TG NEWS: షేక్ పేట్‌లో అగ్నిప్రమాదం...
ABN , Publish Date - Jan 17 , 2025 | 08:33 AM
Telangana: హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. షేక్‌పేట్‌లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానిక వ్యాపారస్తులు భయంతో పరుగులు తీశారు.

హైదరాబాద్: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం జరిగింది. షేక్ పేట్‌లోని జుహి ఫెర్టిలిటీ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పక్కనే ఉన్న ఆకాశ్ స్టడీ సెంటర్‌కు మంటలు వ్యాపించాయి. అదే బిల్డింగ్‌లో గ్రౌండ్‌ఫ్లోర్‌లో రిలయన్స్ ట్రెండ్స్ షో రూం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ వైపు మంటలు క్రమంగా వ్యాపిస్తున్నాయి. మంటల ధాటికి దట్టంగా పొగ అలుముకుంది. అగ్నిప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం తెలియడంతో సంఘటన స్థలానికి అగ్నిమాపక అధికారులు వచ్చారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక అధికారులు ప్రయత్నిస్తున్నారు. మంటలు దట్టగా వ్యాపించడంతో ఇంకా అదుపులోకి రాలేదు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మంటలను పూర్తిస్థాయిలో అదుపు చేశాం: డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న
ఈరోజు ఉదయం 5:20 నిమిషాలకు రిలయన్స్ ట్రెండ్స్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లుగా సమాచారం అందిందని డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న తెలిపారు. వెంటనే మాదాపూర్ లంగర్‌హౌస్ పంజాగుట్ట నుంచి ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయన్నారు. ట్రెండ్స్ బిల్డింగ్‌లోని సెకండ్ ఫ్లోర్‌లో ముందుగా మంటలు ప్రారంభం అయ్యాయని చెప్పారు. సెకండ్ ఫ్లోర్‌లో ఫర్నిచర్ ఇతర సామాగ్రి ఉందని తెలిపారు. అనంతరం పై అంతస్థుల వరకు మంటలు వ్యాపించాయని చెప్పారు. మంటలను పూర్తిస్థాయిలో అదుపు చేశామన్నారు. మంటల వల్ల బిల్డింగ్ లోపల దట్టమైన పొగ అలుముకుందని తెలిపారు. అద్దాలను ధ్వంసం చేసి పొగను బయటకు పంపిస్తున్నామని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బిల్డింగ్‌లో ముగ్గురు ఉన్నారని చెప్పారు. వారిని సురక్షితంగా కాపాడామని ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా అని తనిఖీ చేస్తున్నామని అన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న చెప్పారు.
రంగారెడ్డిలో టిప్పర్ లారీని ఢీకొన్న బైక్..
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లెచెరువు వద్ద టిప్పర్ లారీని బైక్ ఢీ కొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్నభార్య, చిన్నారి స్పాట్‌లోనే చనిపోయారు. అతని భార్య రుక్సానా బేగం, 3 సంవత్సరాల సిఫా అక్కడికక్కడే మృతిచెందగా, అజీమ్ అతని కుమారుడు ముజమిల్‌కు తీవ్రగాయాలయ్యాయి. కళ్ల ముందే భార్య, కూతురు చనిపోవడంతో భర్త తల్లఢిల్లిపోయాడు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. టిప్పర్ లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. లంగర్ హౌజ్ నుంచి మైలార్‌దేవ్‌పల్లి మీదుగా ఫలక్‌నామా వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
Seethakka: గురుకులాల భోజనం అమ్మ వంటను గుర్తుచేయాలి
Read Latest Telangana News and Telugu News