KTR Speech Aachampet: రేవంత్ రెడ్డికి సవాల్ విరిసిన కేటీఆర్..
ABN , Publish Date - Sep 28 , 2025 | 06:27 PM
ఆల్మట్టిని అడ్డుకునే దమ్ముంటే రాహుల్ గాంధీతో చెప్పి కర్ణాటక సీఎంను పిలిపించి ఎత్తును అడ్డుకోవాలని సవాల్ విసిరారు కేటీఆర్. గతంలో ఆర్డినెన్స్‌పై గట్టిగా హెచ్చరించిన పులి మాజీ సీఎం కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు.
నాగర్ కర్నూల్: మంత్రి జూపల్లి కృష్ణారావు మాటలు వింటుంటే నవ్వొస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ మంత్రులు తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందో లేదో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనగర్జన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. అచ్చంపేట నుంచి జైత్రయాత్ర మొదలుపెడుతున్నామని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. గతంలోనే తాము ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంపును అడ్డుకున్నామని గుర్తు చేశారు. మళ్లీ పెంపునకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపడితే నల్లమల పులిబిడ్డగా చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తారో చూడాలని ఎద్దేవా చేశారు.
గతంలో ఆర్డినెన్స్‌పై గట్టిగా హెచ్చరించిన పులి మాజీ సీఎం కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు. ఆల్మట్టిని అడ్డుకునే దమ్ముంటే రాహుల్ గాంధీతో చెప్పి కర్ణాటక సీఎంను పిలిపించి ఎత్తును అడ్డుకోవాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి నల్లమల పులికాదు.. నల్లమల నక్క.. అని విమర్శించారు. పెంచుతామన్న పెన్షన్లు, మహిళలకు ఇస్తామన్న రెండున్నరవేలకు మొండిచేయి చూపారని ఆరోపించారు. కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికీ పంపిణీ చేసి ప్రభుత్వ తీరును ఎండగడతామని ధీమా వ్యక్తం చేశారు. కళ్యాణలక్మి, షాదీముబారక్ కింద లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఏమయ్యిందని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు బీఆర్ఎస్‌కు బ్రహ్మాస్త్రంగా మారుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మోసపోతే గోస పడతామని కేసీఆర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు యూరియా విషయంలో తెలుస్తోందని చెప్పుకొచ్చారు. సన్నవడ్లకు బోనస్ అనేది బోగస్ అయ్యిందని విమర్శించారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి తాము శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు చేయటానికి రేవంత్ రెడ్డికి చేతకావటం లేదని ఆరోపించారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే పనులు చేపట్టడం లేదని విమర్శించారు. రాహుల్ గాంధీకి భయపడి ఆల్మట్టిపై రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదని మండిపడ్డారు.
రాష్ట్రానికి పెద్ద మనిషి అయిన సీఎం రేవంత్ రెడ్డి తమకు అప్పు పుట్టడం లేదని చెప్పటం సిగ్గుచేటని కేటీఆర్ విమర్శించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. త్వరలో అచ్చంపేటకు మంచి నాయకుడిని నియమిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సభకు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామారెడ్డి, నవీన్ రెడ్డి, ఎమ్మెల్యేలు విజయుడు, ఇన్ ఛార్జ్ మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కరూర్ విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. ఎంతంటే..
విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. కారణాలు ఇవేనా..?