Miniseter Sridher Babu: కేంద్రం తెలంగాణను పక్కన పెడుతుంది : శ్రీధర్ బాబు
ABN , Publish Date - Aug 13 , 2025 | 06:19 PM
కేంద్ర ప్రభుత్వం ఏపీకి కొత్త ప్రాజెక్టులు కేటాయించి, తెలంగాణను పక్కన పెడుతోందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన సెమీ కండక్టర్ యూనిట్‌ను ఏపీకి తరలించారని మండిపడ్డారు.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. తెలంగాణకు వచ్చే కంపెనీలకు అనుమతి ఇచ్చే విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. ఇవాళ(బుధవారం) ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్రం సవతితల్లి ప్రేమచూపిస్తుంది..
కేంద్ర ప్రభుత్వం ఏపీకి కొత్త ప్రాజెక్టులు కేటాయించి, తెలంగాణను పక్కన పెడుతోందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన సెమీ కండక్టర్ యూనిట్‌ను ఏపీకి తరలించారని మండిపడ్డారు. ప్రపంచస్థాయి అధునాతన ప్యాకేజింగ్ కంపెనీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఇందుకోసం మహేశ్వరంలో 10 ఎకరాల విలువైన భూమిని కేటాయించడం జరిగింది. రాయితీలు ఇచ్చేందుకు ఆమోదిస్తూ.. అన్ని అనుమతులను పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగితాలకే పరిమితమైనా వారికి అనుమతులు..
ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ ప్రాజెక్టుకే కేంద్రం ఆమోదం తెలిపిందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు అక్కడ ఎలాంటి భూకేటాయింపులు జరగలేదని స్పష్టం చేశారు. ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమైనా వారికి అనుమతులు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ఇలాంటి చర్యలతో అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ పట్ల ఎందుకింత వివక్ష..
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక పరిపాలనా లోపం కాదని.. తెలంగాణ పట్ల కావాలని చూపిస్తున్న సవతి తల్లి ప్రేమ అని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారుల హామీలు, స్పష్టమైన ప్రణాళిక ఉన్న ఒక రాష్ట్రాన్ని పక్కన పెట్టి.. కేవలం కాగితాలపై ఉన్న ఒక ప్రతిపాదనకు ప్రాధాన్యత ఇవ్వడం సమంజసం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..
రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్