Share News

KTR Vs Revanth Reddy: ఫ్యూచర్ సిటీ అంటూ డ్రామాలు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

ABN , Publish Date - Sep 17 , 2025 | 04:51 PM

ప్రజాస్వామ్యంలో ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకోవచ్చని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ చేసిన పనులను చెప్పలేకపోయాం కాబట్టే ఓడిపోయామని వెల్లడించారు.

KTR Vs Revanth Reddy: ఫ్యూచర్ సిటీ అంటూ డ్రామాలు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
KTR Vs Revanth Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నియంతలా వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. ఈరోజు (బుధవారం) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్‌ మాట్లాడుతూ.. సుందరయ్య విజ్ఞాన వేదికలో విద్యార్థులు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు సర్కార్ నడపడం లేదని.. సర్కస్ నడుపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. మంత్రులది ఒక మాట.. ముఖ్యమంత్రిది మరొక మాట అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సృజన్ రెడ్డికి సింగరేణిలో రూ.300కోట్ల టెండర్లు ఇచ్చారని.. గుత్తా అమిత్ రెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీకి డబ్బులు ఉండవని విమర్శించారు.


నాపై కోపం సిరిసిల్లపై చూపిస్తున్నారు..

రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ బతుకమ్మ చీరలు ఇచ్చామని గుర్తు చేశారు. కేటీఆర్‌పైన కోపం సిరిసిల్లపైన చూపిస్తున్నారని మండిపడ్డారు. ముంబై పోలీస్‌లు వచ్చి డ్రగ్స్ పట్టుకుంటే తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతి పక్షంలో రేవంత్ నోటికి వచ్చినట్టు మాట్లాడారని ధ్వజమెత్తారు. పది నియోజకవర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో అక్కడి స్థానిక కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పార్టీ మారిన వారితో రాజీనామా చేయించి ఎన్నిలకు పోవాలని సవాల్ విసిరారు. బీసీ బిల్లుతో బీసీలను మోసం చేస్తుంది కాంగ్రెస్ అంటూ మండిపడ్డారు.


ఫ్యూచర్ సిటీ అంటూ డ్రామాలు

ఆర్‌ఆర్‌ఆర్‌లో సౌత్ సైడ్ అలైన్‌మెంట్ మార్చారని.. సీఎం రేవంత్ బంధువులు 2,500 ఎకరాల భూములు కొన్నారన్నారు. అలైన్ మెంట్ మార్చితే ఆర్‌ఆర్‌ఆర్‌‌కు డబ్బులు ఇవ్వమని కేంద్రం చెప్పిందని గుర్తుచేశారు. సౌత్ సైడ్ ఆర్‌ఆర్‌ఆర్‌ తామే కడతామని రేవంత్ కేంద్రానికి చెప్పారని.. సౌత్ సైడ్ ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్ మార్చడం వల్ల మిగతా ప్రాంతాల్లోనూ అలైన్‌మెంట్ మార్చే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి బంధువుల భూములు రేట్లు పెంచేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ రోడ్డు అలైన్‌మెంట్ మార్చారని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ అంటూ రేవంత్ రెడ్డి, వారి బంధువుల డ్రామాలు ఆడుతున్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


కుడితిలో పడ్డ ఎలుకల్లా వారి పరిస్థితి..

పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడిన ఎలుకల్లా ఉందంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో రేవంత్ రెడ్డి పెద్ద అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘త్వరలో ప్రెస్ మీట్ పెడతా. ఫోర్త్ సిటీ లేదు ఏం లేదు. మొత్తం వసూళ్లే. ప్రజల అందరికీ త్వరలోనే అర్థం అవుతుంది’ అని మాజీ మంత్రి అన్నారు.


తీన్మార్ మల్లన్న పార్టీపై మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చన్నారు. ప్రజలు ఎవరిని ఆదరిస్తే వారికి అధికారం దక్కుతుందని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి అసలు సెక్రటేరియట్ కు వస్తున్నారా? అని ప్రశ్నించారు కేటీఆర్. కేసీఆర్‌ను విమర్శించిన రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి పాలన నడుపుతున్నారని ఆరోపించారు. ఫీజు రియింబర్స్ మెంట్ ఇవ్వక కాలేజీలు బంద్, ఆరోగ్యశ్రీ రాక హాస్పిటల్ సేవలు బంద్, యూరియా లేక వ్యవసాయం బంద్ అంటూ వ్యాఖ్యలు చేశారు.


బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి..

‘మా హయాంలో గ్రూప్-1 పేపర్ లీక్ అయిందని తెలిస్తే పరీక్ష రద్దు చేశాం. నీ హయాంలో అవకతవకలు జరిగితే ఎందుకు రద్దు చేయవు. ఎవరిది నియంత పాలన. రేవంత్ రెడ్డి పాలనలో కుటుంబ పాలన లేదంటే కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, సృజన్ రెడ్డి నవ్వుతారు. రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డికి మరో రెండు కాంట్రాక్టులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి దోచుకోవడం ఢిల్లీకి మూటలు పంపడం’ అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ 3 సర్వేలు చేయించిందన్నారు. మూడ సర్వేల్లోనూ బీఆర్‌ఎస్ గెలుస్తుందని రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ చేయి గుర్తు తీసేసి.. బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని కేటీఆర్ హితవుపలికారు.


ఇవి కూడా చదవండి

గోల్డ్ హోల్సేల్ సంస్థలపై ఐటీ రైడ్స్

భారత్ ఏ శక్తి ముందు తలదించలేదు.. భవిష్యత్తులో తలదించబోదు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 17 , 2025 | 08:58 PM