శికి లేఖ రాసి రూ.2225 కోట్ల రివైజ్డ్ అంచనాలను ఆమోదించాలని అభ్యర్థించారని కమిషన్ నివేదికలో తెలిపింది. నాన్ కాంట్రాక్ట్ ఐటెమ్స్ కింద రూ.5.88 కోట్లు చూపారని, అందులో రూ.3 కోట్లు ఒప్పంద పత్రాలు, ప్రకటనలు, స్టేషనరీ, కన్సల్టెన్సీ ఖర్చుల కింద చూపారని కమిషన్ నివేదికలో ప్రస్తావించింది.
ఇవి కూడా చదవండి
లిక్కర్ కేసులో మాజీ సీఎం జైలుకు పోవటం ఖాయం.. గోనె ప్రకాష్ రావు సంచలన ప్రెస్‌మీట్
మహా గణపతి దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..