Revanth reddy Cabinet: కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్
ABN , Publish Date - Jul 10 , 2025 | 09:49 PM
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించారు.
హైదరాబాద్, జులై 10: కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ అంశంలో న్యాయ సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ను ఈ కేబినెట్ సమావేశానికి ఆహ్వానించామన్నారు. ఆయనతో ఈ అంశంపై చర్చించామని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం.. మార్చి లోపు మరో లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయ్యాలని నిర్ణయించామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి సుధాకర్, వాకిట శ్రీహరి విలేకర్ల సమావేశంలో వివరించారు.
ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుంచి మొత్తం 19 కేబినెట్ సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. నేటి వరకు 23 శాఖలకు సంబంధించి 327అంశాలపై ఈ కేబినెట్లలలో చర్చ జరిగిందని వివరించారు. 321 అంశాలను కేబినెట్ ఆమోదించిందన్నారు. కేబినెట్ ఆమోదించిన అన్ని అంశాల అమలుపై ఈ రోజు సమావేశంలో చర్చించామని తెలిపారు.
కేబినెట్ ఆమోదించిన 96 శాతం అంశాలు అమలులోకి వచ్చాయని వివరించారు. మళ్లీ జులై 25న కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రతి మూడు నెలకొకసారి కేబినెట్ నిర్ణయాలపై చర్చిస్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని మాట ఇచ్చామని.. ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపామన్నారు. ఈ బిల్లుకు అనేక కొర్రీలు పెట్టారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో లీగల్ సమస్యలు రాకుండా అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడామన్నారు.
42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. డెడికేషన్ కమిషన్ ద్వారా రిజర్వేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తుందని వివరించారు. 2018లో ఉన్న చట్టాన్ని ఆర్డినెన్సు ద్వారా సవరించాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ఇక అమిత్, సెయింట్ మేరీ విద్యా సంస్థలను యూనివర్సిటీలుగా గుర్తిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. రాష్ట్రంలో గోశాలలకు కొత్త పాలసీ తీసుకు వస్తున్నట్లు వివరించారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల భూ సేకరణ పూర్తి చేయాలని కూడా నిర్ణయించామన్నారు.
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. గోశాల పాలసీపై చర్చ చేశామని చెప్పారు. ఎంకేపల్లి, యాదగిరిగుట్ట, వేములవాడలలో అత్యాధునిక గోశాలలు నిర్మించాలని నిర్ణయించామన్నారు. 82 కోట్ల చేప పిల్లలను ఈసారి చెరువుల్లో పెంచడానికి రూ. 120 కోట్లు విడుదల చేశామని తెలిపారు.
హైదరాబాద్‌లో గురువారం ఉదయం 11.00 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దాదాపు 4 గంటలపాటు ఈ కేబినెట్ భేటీ సాగింది. ఇంకా ఈ సమావేశంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో పదేళ్లపాటు రిజర్వేషన్లు అమలయ్యేలా చేసిన చట్టానికి సవరణ చేయాలని కూడా ఈ కేబినెట్‌లో నిర్ణయించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పీ4పై సమీక్ష.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
Read Latest Telangana News and Telugu News