HighCourt On BC Reservations: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాడివేడి చర్చ..
ABN , Publish Date - Oct 09 , 2025 | 03:11 PM
ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉందని తేలిందని హైకోర్టుకు ఏజీ సుదర్శన్‌రెడ్డి వివరించారు. సర్వే డేటా ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేశారని పేర్కొన్నారు.
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై రెండో రోజు విచారణ ప్రారంభమైంది. ఇరువర్గాలు ధర్మాసనం ఎదుట వాడివేడి వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు మెదలుపెట్టారు. సమగ్ర సర్వే చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని కోర్టుకు ఆయన తెలిపారు. డోర్ టు డోర్ సర్వేకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయని పేర్కొన్నారు. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారమే సర్వే జరిపామని చెప్పుకొచ్చారు. బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉందని తేలిందని హైకోర్టుకు ఏజీ సుదర్శన్‌రెడ్డి వివరించారు. సర్వే డేటా ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేశారని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ నిర్ణయించిందని చెప్పారు. బీసీ బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదని గుర్తు చేశారు. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపలేదు కాబట్టి.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్టే అని వివరించారు. ఒకవేళ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఉంటే.. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఉండేదని అన్నారు. మార్చి నుంచి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉందని తెలిపారు.
గవర్నర్ గడువులోపు ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని ఆయన గుర్తు చేశారు. వాదనల నేపథ్యంలో బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందా? అని హైకోర్టు ప్రశ్నించింది. దానికి సుదర్శన్ రెడ్డి సమాధానం చెబుతూ.. ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదించిందని స్పష్ట చేశారు.
అలాగే.. ఇందిరా సహాని కేసుపై ఏజీ సుదర్శన్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు.. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు వేరని తేల్చి చెప్పారు. ఇందిరా సహాని కేసు విద్య, ఉద్యోగాలకు సంబంధించినదని పేర్కొన్నారు. సహాని కేసు స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించదని ఉద్ఘాటించారు. రాజకీయ రిజర్వేషన్ల కోసం మాత్రమే జోవో తెచ్చామని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని తెలిపారు. ఈ సమయంలో కోర్టుల జోక్యం సరికాదని సూచించారు. శాస్త్రీయ సమాచారంతో రిజర్వేషన్లు తీసుకొచ్చామని నొక్కిచెప్పారు. ఏ రాష్ట్రం దగ్గర శాస్త్రీయ సమాచారం లేదని ఏజీ సుదర్శన్‌రెడ్డి తన వాదనలు ముగించారు.
అనంతరం సీనియర్ న్యాయవాది రవివర్మ ప్రభుత్వం పక్షాన వాదనలు కొనసాగించారు. 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దని రాజ్యాంగంలో ఎక్కడా లేదని తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం రిజర్వేషన్లు 50 శాతం దాటి పెంచుకోవచ్చని పేర్కొన్నారు. 85 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 67శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. 15 శాతం జనాభా ఉన్న ఓసీలకు 33 శాతం స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని రవివర్మ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారత్ దాల్.. అంతా గోల్‌మాల్!