TG Projects: ప్రాజెక్టులకు పోటెత్తిన వరద.. దిగువ ప్రాంతాలకు నీటి విడుదల
ABN , Publish Date - Aug 19 , 2025 | 08:07 AM
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 39 గేట్లు ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి దిగవ భాగానికి 1.51లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. శ్రీశైలానికి 3.29 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని.. చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, కాలువులు పొంగిపోర్లుతున్నాయి. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఈ మేరకు పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆ దృశ్యాన్ని చూడటానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. అయితే.. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి నీటి విలువ వివరాలను తాజాగా అధికారులు వెల్లడించారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 39 గేట్లు ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి దిగవ భాగానికి 1.51లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. శ్రీశైలానికి 3.29 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని.. చెప్పారు. ఈ మేరకు శ్రీశైలంలో 10, సాగర్‌లో 26 గేట్లు ఎత్తినట్లు అధికారులు ప్రకటించారు. మంచిర్యాల ఎల్లంపల్లి ప్రాజెక్టు 35 గేట్లు ఎత్తి, లక్షా 83 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేపినట్లు పేర్కొన్నారు. అలాగే నిర్మల్, కడెం ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి, 16 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. మహబూబ్ నగర్ పరిధిలోని జూరాల ప్రస్తుత నీటిమట్టం 317.370 మీటర్లకు చేరుకుందని చెప్పుకొచ్చారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లుగా ఉందని పేర్కొన్నారు. దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గినట్లు తెలిపారు. ఒక గేట్ ఎత్తి 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు వెల్లడించారు.
నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు 8 గేట్లు ఎత్తి దిగువకు 10,279 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 642.79 అడుగులుగా ఉందని, ప్రస్తుతానికి 642.79 అడుగుల నీటిమట్టానికి చేరుకుందని చెప్పారు. అలాగే.. పులిచింతల ప్రాజెక్టుకు కూడా భారీగా వరద ప్రవాహం ఉందని పేర్కొన్నారు. 14 గేట్లు ఎత్తి దిగువకు 4,18,092 క్యూసెక్కులు నీటిని విడుదల చేసినట్లు వివరించారు. పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 167.485 అడుగులుగా ఉందని వెల్లడించారు. జిల్లాలోని మరో భారీ ప్రాజెక్టు అయిన నాగార్జున సాగర్‌కు భారీ వరద కొనసాగుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో 26 గేట్లు ఎత్తి దిగువకు 3,98,660 క్యూసెక్కులు నీటిని విడుదల చేసినట్లు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామార్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉంటే..ప్రస్తుతం 298.12 టీఎంసీలకు చేరుకుందని స్పష్టం చేశారు. సంగారెడ్డి సింగూరు ప్రాజెక్టులోకి కూడా వరద కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలుగా ఉంటే.. ప్రస్తుతం 19.534 టీఎంసీలుగా నీటి నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి:
రాబోయే జీఎస్టీ సంస్కరణలు ఇవేనా.. ప్రజలకు ఇక పండగే
భారతీయ కరెన్సీలో చెల్లింపుల దిశగా ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం