Harish Rao: పశువులను పూజించే జాతి.. ఒక్క తెలంగాణకు మాత్రమే సొంతం: హరీశ్ రావు
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:54 AM
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సదర్ పండుగను అధికారికంగా జరిపారని హరీశ్ రావు గుర్తుచేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో ఇక్కడ వేదికను ప్రభుత్వమే వేసి.. దున్నలను తెచ్చిన వారికి వెండి బిళ్లలను ప్రభుత్వం తరపున అందించారని చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 23: పుష్పాలను పూజించేది బతుకమ్మ పండుగ అని.. పశువులను పూజించే జాతి ఒక్క తెలంగాణకు మాత్రమే సొంతమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ లోని నారాయణగూడ సదర్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. యాదవ సోదర సోదరీమణులకు సదర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా సదరంటే ఒక ప్రత్యేకత అని.. యాదవ జాతి దీపావళి సందర్భంగా దున్నలను పూజించే గొప్ప సంస్కృతికి ఈ పండుగ చిహ్నమని పేర్కొన్నారు. దీపావళి అంటేనే మహాలక్ష్మి, లక్ష్మీ దేవతకు పూజిస్తామని.. యాదవులకు లక్ష్మీ అంటే పాలు అని చెప్పారు. మరి ఆ పాలను ఇచ్చినటువంటి పాడి వంటి దున్నలను పూజించేటువంటి గొప్ప సంస్కృతి మన హైదరాబాదుకు మాత్రమే దక్కిందని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సదర్ పండుగను అధికారికంగా జరిపార్ని గుర్తుచేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో ఇక్కడ వేదికను ప్రభుత్వమే వేసి.. దున్నలను తెచ్చిన వారికి వెండి బిళ్లలను ప్రభుత్వం తరపున అందించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం సదర్ పండుగను అధికారికంగా జరుపుతామని మాటలకే పరిమితమైంది కానీ ఒక రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సదర్ నిర్వహణకు పోయిన సంవత్సరం ఒక రూపాయి ఇవ్వలేదని.. ఈ సంవత్సరం కూడా ఇవ్వలేదన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో యాదవులు మంత్రులుగా ఉన్నారని.. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదవులకు ఉన్న గుర్తింపు ఏంటో మీకే తెలుసు అని అన్నారు. ఏ సీఎం కూడా యాదవజాతి నిజాయితీ గురించి, పనితనం గురించి, నిబద్ధత గురించి శాసనసభలో చెప్పలేదని.. అలా చెప్పిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. సదర్ సంప్రదాయాన్ని ఈ తరం ముందుకు తీసుకెళ్లడం చాలా సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. సదర్ ను తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాదు నుంచి మొత్తం తెలంగాణకు వ్యాపింపజేశారని అన్నారు. ఈరోజు అన్ని జిల్లాల్లో ఈ సదర్ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ సదర్ వేడుకలను మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.