Rajnath Singh: భారత్ ఏ శక్తి ముందు తలదించలేదు.. భవిష్యత్తులో తలదించబోదు
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:52 PM
Rajnath Singh: నిజాం భారత్‌కు మాత్రమే వ్యతిరేకం కాదు.. భారత ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకమని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ అన్నారు. ఇప్పటికీ దేశంలో రాజాకార్లు ఉన్నారని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 17: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Union Minister Rajnath Singh) పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ ఈరోజును విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారని తెలిపారు. ఇది భారత చరిత్రలో సువర్ణ అధ్యాయమన్నారు. 1947లో భారత దేశం స్వాతంత్ర్యం పొందిన సమయంలో వివిధ రాజ్యాలు ఉండేవని, వాటివల్ల భారతదేశ ఐఖ్యత్వం ఇబ్బందికరంగా ఉండేదని గుర్తుచేశారు. అఖండ భారత్ నినాదంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందుకు వెళ్ళారని కేంద్ర మంత్రి తెలిపారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసంతోనే ఆనాడు భారత్ బలంగా నిలబడిందని చెప్పుకొచ్చారు. మహాత్మా గాంధీ కూడా సర్దార్ పటేల్ నిర్ణయాలను మెచ్చుకున్నారన్నారు. నిజాం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని.. ఆపరేషన్ పోలో పేరుతో సర్దార్ పటేల్ నిజాంను ఓడించారని వెల్లడించారు. ఆపరేషన్ పోలో రజాకార్ల ఆగడాలను అరికట్టడానికి సర్దార్ పటేల్ తీసుకున్న నిర్ణయమని తెలిపారు. తుష్టికరణ రాజకీయాల కోసం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని విమర్శించారు. గ్రామాల్లో ఆడవారి పట్ల ఆగడాలు పెరిగిపోయాయని, అశాంతి నెలకొందని రాజ్‌నాథ్ అన్నారు.
హిందువులే టార్గెట్‌గా రజాకార్లు అత్యాచారాలు, హత్యలు చేశారన్నారు. పహల్గాంలో కూడా రజాకార్ల తరహాలో హత్య చేశారని.. ఆపరేషన్ సింధూర్ పేరుతో వారికి తగిన బుద్ధి చెప్పామన్నారు. నిజాం భారత్‌కు మాత్రమే వ్యతిరేకం కాదని.. భారత ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకమని అన్నారు. ఇప్పటికీ దేశంలో రాజాకార్లు ఉన్నారని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. ధర్మం పేరుతో దేశంలో విచ్చిన్నం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. భారతదేశం ఏ శక్తీ ముందు తలదించలేదని.. భవిష్యత్తులో తలదించబోదని స్పష్టం చేశారు.
ఆనాడు సర్దార్ పటేల్ అఖండ భారత్ కోసం ప్రయత్నం చేశారని.. ఇప్పుడు ప్రధాని మోదీ ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. సర్దార్ పటేల్ కలలను సాకారం చేసింది ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వమే అని వెల్లడించారు. మోదీ తీసుకున్న నిర్ణయాలతో భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో నాలుగవ స్థానంలో నిలిచిందని.. త్వరలోనే మూడో స్థానంలోకి రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్‌లో మన సైన్యం శత్రువులను మతం అడిగి చంపలేదన్నారు. జైషే మహమ్మద్ లీడర్ మసూద్ అజార్ కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేసి చంపింది భారత సైన్యం అని ఆ సంస్థకు చెందిన వారే ప్రకటించారన్నారు.
మంచి మాటలతో మాటవినక పోతే వారికి అర్థమయ్యే భాషలో సమాధానం చెబుతుందని ఆపరేషన్ సింధూర్‌తో చూపించామన్నారు. నేటి భారత్ పూర్తిగా మారిపోయిందని.. ఆపరేషన్ సింధూర్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదన్నారు. భారతదేశం ఎవరి డిక్టేషన్ వినదని... సొంతంగా స్క్రిప్ట్ రాసుకుని అమలు చేస్తుందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
రండి అందరం కలిసి పనిచేద్దాం: గజేంద్ర సింగ్

ఈరోజు భారతదేశంలో సువర్ణాక్షరాలతో లాఖించదగ్గ విషయమని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షకావత్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్రమంత్రి ప్రసంగిస్తూ... నిరంకుశ పాలనను తొలగించి హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం అయ్యిందని తెలిపారు. ప్రతి ఏటా సాంస్కృతిక శాఖ అధికారులు విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రధాని మోదీ నిర్ణయించారని చెప్పారు. దేశాన్ని ఏకం చేసేందుకు ఎంతో మంది బలిధానం చేశారని గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణలో నిరంకుశ పాలన సాగిందన్నారు. నిజాం, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయించేందుకు ప్రయత్నం చేశారని చెప్పారు. ఆపరేషన్ పోలో పేరుతో నిజాం రాజ్యాన్ని ఓడించి హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేశారని తెలిపారు. జాతీయ జెండాను ఎగురవేసేందుకు యత్నించిన, రచయితల , కళాకారుల త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. దేశాన్ని వికసిత్ భారత్‌గా ఆవిష్కరించేందుకు అందరం కలిసి పనిచేద్దామని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షకావత్ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో మాన్సూన్ సర్వీసులకు బ్రేక్.. ఏం జరిగిందంటే
గోల్డ్ హోల్సేల్ సంస్థలపై ఐటీ రైడ్స్
Read Latest Telangana News And Telugu News