Share News

Liquor License Applications: మద్యం దరఖాస్తులతో 2,863 కోట్ల ఆదాయం

ABN , Publish Date - Oct 24 , 2025 | 05:37 AM

మద్యం దుకాణాల కోసం వచ్చే దరఖాస్తుల ద్వారా రూ.3 వేల కోట్ల ఆదాయం సాధించాలన్న.....

Liquor License Applications: మద్యం దరఖాస్తులతో 2,863 కోట్ల ఆదాయం

  • మద్యం దరఖాస్తులతో.. 2,863 కోట్ల ఆదాయం

  • గతంతో పోల్చితే ఈసారి 218కోట్లు అదనం

  • రాష్ట్రవ్యాప్తంగా 95,436 దరఖాస్తులు 27న డ్రా ద్వారా వ్యాపారుల ఎంపిక

హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్ర జ్యోతి): మద్యం దుకాణాల కోసం వచ్చే దరఖాస్తుల ద్వారా రూ.3 వేల కోట్ల ఆదాయం సాధించాలన్న లక్ష్యాన్ని ఎక్సైజ్‌ శాఖ దాదాపుగా చేరుకుంది. దరఖాస్తుల గడువు గురువారం ముగియగా.. రాష్ట్ర వ్యాప్తంగా 95,436 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ఎక్సైజ్‌ శాఖకు రూ.2,863 కోట్ల ఆదాయం వచ్చింది. గతంతో పోల్చితే ఇది రూ.218 కోట్లు అధికం కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల కేటాయింపునకు సెప్టెంబరు 25న ఎక్సైజ్‌ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ మరుసటి రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టింది. కాగా, క్రితంసారి దాదాపు 1.32 లక్షల దరఖాస్తుల విక్రయం ద్వారా ఎక్సైజ్‌ శాఖకు దాదాపు రూ.2,645 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గినా.. గతంలో రూ.2 లక్షలు ఉన్న దరఖాస్తు రుసుమును ఈసారి రూ.3 లక్షలకు పెంచినందున రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. లక్ష్యాన్ని సాధించడానికి ఎక్సైజ్‌ అధికారులు.. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునేలా విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. ఈ నెల 18 అర్ధరాత్రి వరకు 89,344 మంది దరఖాస్తు చేశారు. అయితే.. అదేరోజు బీసీ బంద్‌ ఉండటంతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో పలువురు వ్యాపారుల అభ్యర్థన మేరకు గడువును ఈ నెల 23 వరకు పొడిగించారు. ఇది వ్యాపారులకు ఊరటనిచ్చింది. ఇక ఈనెల 27న డ్రా తీసి వ్యాపారులను ఎంపిక చేయనున్నారు.


శంషాబాద్‌లో అత్యధికం..

ఆసిఫాబాద్‌లో అత్యల్పం..

మద్యం దుకాణాల కోసం వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా శంషాబాద్‌ ఎక్సైజ్‌ డివిజన్‌ నుంచి 8,502 వచ్చాయి. ఆ తర్వాత సరూర్‌నగర్‌లో 7,850 దరఖాస్తులు రాగా, మేడ్చల్‌లో 5,958, మల్కాజిగిరి 5,127, నల్లగొండ 4,902, సంగారెడ్డి 4,390, ఖమ్మం 4,430, కొత్తగూడెం 3,902, వరంగల్‌ అర్బన్‌లో 3,174, హైదరాబాద్‌ 3,200, సికింద్రాబాద్‌ 3,100, మహబూబ్‌నగర్‌ 2,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యల్పంగా కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో కేవలం 667 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక వనపర్తిలో 757 దరఖాస్తులు, ఆదిలాబాద్‌లో 748, జోగులాంబ గద్వాలలో 800, జగిత్యాల 1956, కరీంనగర్‌ 2740, రాజన్న సరిసిల్ల 1380, సంగారెడ్డి 4390, సూర్యాపేట 2770 దరఖాస్తులు వచ్చాయి.

Updated Date - Oct 24 , 2025 | 05:37 AM