Bandi Sanjay: రైతులారా.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
ABN , Publish Date - Feb 01 , 2025 | 02:43 PM
Bandi Sanjay: ఇది సంక్షేమ బడ్జెట్- ప్రజల పెన్నిధి నరేంద్రమోదీ అని కేంద్రమంత్రి బండి సంజయ్ కొనియాడారు. 2027 నాటికి అమెరికా, చైనా తరువాత మూడో ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరించే దిశగా బడ్జెట్‌ను రూపకల్పన చేశారన్నారు. పత్తి, పప్పు దినుసులు పండించే రైతులకు లాభదాయకమైన బడ్జెట్ అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల పక్షపాతి అనడానికి నిదర్శనమిది అని అన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 1: దేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) అన్నారు. కేంద్ర వార్షిక బడ్జెబ్‌పై కేంద్రమంత్రి మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్ అని చెప్పారు. మధ్యతరగతి ఉద్యోగుల, వ్యాపారులకు ఈ బడ్జెట్ ఓ వరమన్నారు. రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు విప్లవాత్మకమన్నారు. దీనితో తెలంగాణ సహా దేశంలోని ఒక్కో ఉద్యోగికి రూ.80 వేల వరకు ఆదా అవనుందని తెలిపారు. గత 75 ఏళ్లలో మునుపెన్నడూ లేని విధంగా మధ్యతరగతికి అనుకూలమైన బడ్జెట్ ఇది అని వెల్లడించారు.
Budget 2025: కేంద్ర వార్షిక బడ్జెట్ ఎంత.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారు
ప్రధాని, ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు...
2027 నాటికి అమెరికా, చైనా తరువాత మూడో ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరించే దిశగా బడ్జెట్‌ను రూపకల్పన చేశారన్నారు. పత్తి, పప్పు దినుసులు పండించే రైతులకు లాభదాయకమైన బడ్జెట్ అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల పక్షపాతి అనడానికి నిదర్శనమిది అని అన్నారు. ఇది సంక్షేమ బడ్జెట్- ప్రజల పెన్నిధి నరేంద్రమోదీ అని కొనియాడారు. ప్రధాని మోదీ, ఆర్ధిక మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బడ్జెట్‌పై విపక్షాలు అనవసర విమర్శలు మానుకోవాలని హితవుపలికారు. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
కిసాన్ క్రెడిట్ కార్డులపై..
పేద, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసే టీవీ, మొబైల్స్, లెదర్ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గబోతున్నాయని... ఎలక్ట్రిక్ వాహనాలపై ధరలు కూడా తగ్గబోతున్నాయని.. తద్వారా కాలుష్యం తగ్గే అవకాశముందన్నారు. కేన్సర్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు వాడుతున్న ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించడంవల్ల ఆయా రోగాలకు చికిత్స వ్యయం చాలా వరకు తగ్గే అవకాశముందన్నారు. ఆర్ధిక వ్యవస్థను స్థిరంగా ఉంచడంతో పాటు వ్యవసాయం, ఉత్పత్తి, సేవా రంగాలను బ్యాలెన్స్ చేసే బడ్జెట్ ఇది అని తెలిపారు. ఈ బడ్జెట్ రైతులకు వరమన్నారు. 7.7 కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల పేరిట రుణాలివ్వడమే లక్ష్యంగా పెట్టుకోవడం గొప్ప విషయమని అన్నారు. తెలంగాణలోని దాదాపు 50 లక్షల మంది రైతులకు రూ.5 లక్షల వరకు బ్యాంకుల ద్వారా క్రెడిట్ (రుణం) లభించే అవకాశముందన్నారు. ప్రైవేట్ వ్యాపారస్తుల, దళారుల వద్ద చేయిచాపే దుస్థితి లేకుండా చేసేందుకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టారన్నారు. తక్షణమే తెలంగాణలోని రైతన్నలంతా ఈ కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు కోసం దరఖాస్తు చేసుకుని లబ్ది పొందాలని కోరారు. వివిధ రకాల పంట ఉత్పత్తులను పెంచి రైతులను అధిక ఆదాయం తెచ్చేలా చేసేందుకు నూతనగా ‘ధన ధాన్య క్రుషి యోజన పథకం’ను ప్రవేశపెట్టడం హర్షణీయమన్నారు. పప్పు దినసుల కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో పాటు జాతీయ పత్తి కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో తెలంగాణలో పత్తి, పప్పు దినుసులు పండిస్తున్న రైతులకు అధిక ప్రయోజనాలు కలిగే అవకాశం రావడంతో పాటు గిట్టుబాటు ధర పెరిగే అవకాశముందని వెల్లడించారు.
తెలంగాణ భాగస్వామ్యం కావాలి...
ఉపాధి అవకాశాలను పెంచి యువతను వ్యాపార, పారిశ్రామికవేత్తలను చేసేందుకు బడ్జెట్‌లో వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు, ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు రుణ పరిమితిని పెంచడం ఆహ్వానించదగ్గర పరిణామమన్నారు. ఎంస్ఎంఈ రుణాలను రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచడంతో పాటు స్టార్టప్‌లకు రూ.20 కోట్ల వరకు రుణాలిస్తామని బడ్జెట్‌లో పేర్కొనడం ద్వారా యువతకు ఎంతో ప్రయోజనం కలగబోతోందన్నారు. విద్యుత్ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చి ప్రజలకు చౌక ధరకే కరెంట్‌ను అందుబాటులోకి తెచ్చే విధంగా బడ్జెట్‌ను రూపొందించడం గొప్ప విషయమన్నారు. గ్రామాల్లో వలసలను నివారించేందుకు ప్రత్యేక ప్రణాళికలను బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ పట్టణాలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం సంతోషంగా ఉందన్నారు. పట్టణాభివృద్ధికి నరేంద్రమోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని కోరారు.
ఇవి కూడా చదవండి...
భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరలు
పండుగ లాంటి వార్త.. 12 లక్షల వరకు నో ట్యాక్స్
Read Latest Telangna News And Telugu News