Share News

Dal Supply Scam: భారత్‌ దాల్‌.. అంతా గోల్‌మాల్‌!

ABN , Publish Date - Oct 09 , 2025 | 05:08 AM

భారత్‌ దాల్‌ సరఫరాలో ట్రేడర్లు పన్ను ఎగవేసిన ఉదంతం వెలుగులోకి రావడంతో.. రాష్ట్రంలో ఈ పథకం సక్రమంగా అమలుకాని విషయం...

Dal Supply Scam: భారత్‌ దాల్‌.. అంతా గోల్‌మాల్‌!

  • తెలంగాణకు 50 వేల టన్నుల శనగలు కేటాయించిన కేంద్రం

  • రూ.300 కోట్ల విలువైన శనగలు విక్రయించిన ‘హాకా’

  • నేరుగా ప్రైవేటు ట్రేడర్లకు విక్రయించడంతో ఫిర్యాదులు

  • రెండేళ్ల తర్వాత ఐటీ దాడులతో అక్రమార్కుల్లో గుబులు

  • ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ తనిఖీలు

  • కందిపప్పు వ్యాపారానికి పన్ను చెల్లించని ఏజెంట్‌ వెంకటేశ్వరరావు

  • బంగారు బిస్కెట్ల కొనుగోలుపై ఆరా తీయడంతో వెలుగులోకి

హైదరాబాద్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): భారత్‌ దాల్‌ సరఫరాలో ట్రేడర్లు పన్ను ఎగవేసిన ఉదంతం వెలుగులోకి రావడంతో.. రాష్ట్రంలో ఈ పథకం సక్రమంగా అమలుకాని విషయం మరోసారి చర్చకు వస్తోంది. కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన భారత్‌ దాల్‌ పథకంలో భాగంగా తెలంగాణకు 50 వేల మెట్రిక్‌ టన్నుల శనగలను కేటాయించింది. వాటిని మిల్లింగ్‌ చేసి పప్పుగా మార్చి, ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌ చేసి వినియోగదారులకు సబ్సిడీపై విక్రయించాలి. కానీ, ఇవేమీ చేయకుండా కేంద్రం నుంచి వచ్చిన శనగలను నేరుగా బహిరంగ మార్కెట్లో ట్రేడర్లకు విక్రయించి ప్రభుత్వానికి మస్కా కొట్టారు. నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించిన ‘హైదరాబాద్‌ వ్యవసాయ సహకార సంఘం’ (హాకా) చేపట్టిన రూ.300 కోట్ల విలువైన ఈ శనగల విక్రయాలపై అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. 50 వేల మెట్రిక్‌ టన్నుల శనగల్ని రాష్ట్రానికి పంపించిన కేంద్రం.. అప్పట్లో మార్కెట్‌ రేటు కిలోకు రూ.90కి పైగా ఉండగా.. సబ్సిడీపై కిలోకు రూ.60 చొప్పున ధర నిర్ణయించింది. సాధారణ వినియోగదారుల కోసం కిలో ప్యాకెట్లు, సంస్థలకు విక్రయించటానికి 30 కిలోల బస్తాలు తయారు చేయాలని పేర్కొంది. 30 కిలోల బస్తా తీసుకునేవారికి కిలోకు మరో రూ.5 తగ్గించి రూ.55 చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియ రాష్ట్రంలో జరగలేదు.

కేంద్రం వివరణ కోరినా..

శనగలను నేరుగా ప్రైవేటు ట్రేడర్లకు విక్రయించినట్లు అప్పట్లో ఫిర్యాదులు రావడంతో కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాజీవ్‌కుమార్‌ గతేడాది ఫిబ్రవరిలో హాకాకు లేఖ రాసి వివరణ కోరారు. అయితే పథకం దుర్వినియోగం కాలేదని అధికారులు వివరణ పంపించారు. అయితే.. ఆ తర్వాత కూడా ఫిర్యాదులు వచ్చాయి. శనగలను ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌ చేసి విక్రయించే క్రమంలో.. ‘ట్యాక్స్‌ ఇన్వాయి్‌స’ను జనరేట్‌ చేయాల్సి ఉంటుంది. కానీ, ఏకంగా ముడి శనగల ట్రేడింగ్‌ జరిగింది. దీంతో ప్రభుత్వానికి పన్ను ద్వారా వచ్చే ఆదాయం కూడా రాకుండా పోయింది. ఈ అంశంపై ప్రస్తుతం వాణిజ్య పన్నులశాఖ అధికారులు దృష్టి సారించడంతో ట్రేడింగ్‌ చేసిన వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి కేంద్రంగా నడుస్తున్న వీకేర్‌ సీడ్‌ కంపెనీలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. శనగల ట్రేడింగ్‌లో ఈ కంపెనీ పన్ను ఎగవేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. తాజాగా మార్క్‌ఫెడ్‌ విక్రయించిన జొన్నల టెండర్లను కూడా వీకేర్‌ సంస్థ దక్కించుకుంది.


గుంటూరు, వైజాగ్‌, కర్నూలు, వినుకొండలో ఐటీ తనిఖీలు..

గుంటూరులోని కందిపప్పు కమీషన్‌ ఏజెంట్‌ వెంకటేశ్వరరావు నివాసంలో ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీలు రెండో రోజూ కొనసాగాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో కందిపప్పు సరఫరా కాంట్రాక్టు పొందిన వెంకటేశ్వరరావు సక్రమంగా పన్నులు చెల్లించడం లేదు. అంతేకాకుండా 30 ఏళ్లుగా కమీషన్‌ వ్యాపారంతోపాటు రియల్‌ ఎస్టేట్‌, గోల్డ్‌ వ్యాపారాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ దుకాణంలో ఐటీ తనిఖీలు నిర్వహించగా, గుంటూరు, వైజాగ్‌లోని కమీషన్‌ ఏజెంట్లకు పెద్దమొత్తంలో బంగారు బిస్కెట్లు విక్రయించినట్టు తెలిసింది. దీంతో అధికారులు విజయవాడలోని ఆదాయపు పన్నుశాఖ ఆధ్వర్యంలో 30 బృందాలుగా ఏర్పడి గుంటూరు, విజయవాడ, కర్నూలు, వైజాగ్‌, వినుకొండ, ప్రాంతాల్లో కందిపప్పు మిల్లులు, వ్యాపారుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. వెంకటేశ్వరరావు ఫ్లాట్‌లలో కీలక సమాచారం లభ్యమైంది. కందిపప్పు, పచ్చిపప్పు వ్యాపారంతోపాటు రూ.కోటి, రూ.2 కోట్ల విలువైన చిట్టీలు నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇంత పెద్దమొత్తంలో చిట్టీలు వేసే వారి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. వెంకటేశ్వరరావు నుంచి సరుకులు కొనుగోలు చేసే ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో మిల్లర్ల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే వైజాగ్‌లోని కమీషన్‌ ఏజెంట్‌ నివాసంలో తనిఖీలు చేపట్టారు. కమీషన్‌ ఏజెంట్లు బ్యాంకుల్లో జరిపిన వ్యాపార లావాదేవీల వివరాలు, లాకర్లలలో భద్రపరిచిన బంగారం, వెండి ఇతర ఆస్తుల వివరాలు సేకరించారు. వీరికి బినామీలుగా ఉన్నవారి వివరాలను సైతం రాబడుతున్నారు.

Updated Date - Oct 09 , 2025 | 07:17 AM