Share News

Hyderabad: సీఎం పీఠం.. ఇక్కడో సెంటిమెంట్‌

ABN , Publish Date - Oct 24 , 2025 | 08:37 AM

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌.. రాజకీయ వ్యూహాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన వారిలో అత్యధికులు ఈ ప్రాంతాల్లోనే ఉన్నారు. దాంతో ఇక్కడ ఉంటేనే సీఎం పదవి దక్కుతుందనే నమ్మకం కొంతమంది నేతల్లో బలంగా ఏర్పడింది.

Hyderabad: సీఎం పీఠం.. ఇక్కడో సెంటిమెంట్‌

- జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లలో నేతల నివాసాలు

- ఎన్టీఆర్‌ నుంచి నేటి రేవంత్‌ వరకు ఇక్కడే..

- ఇతర నేతలూ ఇక్కడ నివాసానికే మొగ్గు

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌(Jubilee Hills, Banjara Hills).. రాజకీయ వ్యూహాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన వారిలో అత్యధికులు ఈ ప్రాంతాల్లోనే ఉన్నారు. దాంతో ఇక్కడ ఉంటేనే సీఎం పదవి దక్కుతుందనే నమ్మకం కొంతమంది నేతల్లో బలంగా ఏర్పడింది. సీఎం పీఠం అధిరోహించాలనుకునే వివిధ పార్టీల ప్రధాన నేతలు జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాలకి షిఫ్ట్‌ కావాలని భావిస్తున్నారు.


నగర శివారులో రాజసం లాంటి ఇంధ్ర భవనాలను నిర్మించుకున్న కొంతమంది నేతలు ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మహానగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లున్నాయి. ఈ ప్రాంతంలో ఉంటే కాలం కలిసివస్తుందనే నమ్మకాలున్నాయి. ముఖ్యంగా రాజకీయరంగ ప్రముఖులకు ఈ ఏరియాలు బాగా కలిసివచ్చాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా ఎక్కువగా ఇదే ఏరియాలో ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కీలక పదవులు దక్కాలంటే ఇక్కడినుంచే పాచికలు వేయాల్సిందేనన్న సెంటిమెంట్‌ ఉంది.


city4.3.jpg

ఎన్టీఆర్‌ నుంచి..

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్టీఆర్‌, చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి(NTR, Chandrababu, YS Rajasekhar Reddy, Kiran Kumar Reddy) బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాలకు అటు, ఇటుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఇక్కడ సెంటిమెంట్‌ మాత్రం కొనసాగింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇక్కడి నుంచే వ్యూహాలు రచించి ఏపీలో సీఎం అయ్యారు. విపక్షనేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ 2019 వరకు లోట్‌సపాండ్‌లో ఉండి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎన్నికలకు కూడా ఇక్కడి నుంచే వెళ్లడంతో జగన్‌ సీఎం అయ్యారు. 2019లో అధికారం కోల్పోయిన చంద్రబాబు కరోనా సమయంలో మొత్తం జూబ్లీహిల్స్‌లోనే ఉన్నారు. ఇక్కడి నుంచే చంద్రబాబు చక్రం తిప్పి 2024లో తిరిగి అధికారంలోకి వచ్చారనే సెంటిమెంట్‌ ఉన్నది.


city4.4.jpg

ఇక్కడికి వచ్చేందుకు నేతల ప్రయత్నాలు

తాజాగా సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలంతా ఇప్పుడు బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ వైపే చూస్తున్నారు. ప్రశాంతంగా సిటీ బయట విల్లాలు కొన్నవారు, సొంత ఎస్టేట్‌లు, ఫామ్‌హౌజ్‌లను నిర్మించుకున్న వారు కూడా ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనల్లో ఉన్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నందిహిల్స్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్య కారణాల రీత్యా ఫాంహౌజ్‌ నుంచి వచ్చి ప్రస్తుతం నందిహిల్స్‌లోనే ఉంటున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌రావు కోకాపేట్‌ నుంచి త్వరలోనే జూబ్లీహిల్స్‌కు రాబోతున్నట్లు తెలిసింది.


తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో నివాసముంటున్నారు. బీజేపీ నేతలు కూడా సీఎం పీఠంపై ఆశలు పెంచుకుంటున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్‌ బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఇక శామీర్‌పేట్‌ పరిధిలో ఉంటున్న ఎంపీ ఈటల రాజేందర్‌ రాజకీయంగా కలిసిరావాలంటే కచ్చితంగా బంజారాహిల్స్‌ రావాలని అనుకుంటున్నట్లు తెలిసింది. త్వరలోనే విలాసవంతమైన సౌధాన్ని వదిలి ఈ ప్రాంతానికి వచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రస్తుతం బర్కత్‌పురాలోని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. బంజారాహిల్స్‌లో భారీ ఇంద్రభవనాన్ని నిర్మించుకుంటున్నారు. త్వరలోనే అందులోకి షిఫ్ట్‌ కాబోతున్నట్లు సమాచారం. ఈ సెంటిమెంట్‌ ఎంతవరకు నిజమో కానీ, ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలంటే ఇక్కడ ఉండటానికి నేతలంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరి సెంటిమెంట్‌ ఎలా వర్కవుట్‌ అవుతుందో వేచిచూడాలి.


నాడు కేసీఆర్‌.. నేడు రేవంత్‌

బీఆర్‌ఎస్‌ రథసారథి కేసీఆర్‌ కూడా 2014 వరకు బంజారాహిల్స్‌ బసవతారకం ఆస్పత్రి పక్కన నందిహిల్స్‌(Nandi Hills)లోనే ఉండేవారు. నాటి ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి దగ్గరలోనే మల్కాజిగిరి పార్లమెంట్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సారథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొంది సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ సెంటిమెంట్‌ కలిసి వచ్చినట్లుగా రేవంత్‌ వర్గీయులు చెప్పుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం దరఖాస్తులతో 2,863 కోట్ల ఆదాయం

విమానాల్లో పవర్‌ బ్యాంకులపై నిషేధం

Read Latest Telangana News and National News

Updated Date - Oct 24 , 2025 | 08:37 AM