Share News

Telangana Rising Global Summit: పెట్టుబడుల సునామీ!

ABN , Publish Date - Dec 09 , 2025 | 04:56 AM

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో పెట్టుబడులు సునామీలా పోటెత్తాయి! తొలిరోజే 35కుపైగా సంస్థలు ఏకంగా రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి......

Telangana Rising Global Summit: పెట్టుబడుల సునామీ!

  • తొలిరోజు సూపర్‌ సక్సెస్‌.. రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన 35 కంపెనీలు

  • ఇంధన రంగంలోనే రూ.లక్ష కోట్లు.. లక్షన్నర ఉద్యోగాలు

  • పదేళ్లలో లక్ష కోట్ల పెట్టుబడి.. తొలిరోజే 41 వేల కోట్ల ఒప్పందాలు: ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌

  • డీప్‌ టెక్‌ రంగంలో బ్రూక్‌ఫీల్డ్‌ యాక్సిస్‌ 75 వేల కోట్లు

  • 31వేల కోట్ల పెట్టుబడులకు ఎవ్రెన్‌/యాక్సి్‌స సంతకాలు

  • రూ.27 వేల కోట్ల పెట్టుబడులకు విన్‌ గ్రూప్‌ సిద్ధం

  • సల్మాన్‌ఖాన్‌ రూ.10 వేల కోట్లు.. మేఘా 8 వేల కోట్లు

  • వంతారా తరహాలో జూ ఏర్పాటుకు రిలయన్స్‌ ఓకే

  • మై హోం నుంచి గ్లోబల్‌ కంపెనీల దాకా ఎంవోయూల వెల్లువ.. సీఎం రేవంత్‌ రెడ్డిపై ప్రశంసల వర్షం

  • తెలంగాణ గ్లోబల్‌ సదస్సు తొలిరోజు సూపర్‌ సక్సెస్‌

హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో పెట్టుబడులు సునామీలా పోటెత్తాయి! తొలిరోజే 35కుపైగా సంస్థలు ఏకంగా రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి! వీటిలో రాష్ట్రంలోని మై హోం, అపోలో గ్రూపుల నుంచి విదేశాల్లోని డొనాల్డ్‌ ట్రంప్‌, విన్‌ గ్రూపులూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచ పారిశ్రామికవేత్తల ముందు ఆవిష్కరించే ప్రధాన ఉద్దేశంతో భారత ఫ్యూచర్‌ సిటీలో ఏర్పాటు చేసిన రెండు రోజుల తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. సదస్సును గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించి మాట్లాడారు. అనంతరం వేదికపై ఆశీనులైన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, నోబెల్‌ బహుమతి గ్రహీత కైలాశ్‌ సత్యార్థి, అపోలో గ్రూపుల ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ శోభన కామినేని, ట్రంప్‌ గ్రూపు డైరెక్టర్‌ ఎరిక్‌ స్విడర్‌ తదితరులు ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి పలువురు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. పలు రాష్ట్రాల పెట్టుబడిదారులు, కన్సల్టెంట్లు, బ్యాంకింగ్‌ ప్రతినిధులు, అనేక రంగాల ప్రముఖులు తరలి వచ్చారు. ప్రధాన వేదిక కిక్కిరిసిపోవడమే కాకుండా పలువురు ప్రతినిధులు నిలబడే ఉండాల్సి వచ్చింది. దాంతో, కార్యక్రమ వ్యాఖ్యాతలు పలుమార్లు వారిని కూర్చోవాలని పిలుపునివ్వాల్సి వచ్చిందంటే సదస్సు ఏ స్థాయిలో విజయవంతం అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఇక, ‘రండి.. మా రాష్ట్రంలోని అవకాశాలు చూడండి’ అని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిస్తే.. వాటిని అందిపుచ్చుకునేందుకు సిద్ధం అంటూ పెట్టుబడిదారులు ఒప్పందాలు చేసుకున్నారు. నిజానికి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ కంపెనీలను ఆహ్వానించడానికి ఇప్పటి వరకూ ప్రభుత్వ ప్రతినిధులు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వెళ్లేవారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుల్లో పాల్గొనేవారు. కానీ, దానికి భిన్నంగా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా దావో్‌సనే హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. హైదరాబాద్‌లో తొలిసారిగా నిర్వహించిన సదస్సు సూపర్‌ హిట్‌ అయింది. తొలిరోజే ఏకంగా 35కిపైగా సంస్థలు రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గత పదేళ్లలో ఎప్పుడూ లేనట్లుగా తెలంగాణకు ఒక విజన్‌ను రూపొందించి.. రాష్ట్రాభివృద్ధికి భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేసిన సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రపంచ ఆర్థిక వేదిక ఎండీ నుంచి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతినిధి ఎరిక్‌ స్విడర్‌ వరకూ ప్రతి ఒక్కరూ ప్రశంసల్లో ముంచెత్తారు.


ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ రూ.41 వేల కోట్లు

తొలిరోజు ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ 41 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలను చేసుకుంది. ఈ సంస్థ తరఫున సమ్మిట్‌కు హాజరైన దాని డైరెక్టర్‌ ఎరిక్‌ స్విడర్‌ అయితే సీఎం రేవంత్‌ను ఆకాశానికి ఎత్తేశారు. అంతేనా.. రాబోయే పదేళ్లలో లక్ష కోట్లు పెట్టుబడి పెడతామని ప్రకటించారు. భారత్‌ ప్యూచర్‌ సిటీలో బ్రూక్‌ఫీల్డ్‌ యాక్సిస్‌ వెంచర్స్‌ కూటమి రూ.75 వేల కోట్లతో గ్లోబల్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌, డీప్‌ టెక్‌ హబ్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అలాగే, పునరుత్పాదక విద్యుత్తు, ఈవీ ఇన్ర్ఫా విస్తరణకు విన్‌ గ్రూప్‌ రూ.27,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

పెట్టుబడులు పెట్టిన ఇతర సంస్థలు ఇవే..

  • స్థానిక వెంచర్లకు సిడ్బీ స్టార్టప్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ సంస్థ రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. దీనికితోడు వరల్డ్‌ ట్రేట్‌ సెంటర్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటుకు రూ.1000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది.

  • ఎవ్రెన్‌/యాక్సి్‌స ఎనర్జీ రూ.31,500 కోట్లతో సోలార్‌ పవర్‌, విండ్‌ పవర్‌ మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది.

  • మేఘా ఇంజనీరింగ్‌ గ్రూప్‌ రూ.8 వేల కోట్లతో సోలార్‌, పంప్డ్‌ స్టోరేజ్‌, ఈవీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది.

  • ఏరో స్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్‌ హాలింగ్‌ (ఎంఆర్‌వో)తోపాటు కార్గో విస్తరణకు జీఎంఆర్‌ గ్రూప్‌ రూ.15,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది.డిఫెన్స్‌, ఏవియానిక్స్‌ తయారీకి అపోలో మైక్రో సిస్టమ్‌ లిమిటెడ్‌ రూ.1,500 కోట్లు పెట్టుబడులకు సిద్ధపడింది.


  • సోలార్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో మిస్సైల్‌ భాగాలు, ఏరో ఇంజన్‌ స్ట్రక్చర్‌కు రూ.1,500 కోట్లు, ఎంపీఎల్‌ లాజిస్టిక్స్‌ కంపెనీ రూ.700 కోట్లు, టీవీఎస్‌ ఐఎల్‌పీ రూ.200 కోట్లు పెట్టుబడులకు ముందుకొచ్చాయి.

  • రెన్యూసిస్‌, మిడ్‌వెస్ట్‌, అక్షత్‌, గ్రీన్‌ టెక్‌ ఎలకా్ట్రనిక్స్‌, హైడ్రోజన్‌ టెక్‌ విస్తరణకు రూ.7,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.

  • డిస్ట్రిబ్యూటెడ్‌ హైడ్రోజన్‌ టెక్నాలజీ రంగంలో సోహీ టెక్‌ ఇండియా రూ.1,000 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కృష్ణా పవర్‌ యుటిలిటీస్‌ రూ.5,000 కోట్లు, సిమెంట్‌ రంగ విస్తరణకు అల్ర్టా బ్రైట్‌ సిమెంట్స్‌, రెయిన్‌ సిమెంట్స్‌ రూ.2000 కోట్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

  • సీతారాం స్పిన్నర్స్‌ రూ.3 వేల కోట్లతో టెక్స్‌టైల్‌ యూనిట్‌ నెలకొల్పనుంది.

  • షోలాపూర్‌ తెలంగాణ టెక్స్‌టైల్‌ అసోసియేషన్‌ అండ్‌ జీనియస్‌ ఫిల్టర్స్‌ పవర్‌ లూమ్‌ టెక్నికల్‌ యూనిట్‌ రూ.960 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.

  • ప్రముఖ సంస్థ అతిరథ్‌ హోల్డింగ్స్‌ రాష్ట్రంలో 25 కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ ప్లాంట్లు నెలకొల్పనుంది. వీటిని స్థాపించేందుకు 4 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

  • హైదరాబాద్‌లో అత్యాధునిక విశ్వవిద్యాలయం, వైద్య విద్య, పరిశోధనా కేంద్రం నిర్మాణానికి రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అపోలో గ్రూప్‌ ఒప్పందం చేసుకుంది. రాబోయే మూడేళ్లలో రూ.1700 కోట్ల పెట్టుబడి పెడుతున్నామని, ప్రోటాన్‌ థెరపీ, ఇన్నోవేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

  • అంతర్జాతీయ మోటార్‌ స్పోర్ట్స్‌ సంస్థ సూపర్‌ క్రాస్‌ ఇండియా తెలంగాణలో ప్రపంచస్థాయి రేసింగ్‌ ట్రాక్‌, శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇది క్రీడా పర్యాటకం అభివృద్ధికి దోహదం చేయనుంది. యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ఆధునిక నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

విభిన్న రంగాల్లో వేల కోట్ల పెట్టుబడులు

రైజింగ్‌ సదస్సుల్లో విభిన్న రంగాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఐటీ, గ్రీన్‌ ఎనర్జీ, విద్యుత్‌, రవాణా, విద్య, వైద్యం, పర్యాటకం, వినోదం.. ఇలా పలు రంగాల పారిశ్రామికవేత్తలు తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒక్క ఇంధన రంగంలోనే లక్ష కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులు తరలివచ్చాయి. తద్వారా 1,52,300 మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ 14 సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఫ్యూచర్‌ సిటీలో కొత్త జూ పార్క్‌ ఏర్పాటుకు రిలయన్స్‌కు చెందిన వంతారా ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే, సీఎం రేవంత్‌ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌ బాబు ఆధ్వర్యంలో తొలి రోజు డీప్‌ టెక్‌, గ్రీన్‌ ఎనర్జీ, ఏరోస్పేస్‌ రంగాల్లో పలు పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేశారు.

12.jpg8.jpg11.jpg7.jpg5.jpg9.jpg10.jpg2.jpg3.jpg6.jpg4.jpg

Updated Date - Dec 09 , 2025 | 06:03 AM