Mahesh Kumar Goud: హరీష్ రావు, కేటీఆర్‌లకు బీజేపీలో చేరినట్లు నోటీసులు పంపిస్తాం..
ABN , Publish Date - Sep 13 , 2025 | 02:46 PM
కేటీఆర్ మీ రాజకీయ శకం ముగిసిందని మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. మోదీ మోక్షం కోసం కేటీఆర్ రాహుల్ గాంధీని విమర్షిస్తున్నారని ఆరోపించారు. కేటిఆర్, హరీష్ రావులు పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి చూశారని కవిత చెప్పారని గుర్తు చేశారు.
హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు, కేటీఆర్‌లు ప్రధాని మోదీని కలిశారని వ్యాఖ్యనించారు. వాళ్ళు బీజేపీలో చేరినట్లు వాళ్లకు కూడా తాము నోటీసులు పంపిస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు కలుస్తారని తెలిపారు. కేటీఆర్ స్థాయిని మించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసింది గాంధీ కుటుంబమని చెప్పారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంది కేసీఆర్ కుటుంబమని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఇవాళ(శనివారం) మీడియాతో మాట్లాడారు..
కేటీఆర్ మీ రాజకీయ శకం ముగిసిందని మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ మోక్షం కోసం కేటీఆర్ రాహుల్ గాంధీని విమర్షిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావులు పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి చూశారని కవిత చెప్పారని గుర్తు చేశారు. మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయిందని స్పష్టం చేశారు. సీబీఐ విచారణ నుంచి తప్పించుకోవాలని మోదీ కాళ్ళు మొక్కి బయటపడాలని చూస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడుతారని ప్రశ్నించారు. కేటీఆర్ ,హరీష్ రావు మోదీ దగ్గర మొకరిల్లడానికి, మళ్ళీ మోదీని కలువాలని చూసేది వాస్తవం కాదా..? అని నిలదీశారు. కేసీఆర్ పది ఏండ్లు పాలించి వందేండ్లకు సరిపడా దోచుకున్నారని విమర్శించారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. స్పీకర్, ఎమ్యెల్యేల మధ్య నడుస్తున్న వ్యవహారమని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు చెప్పిన దాన్ని స్పీకర్ ప్రామాణికంగా తీసుకుంటారని తెలిపారు. తెలంగాణ వాది సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తే సిగ్గు లేకుండా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశం ప్రధాని మోదీ, రాహుల్ గాంధీగా విడిపోయిందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ దేశ భవిష్యత్తును, రాజ్యాంగాన్ని కాపాడాలని తపన పడుతున్నారని పేర్కొన్నారు. మోదీ ఓట్ చోరీ చేసి మూడో సారి అధికారంలోకి ఎలా వచ్చారో.. ఆధారాలతో సహా రాహుల్ గాంధీ బయటపెట్టారని తెలిపారు. ఓట్ చోరీ చేసి మోదీ దొరికిపోయారని ఆరోపించారు.
సీబీఐ, ఈడీల మీద నమ్మకం లేదని రాహుల్ గాంధీ చెప్పారని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీతో తాను కూడా ఏకీభవిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకే కేటీఆర్ లాంటి వాళ్ళతో మోదీ మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పజెప్పితే 48 గంటల్లో తెలుస్తామన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసి, రాజ్యాంగం మార్చి మనువాద రాజాకీయం చేయాలనుకున్న బీజేపీతో బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని విమర్శించారు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ అడ్డంగా దొరికిపోయిన దొంగ అని పేర్కొన్నారు. కేటీఆర్ ఖచ్చితంగా లోపలికి వెళ్తారని మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!