GHMC Bathukamma Facilities: హైదరాబాద్‌లో బతుకమ్మ పండుగ సంబరాలకు రంగం సిద్ధం..
ABN , Publish Date - Sep 21 , 2025 | 12:25 PM
తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారు. తెలంగాణ సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బతుకమ్మ పండుగకు సిద్ధం అయ్యారు. మహాలయ అమావాస్య సందర్భంగా నేటి(ఆదివారం) నుంచి పల్లె పల్లెలో.. వాడ వాడలా తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆటాపాటలే కనిపించనున్నాయి. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వస్ఫూర్తిని చాటేలా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.
పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ ఈ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారు. తెలంగాణ సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ నుంచి మొదలై చివరి రోజు సద్దుల బతుకమ్మ వరకూ తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆటపాటలతో రాష్ట్రమంత పండుగ వాతావరణం నెలకొననుంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా బతుకమ్మ పండుగకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. సాంప్రదాయ బద్ధంగా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈసారి నగర వ్యాప్తంగా 384కి పైగా బతుకమ్మ కుంటలు, చెరువులు, తాత్కాలిక కుంటలు, ట్యాంకులు సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యార్థం 82 టెంపరరీ టాయిలెట్స్, 45 వేల లైట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వేడుకలు జరిగే ప్రదేశాలలో 1,450 శానిటేషన్ సిబ్బంది ఉండనున్నట్లు చెప్పుకొచ్చారు.
ప్రధాన వేడుకల వేదికలు పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, ఎల్.బి స్టేడియం, జలవిహార్, కాప్రా చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, సరూర్ నగర్ చెరువు, చార్మినార్, రాజేంద్రనగర్, మెహదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, ముషీరాబాద్, అంబర్‌పేట్, సికింద్రాబాద్, బేగంపేట్, సేరిలింగంపల్లి తదితర ప్రాంతాలను వేడుకలకు సిద్ధం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. అన్ని చెరువుల వద్ద శుభ్రత కార్యక్రమాలు, దోమల నివారణ స్ప్రేలు, భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాలు, వాలంటీర్లు, స్థానిక సంఘాల సహకారంతో ఈసారి బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు
మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్