Telangana Prajapalana: అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ప్రజాపాలన: పొన్నం ప్రభాకర్
ABN , Publish Date - Sep 17 , 2025 | 01:42 PM
Telangana Prajapalana: సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ సాధన కోసం సకలజనులు పోరాడారని గుర్తుచేశారు.
సిద్దిపేట, సెప్టెంబర్ 17: జిల్లాలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాట, తెలంగాణ అమరవీరులకు జోహార్లు.. జై తెలంగాణ అంటూ మంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బైరాన్ పల్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి వస్తున్నట్లు తెలిపారు. 1948 ఆగస్టు 27న వందలాది మంది అసువులు బాసిన అమరులకు నివాళులర్పించారు మంత్రి. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు, నిధులు, నియామకాలు ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారి ఆశయాలు ముందుకు తీసుకుపోతోందని చెప్పుకొచ్చారు. తెలంగాణ సాధన కోసం సకలజనులు పోరాడారని గుర్తుచేశారు.
2023 డిసెంబర్ 7న అందరి ఆశీర్వాదంతో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిందని..ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని తెలిపారు. ఇప్పటి వరకు 200 కోట్లు ఉచిత ప్రయాణాలు దాటాయన్నారు. ‘ఆరోగ్య శ్రీ 5 నుంచి 10 లక్షలకు పెంచుకున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు అందించాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాల ద్వారా సున్నా వడ్డీ ద్వారా మహిళ పథకాలు అమలు చేస్తున్నాం. ప్రతి పౌరుడు సన్న బియ్యం తినాలని సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా 23 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశాం. సన్న వడ్లకి 500 బోనస్ ఇస్తున్నాం. 10 సంవత్సరాలుగా డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎదురు చూశారు.. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. వెన్యూ ప్రక్షాళన చేస్తూ భూ భారతి తీసుకొచ్చాం. భూగ్రామ పరిపాలన అధికారులను నియమించాం. తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా పాడుకుంటున్నాం. చరిత్రలో నిలిచే విధంగా పెండింగ్‌లో ఉన్న అమరవీరుల స్థూపాన్ని పూర్తి చేస్తాం.. చాకలి ఐలమ్మ, తొలి తరం, మలితరం ఉద్యమకారులను గుర్తు చేసుకుంటున్నాం. తెలంగాణ కవులను కళాకారులను గౌరవించుకుంటున్నాం’ అని మంత్రి వెల్లడించారు.
సాధించుకున్న తెలంగాణలో అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ప్రజా పాలన అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలు సూక్ష్మ స్థాయిలో ప్రజలకు చేరాలా అందించాలన్నారు. ముఖ్యమంత్రి చెప్తున్నట్టు గతంలో పేదలకు పంపిణీ చేయడానికి భూములు, నిధులు ఉండేవని.. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వగలిగేది సంపూర్ణ విద్య అని..100 శాతం అక్షరాస్యత అని.. విద్యకు ప్రథమ ప్రాధాన్యత ప్రభుత్వం అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
గోల్డ్ హోల్సేల్ సంస్థలపై ఐటీ రైడ్స్
భారత్ ఏ శక్తి ముందు తలదించలేదు.. భవిష్యత్తులో తలదించబోదు
Read Latest Telangana News And Telugu News