CM Revanth Reddy: మాతో కలిసి రండి.. ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ పిలుపు..
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:29 PM
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి బ్రతుకుదెరువు కోసం వచ్చిన వారు మూసీ పక్కన నివసిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మూసీకి వరద వచ్చినప్పుడు ఆ వరదలో కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ఎవరు ఎన్ని అవాకులు, చెవాకులు పేలినా పట్టించుకోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అడ్డంకులకు నిటారుగా నిలబడి తెలంగాణకు కావాల్సిన వాటా సాధించి ఎస్.ఎల్.బి.సిని పూర్తి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ను తరిమికొట్టి, 3.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. గుజరాత్‌లో నర్మదా నది, యూపీలో యమునా నదిని శుద్ది చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు అడ్డంకులు కలిగిస్తున్నారని మండిపడ్డారు.
జీవన ప్రమాణాలు పెంచడమే మూసీ పునరుజ్జీవం..
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి బ్రతుకుదెరువు కోసం వచ్చిన వారు మూసీ పక్కన నివసిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మూసీకి వరద వచ్చినప్పుడు కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసి పక్కన నివాసిస్తున్న వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు మూసీ పునరుజ్జీవనం చేస్తున్నామని వివరించారు. వారికి ఉద్యోగ, ఆర్థిక అవకాశాలు కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచడమే మూసీ పునరుజ్జీవం లక్ష్యమని పేర్కొన్నారు. మత సామరస్యానికి దిక్సూచిగా మూసీ వెంట అనేక కట్టడాలు కట్టారని తెలిపారు. మూసీ పునరుజ్జీవం చేసి తెలంగాణ వైతాళికుల విగ్రహాలు పెడతామని చెప్పారు.
డ్రగ్స్ నివారణకు ప్రజల మద్దతు కావాలి..
తెలంగాణ ప్రాంతాన్ని మత్తు మహమ్మారి గంజాయి పట్టిపీడిస్తోందని రేవంత్ తెలిపారు. మధ్య తరగతి యువత సైతం పెడధోరణి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నివారణకు ప్రజల మద్దతు కావాలని కోరారు. కొంతమందికి ప్రభుత్వం చేసే ప్రయత్నం నచ్చకపోవచ్చు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు డ్రగ్స్‌ను గేట్ వే ఆఫ్ హైదరాబాద్‌గా మార్చారని మండిపడ్డారు. గంజాయి, డ్రగ్స్ నివారణకు ఈగల్ సంస్థను తీసుకువచ్చామని గుర్తు చేశారు. డ్రగ్స్, గంజాయి వెనుక ఎంత పెద్ద వారున్నా ప్రభుత్వం వదిలిపెట్టదని ఆయన హెచ్చరించారు. రాజకీయాల్లో ఉన్న వారికి ఫామ్‌హౌస్‌లు ఉండవచ్చు.. అలా అని డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదని ఉద్ఘాటించారు.
పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా ఫ్యూచర్ సిటీ...
ఆనాటి ముఖ్యమంత్రులు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌ను నిర్మించారని రేవంత్ గుర్తు చేశారు. నగరంలో పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్లు చెప్పారు. భూమిని సేకరించే విషయంలో కొంతమంది నాయకులు అక్కడ ఉన్న రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేయనవి ఎవరూ.. చేయొద్దని వారు భావిస్తారని పేర్కొన్నారు. దానిని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రేపు ప్రపంచ పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా ఫ్యూచర్ సిటీ మారబోతుందని నొక్కి చెప్పారు.
మాతో కలిసి రండి..
2047 రాబోయే వందేళ్ల తెలంగాణ అభివృద్ధి ప్రణాళికను నిర్దేశిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నగరంలో 360 కిలోమీటర్ల మేర ఆర్.ఆర్.ఆర్ రాబోతుందని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య 11 రేడియల్ రింగ్ రోడ్లు వేయనున్నట్లు పేర్కొన్నారు. బుల్లెట్ రైలు కావాలని... కేంద్రానికి ప్రతిపాదన చేశామని తెలిపారు. హైదరాబాద్ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవేలు, బులెట్ రైలు ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిపై రాజకీయాలు చేసేవారు తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా మిగులుతారన్నారు. తాము చేసే అభివృద్ధితో కలిసిరండని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. తమతో కలిసిరావడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండండని సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు.
ఇవి కూడా చదవండి..
సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు
డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు