Rachakonda CP On Firing Case: పోచారం కాల్పుల కేసుపై రాచకొండ సీపీ ఏమన్నారంటే..
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:55 PM
ప్రధాన నిందితుడు A1మొహమ్మద్ ఇబ్రాహీం ఖురేషీని అరెస్టు చేశామని... అలాగే సహనిందితులు A3 కురువ శ్రీనివాస్, A4 హసన్ బిన్ మోసిన్‌లను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ చెప్పారు. మరో నిందితుడు A2 హనీఫ్ ఖురేషీ పరారీలో ఉన్నాడన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 23: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కాల్పుల కేసును 12 గంటల్లోనే చేధించామని రాచకొండ సీపీ సుధీర్ బాబు (Rachakonda CP Sudheer Babu) తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. యమ్నంపేట్ వద్ద అక్టోబర్ 22న సాయంత్రం కాల్పుల్లో గో రక్షక్ కార్యకర్త బిద్ల ప్రసాంత్ అలియాస్ సోను సింగ్ తీవ్రంగా గాయపడ్డారన్నారు. గో రక్షక్ దళ్ కార్యకర్త ప్రశాంత్‌పై కాల్పులు జరిపిన నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రధాన నిందితుడు A1 మొహమ్మద్ ఇబ్రాహీం ఖురేషీని అరెస్టు చేశామని... అలాగే సహ నిందితులు A3 కురువ శ్రీనివాస్, A4 హసన్ బిన్ మోసిన్‌లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మరో నిందితుడు A2 హనీఫ్ ఖురేషీ పరారీలో ఉన్నాడన్నారు.
ఇబ్రాహీం.. పశువుల రవాణా వ్యాపారం చేస్తున్నాడని.. గోవుల అక్రమ రవాణా బయటపెట్టాడని ప్రశాంత్‌పై నిందితులు కక్ష పెట్టుకున్నారన్నారు. నిందితుడు ఇబ్రాహీం, బాధితుడు సోను సింగ్‌కు గతంలో పరిచయం ఉందని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఇబ్రాహీం 12 సంవత్సరాలుగా పశువుల రవాణా వ్యాపారం చేస్తున్నాడని.. ప్రశాంత్ గతంలో 6 సార్లు పశువుల అక్రమ రవాణా అడ్డుకున్నాడని తెలిపారు. దాంతో ఇబ్రాహీంకు 1 కోటి రూపాయల నష్టం వచ్చిందన్నారు. ఈ క్రమంలో సోనూ సింగ్ అలియాస్ ప్రశాంత్‌పై ఇబ్రాహీం కక్ష పెంచుకున్నాడన్నారు సీపీ.
పశువులను రవాణా చేసుకోవాలంటే 5 లక్షలు ఇవ్వాలని ప్రశాంత్ డిమాండ్ చేశాడని నిందితులు చెబుతున్నారని.. దీనిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ సీపీ తెలిపారు. నిందితుడు శ్రీనివాస్.. సెటిల్ చేసుకుందాం, మాట్లాడుకుందామని చెప్పి ప్రశాంత్‌ను స్పాట్‌కు రప్పించాడని... మాట్లాడుకుందామని పిలిచి ఫైరింగ్ చేసి పారిపోయారన్నారు. పిస్టల్‌ను ఛత్తీస్‌గఢ్‌లో కొనుగోలు చేసినట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు. నిందితులు వాడిన వెహికల్ సీజ్ చేశామని... ఒక పిస్టల్, మూడు సెల్ ఫోన్స్ సీజ్ చేశామని తెలిపారు. ప్రస్తుతం ప్రశాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఈ ఏడాది రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5110 పశువుల్ని ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సంవత్సరం పశువుల అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటి వరకు 288 కేసులు నమోదు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పోచారం కాల్పుల కేసులో పోలీసుల పురోగతి
తుని అత్యాచార నిందితుడు నారాయణరావు ఆత్మహత్య
Read Latest Telangana News And Telugu News