Share News

Minister Komatireddy: ఆ టెండర్లతో గందరగోళం ... కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jan 07 , 2025 | 01:35 PM

Minister Komatireddy Venkatareddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టిమ్స్ హాస్పిటల్ నిర్మాణాలపై ప్రత్యేకశ్రద్ధ చూపిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వారు 2025 డిసెంబర్ నాటికి ఎట్టిపరిస్థితుల్లో సనత్‌నగర్, ఎల్బీ‌నగర్, అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ పూర్తి చేయాలని ఆదేశించారు.

Minister Komatireddy: ఆ టెండర్లతో గందరగోళం ... కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్
Minister Komatireddy Venkatareddy

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం ఒక్కో పనికి ఒక్కో టెండర్ పిలిచి అంత గందరగోళం చేస్తే.. అన్నింటిని సరిదిద్దామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆల్వాల్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణాన్నిరూ. 897 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆల్వాల్ టిమ్స్ హాస్పిటల్‌‌పై ఇవాళ(మంగళవారం) రిప్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ... 11.53 లక్షల స్క్వేర్ ఫీట్లలో హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. 90శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని చెప్పారు. ధర్మశాల నిర్మాణాన్ని ఎందుకు చేపట్టడం లేదని అధికారులను మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. సనత్‌నగర్, ఎల్బీ‌నగర్ టిమ్స్ నిర్మాణాల్లో ధర్మశాల ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు నిర్మించడం లేదని అధికారులను మంత్రి కోమటిరెడ్డి నిలదీశారు.


శాఖల మధ్య సమన్వయం లేకనే ఇబ్బందులని అన్నారు. 35 డిపార్ట్‌మెంట్ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. 24 గంటల పాటు ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయని అధికారులు చెప్పారు. నిర్మాణం 70 శాతం పూర్తయినా ధర్మశాల నిర్మాణం పట్ల ఎందుకు నిర్లక్ష్యం చేశారని సీరియస్ అయ్యారు. వాస్తు పేరిట కేసీఆర్ ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేయడం వల్ల పనుల్లో ఆలస్యం జరిగిందని మంత్రికి నిర్మాణ సంస్థ తెలిపింది. నిర్మాణంలో శాఖల మధ్య సమన్వయం లేక పనులు ఆలస్యం అవడం బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టిమ్స్ హాస్పిటల్ నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు. 2025 డిసెంబర్ నాటికి ఎట్టిపరిస్థితుల్లో సనత్‌నగర్, ఎల్బీ‌నగర్, అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు.


ప్రస్తుతం టిమ్స్ ఆల్వాల్ పనులు త్వరలో పూర్తి చేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. ఎల్బీ‌నగర్ టిమ్స్ పనులు భూమి సమస్య కారణంగా పనుల్లో జాప్యం జరిగిందని అన్నారు. వాస్తవానికి 2021లో నిర్మించాలని నిర్ణయించినా.. ఇప్పటి వరకు 27 శాతానికి మించి పనులు కాలేదన్నారు. తాను మంత్రి పదవి చేపట్టాక ముఖ్యమంత్రితో చర్చించి ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నానని అన్నారు. హాస్పిటల్ భూమికి ఇబ్బందిగా మారిన భూ సమస్యను పరిష్కరించానని అన్నారు. మనం నిర్మిస్తుంది హాస్పిటల్.. జాగ్రత్తగా, నాణ్యతగా, వేగంగా పనులు చేయాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఆలోచనతో ముందుకు సాగాలని నిర్మాణ సంస్థకు మంత్రి కోమటిరెడ్డి సూచించారు.


ముఖ్యమంత్రి రేవంత్‌తో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తానని అన్నారు. ఇప్పటికైనా వేగంగా పనులు చేయాలని సూచించారు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజషన్‌లాగా.. పది మంది మెచ్చేలా హాస్పిటల్‌ను నిర్మించాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. మేజర్ ఓటీ, ఏమర్జెన్సీ, రెడియల్ వార్డ్, ఆంకలాజీ, న్యూక్లియర్ మెడిసిన్ విభాగలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఆపరేషన్ థియేటర్, ఇతర మెడికల్ వార్డ్స్ నిర్మాణంలో వైద్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు.

Updated Date - Jan 07 , 2025 | 01:40 PM