Share News

MLC KAVITA: ఎమ్మెల్సీ కవిత విషయంలో ఏం జరిగింది..?

ABN , Publish Date - Sep 02 , 2025 | 05:46 PM

కవిత బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. బీఆర్ఎస్‌లో సునామీ సృష్టించిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

MLC KAVITA: ఎమ్మెల్సీ కవిత విషయంలో ఏం జరిగింది..?

హైదరాబాద్: కల్వకుంట్ల కవిత రెండు తెలుగు రాష్ట్రాలకు.. పరిచయం ఉన్న పేరు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కూతురు అయినా.. తన నైపుణ్యంతో రాజకీయాల్లో తనకుంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. తన నాయకత్వ పటిమతో.. బీఆర్ఎస్ పార్టీలో తనకంటూ ఓ స్థానం తెచ్చుకుంది. బీఆర్ఎస్ తరఫున గతంలో ఏంపీగా.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కవిత సేవలందిస్తున్నారు. అన్నిబానే ఉన్నాయి అనుకున్న టైమ్‌లో.. కవిత జీవితంలో పెను తుఫానుగా.. లిక్కర్ స్కామ్ కేసు వచ్చి పడింది. దీంతో ఒక్కసారిగా కవిత జీవితం.. అతాలకుతలం అయ్యింది. ఈ కేసులోనే ఆమె తీహార్‌‌‌‌ జైల్లో వంద రోజులుకు పైగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కవితను అష్టకష్టాలు పడి బయటకు తీసుకొచ్చింది. బయటకు అయితే తీసుకొచ్చింది కానీ దగ్గరకు తీసుకోలేక పోయింది ఆ పార్టీ. దీంతో కవిత వెరు కుంపటి వైపు అడుగులు వేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే నాటి నుంచి నేటి వరకు కవిత ఏం మాట్లాడినా, ఏం చేసినా సెన్సేషన్‌‌గా మారిపోయింది.


అయితే తాజాగా.. కవిత బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. బీఆర్ఎస్‌లో సునామీ సృష్టించిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సుదీర్ఘ చర్చల తర్వాత నేతలు, కార్యకర్తల అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ ఆరోపించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.


కవిత సంచలన వ్యాఖ్యలు..

సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన కవిత.. మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్‌రావు, సంతోష్‌ది కీలకపాత్ర అని వెల్లడించారు. వీరిద్దరి వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని.. వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. తానిప్పుడు మాట్లాడితే తన వెనుక ఎవరో ఉన్నారంటారని.. కానీ, అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్‌రావుది మేజర్ పాత్ర అని.. అందుకే హరీష్‌రావును ఇరిగేషన్ మంత్రిగా తొలగించారని అన్నారు కవిత. హరీష్‌రావు, సంతోష్‌రావు వల్లే కేసీఆర్‌కు ఈ పరిస్థితి దాపురించిందన్నారు. కేసీఆర్‌ను అడ్డుపెట్టుకుని హరీష్, సంతోష్ భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. హరీష్‌రావు, సంతోష్‌రావుకు డబ్బు మాత్రమే కావాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కవిత. కేసీఆర్‌పై సీబీఐ విచారణ వరకు పరిస్థితి వచ్చాక.. పార్టీ ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అని కవిత వ్యాఖ్యానించారు.


అన్‌ఫాలో..

సామాజిక మాధ్యమాల్లో కవితను వెంటనే ఆన్‌ఫాలో కావాలని బీఆర్‌ఎస్‌ ఐటీ విభాగం నుంచి పార్టీ శ్రేణులకు ఆదేశాలు వెళ్లినట్లు గులాబీ వర్గాలు చెబుతున్నాయి. ఆ వెంటనే ఎక్స్‌ ఖాతాలో కవితను ఫాలో అవుతున్న కార్యకర్తలు వెంటవెంటనే అన్‌ఫాలో అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. ఎలక్ట్రానిక్‌ మీడియాలో బీఆర్‌ఎస్‌ తరఫున చర్చలకు వెళ్లిన నేతలు కూడా కవిత తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కొందరైతే కవిత తీరు వల్లే గత ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైందని ఆరోపించారు. మరికొందరు తక్షణమే ఆమె పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ఎల్పీ వాట్సప్‌ గ్రూప్‌ నుంచి కవిత పీఆర్వోను తొలగించారు. హరీశ్‌రావు ఆరడుగుల బుల్లెట్‌ అంటూ బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగం పోస్టులు పెట్టింది. ఆ ట్వీట్‌ను కేటీఆర్ రిట్వీట్ చేశారు. ఇది కవితకు కౌంటర్ అనే చెప్పాలి.


అసలేంటీ పంచాయతీ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దాదాపు 100 రోజులకు పైగా జైల్లో ఉన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యాయి. కవిత జైల్లో ఉన్న సమయంలో ఆమెకు సంఘీభావం తెలిపేందుకు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు కూడా జైలుకు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఆమె జైలు నుంచి విడుదలయ్యాక.. ఢిల్లీకి వెళ్లి మరీ ఘన స్వాగతం పలికారు. ఇంత వరకు బాగానే ఉంది. ఆ తరువాతే ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.

జైలు నుంచి విడుదలయ్యాక కవిత.. కొంత కాలం సైలెంట్‌గా ఉన్నారు. ఆ తరువాత బీసీ నినాదం ఎత్తుకుని.. ఊహించని రీతిలో యాక్టీవ్ పాలిటిక్స్‌ నిర్వహించారు. తెలంగాణ జాగృతి పేరుతో పార్టీ అధిష్టానానికి కనీస సమాచారం ఇవ్వకుండా జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. బీసీ నినాదంతో పెద్ద ఉద్యమాన్ని చేపట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పలు సభల్లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ కూడా చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సామాజిక న్యాయం జరుగలేదంటూ బాంబ్ పేల్చారు. అప్పటి నుంచి ఈ వివాదం మొదలైంది.


వరంగల్ సభలో..

ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను అంగరంగ వైభవంగా నిర్వహించింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. అయితే సభలో కవిత పేరు ప్రస్తావన కాదు కదా.. కనీసం ప్లెక్సీల్లో ఫోటో కూడా పెట్టలేదు. సభ మొత్తం కేటీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేసేలా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సభలో తన ఫోటో లేకపోవడంతో కవిత తీవ్ర అసంతృప్తికి గురైనట్లు వార్తలు వచ్చాయి.


లేఖ లీక్..

బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగిన కొంత కాలం తరువాత.. కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. సభలో కేసీఆర్ ఇచ్చిన ప్రసంగాన్ని ఉద్దేశించి.. లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, సీక్రెట్‌గా రాసిన ఈ లేఖ.. కవిత అమెరికా వెళ్లిన తరువాత లీక్ అయ్యింది. ఆ లేఖ నాడు పెను సంచలనం సృష్టించింది. ఇక అమెరికా నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చాక లేఖ వ్యవహారంపై కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె చేసిన కామెంట్స్.. బీఆర్ఎస్‌ను షేక్ చేశాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కవిత కామెంట్స్‌పై స్పందించారు. పార్టీ లైన్‌లో ఉండి మాట్లాడాలని.. ఏదైనా ఉంటే అంతర్గతంగా చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కొంతకాలం తరువాత ఈ వివాదం కాస్త సద్దుమణిగింది.


మల్లన్న కామెంట్స్.. పట్టించుకోని బీఆర్ఎస్..

ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో జాగృతి నేతలు తీన్మార్ మల్లన్న కార్యాలయంపై అటాక్ చేశారు. ఆఫీస్‌ను ధ్వంసం చేశారు. ఈ వివాదం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంత పెద్ద గొడవ జరిగినా.. అందునా కేసీఆర్ కూతురుని మల్లన్న దూషించినా.. బీఆర్ఎస్ నుంచి కనీసం స్పందన రాలేదు. బీఆర్ఎస్ నేతలు ఒక్కరూ కూడా కవితకు సంఘీభావంగా మాట్లాడలేదు. ఈ ఘటన కూడా కవితను వేదనకు గురి చేసిందని ఆమె అనుచరులు చెబుతున్నారు.


లిల్లీఫుట్..

ఇక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని లిల్లీఫుట్ అంటూ కవిత సంబోధించడం బీఆర్ఎస్‌లో సంచలనం రేపింది. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన, బీఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుంచి కేసీఆర్‌ వెన్నుదన్నుగా నిలిచిన నాయకుడు జగదీశ్ రెడ్డిని కవిత అలా అనడంతో బీఆర్ఎస్ శ్రేణులంతా కవిత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం కూడా కవితకు, బీఆర్ఎస్ పార్టీకి మధ్య గ్యాప్ మరింత పెరగడానికి కారణమైంది.


టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తొలగింపు..

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగా కవిత ఉన్నారు. అయితే, కవిత జాగృతి పేరుతో కొత్త కమిటీలు ప్రకటించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. టీబీజీకేఎస్‌కు గౌరవాధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ పేరును ప్రకటించారు. అంటే కవితను ఆ పదవి నుంచి తొలగించారన్నమాట. ఈ సమయంలో కవిత అమెకాలో ఉన్నారు. అక్కడి నుంచి కవిత ఒక లేఖ విడుదల చేశారు. తనపై కొందరు కుట్రలు చేస్తున్నారంటూ ఆ లేఖలో ఆరోపణలు గుప్పించారు. మొత్తంగా ఈ వ్యవహారం కూడా కవిత, బీఆర్ఎస్ పార్టీ మధ్య దూరం మరింత పెంచింది.


ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ పేరుతో..

ఈ వరుస వివాదాల నేపథ్యంలో.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో కవిత చేసిన కామెంట్స్ బీఆర్ఎస్‌ను కఠిన నిర్ణయం తీసుకునేలా చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వెనుక హరీష్ రావు, సంతోష్ రావులు ఉన్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీలో పెద్ద అలజడి రేగింది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో కవిత కారణంగా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని భావించిన బీఆర్ఎస్ అధిష్టానం.. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు ది గ్రేట్.. సీబీఎన్‌ కు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభినందనలు

250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..

Updated Date - Sep 02 , 2025 | 06:21 PM