Minister Adluri Lakshman: మంత్రి పొన్నం వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ రియాక్షన్..
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:07 AM
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రెహమత్ నగర్‌లో ముగ్గురు మంత్రులు.. పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉంది.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై తాజాగా.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవం ఉంటుందని తెలిపారు. మాదిగలు అంటే అంత చిన్న చూపా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న మాటను సమర్ధించుకొని ఇప్పటివరకు స్పందించకుండా ఉన్నావు అంటే ఈ విషయం నీ విజ్ఞతకే వదిలేస్తున్నా... పొన్నం అని వ్యాఖ్యానించారు. సహచర మంత్రిని ఆ మాట అంటే చూస్తూ ఉంటావా.. మంత్రి వివేక్ వెంకటస్వామి అని నిలదీశారు. అనంతరం జరిగిన సంఘటన మీద స్పందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రెహమత్ నగర్‌లో ముగ్గురు మంత్రులు.. పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే మీడియా సమావేశానికి మంత్రి లక్ష్మణ్ ఆలస్యం అయ్యారు. దీంతో పొన్నం అసహనానికి లోనై.. పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో గుసగుసలాడారు. మనకు సమయం తెలుసు..జీవితం తెలుసు..కానీ వారికేం తెలుసు ఆ దున్నపోతుగానికి అంటూ మాట్లాడారు. ఆ సమయంలో మైక్‌లు ఆన్‌లో ఉండటంతో ఆయన మాటలు బయటకు వినిపించాయి. దీంతో పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలతో దళిత సంఘాలు భగ్గుమన్నాయి. సహచర దళిత మంత్రిని దున్నపోతు అని ఎలా అంటారని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. సహచర మంత్రిని గౌరవించని పొన్నంను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. దీనిపై తాజాగా అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ.. పొన్నం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే పొన్నం వ్యాఖ్యలపై ఏఐసీసీకి ఫిర్యాదు చేసే యోచనలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
ఎన్నికల ప్రక్రియ సరళం.. శాంతిభద్రతలపై డేగకన్ను
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..