SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసు.. జూబ్లీహిల్స్ పీఎస్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:26 PM
SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిట్ ముందు సాక్షిగా హాజరయ్యారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
హైదరాబాద్, జూన్ 17: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో బాధితుల నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసే ప్రక్రియను సిట్ మొదలుపెట్టింది. ఇప్పటికే కొంతమంది బాధితుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన సిట్.. తాజాగా ఈ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని నిర్ణయించి.. ఆయనకు సమాచారం అందించారు. ఇందులో భాగంగా ఈరోజు (మంగళవారం) జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు మహేష్ కుమార్ చేరుకున్నారు. దీంతో జూబ్లీహిల్స్ పీఎస్ ముందు కాంగ్రెస్ కార్యకర్తల హడావిడి నెలకొంది.
సిట్ కార్యాలయానికి పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని బయటకు పంపించి వేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. కాగా.. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న మహేష్ కుమార్.. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ సమయంలో తన ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ప్రణీత్ రావును అరెస్ట్ చేసి ఆయనకు సంబంధించి ఫోన్లను రికవరీ చేసిన సమయంలో అందులోని డేటాను విశ్లేషించగా.. మహేష్ కుమార్ గౌడ్‌కు చెందిన అంశాలు బయటపడ్డాయి. దీంతో ఆయన ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మహేష్ కుమార్‌ను బాధితుడిగా భావించి ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ తన వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ స్టేట్‌మెంట్ ఇచ్చిన వెళ్లిన తర్వాత ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రభాకర్ రావును నాలుగో సారి సిట్ అధికారులు విచారించబోతున్నారు. అలాగే ప్రభాకర్‌రావుతో పాటు నలుగురు సహ నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు ఈరోజు సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా నిందితులను అధికారులు ప్రశ్నించనున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణలో సిట్ అధికారులకు ప్రభాకర్ రావు సహకరించని పరిస్థితి. సిట్ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు ధాట వేసే ధోరణిలో ప్రభాకర్ రావు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తిరిగి సిట్ అధికారులనే ఎదురు ప్రశ్నలు వేస్తుండటంతో ప్రభాకర్ రావు నుంచి సమాచారం సేకరించడం కష్టతరంగా మారింది. ఈ క్రమంలో ఐదుగురు నిందితులను ఒకేసారి విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతి ఉండే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ప్రభాకర్ రావుతో పాటు మిగిలిన నలుగురు నిందితులను సిట్ అధికారులు విచారించనున్నారు.
ఇవి కూడా చదవండి
మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.. శిరీష ఆవేదన
Read Latest Telangana News And Telugu News