Ramachandra Reddy Encounter: మావోయిస్టుల లొంగుబాటుపై అనుమానాలు ఉన్నాయి..
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:11 AM
న్యాయం కోసం పోరాడిన తమకు న్యాయం లభించలేదని శాంతిప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించి మరీ మావోయిస్టులను చంపుతోందని ఆరోపించింది.
సిద్దిపేట: తన భర్త, మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ది ముమ్మాటికీ బూటకపు ఎన్ కౌంటరే అని భార్య శాంతిప్రియ ఆరోపించారు. పార్టీలోని కొందరు కోవర్టుల వల్లే పోలీసులు పట్టుకున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు పదకొండు రోజులపాటు చిత్ర హింసలు పెట్టినా, ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పోలీసులే చంపారని వాపోయారు. ఇవాళ(శనివారం) ఏబీఎన్‌తో శాంతిప్రియ మాట్లాడారు..
న్యాయం కోసం పోరాడిన తమకు న్యాయం లభించలేదని శాంతిప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించి మరీ మావోయిస్టులను చంపుతోందని ఆరోపించింది. పార్టీ చర్చలకు సిద్ధం అంటున్నా ప్రభుత్వం ఎందుకు వారితో మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మావోయిస్ట్ సమస్యను పరిష్కరించాలంటే ముందుగా వారితో చర్చలు జరపాలని సూచించారు. వారు లేవనెత్తే అంశాలను పరిష్కరించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
మావోయిస్ట్ పార్టీలోని కొందరి లొంగుబాటుల్ని చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయని శాంతిప్రియ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వధినేతల ముందు ఆయుధాలు ఇస్తూ.. నవ్వుకుంటూ, విందులు జరుపుకుంటూ లొంగుబాటు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. లొంగుబాటుని వ్యతిరేకించడం వల్లనే బహుశా కోవర్ట్ ఆపరేషన్ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని రామచంద్రారెడ్డి భార్య శాంతిప్రియ వెల్లడించారు. కాగా, కొద్దిసేపటి క్రితమే.. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన రామ్‌చంద్రారెడ్డి మృతదేహం స్వగ్రామం తీగలకుంటపల్లికి చేరుకుంది. మరికాసేపట్లో రామ్‌చంద్రారెడ్డి అంత్యక్రియలు జరుగనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి:
ISRO: నవంబరు చివర్లో బ్లూబర్డ్ ప్రయోగం