KTR In Jubilee Hills By Election Campaign: ఓటర్లతో ముచ్చట పెట్టి.. అమలు కానీ హమీలు..
ABN , Publish Date - Sep 15 , 2025 | 01:53 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కేడర్‌తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేడర్‌కు ఆయన దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్,సెప్టెంబర్ 15: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆ నియోజకవర్గంలోని కేడర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ భవన్‌లో సదరు నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ సిగ్మంట్‌కు చెందిన పార్టీ కేడర్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటూ వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లతో ముచ్చట పెట్టి.. అమలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను వారికి గుర్తు చేయాలని సూచించారు.
అలాగే కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని సైతం ఓటర్లకు వివరించాలని స్పష్టం చేశారు. గతంలో పీజేఆర్, కేసీఆర్, గోపినాథ్ కొట్లాడినట్లు ఉప ఎన్నికల్లో కొట్లాడాలంటూ బీఆర్ఎస్ క్యాడర్‌కు స్పష్టం చేశారు. భయపడితే నాయకులు కాలేరని వారికి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఎన్నో కేసులు పెట్టిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోందని.. అందుకు తాను భయపడడం లేదని కుండ బద్దలు కొట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. మీ ఇళ్లు కూల్చడానికి మీరే లైసెన్స్ ఇచ్చినట్లు అవుతుందని హెచ్చరించారు. హైడ్రా పేరు మీద సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వేల ఇళ్లు కూలగొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు వ్యతిరేకంగా పని చేయటమే ఇందిరమ్మ రాజ్యమా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ సెగ్మెంట్‌లో బీఆర్ఎస్ పార్టీలో పంచాయితీలు ఉన్న మాట వాస్తవమని ఆయన అంగీకరించారు. అవన్నీ మైక్ ముందు చెబితే బాగుండదన్నారు. ప్రతి ఇంటిలో పంచాయితీ ఉంటుందని.. అలానే వెంగళరావు నగర్ బీఆర్ఎస్ పార్టీలో సైతం ఉందన్నారు. మనం బయటపడి కొట్లాడుకుంటే.. కాంగ్రెస్, బీజేపీ రెడీగా ఉన్నాయని.. జాగ్రత్త అంటూ బీఆర్ఎస్ కేడర్‌ను ఈ సందర్భంగా కేటీఆర్ అప్రమత్తం చేశారు.
పంచాయితీ పెద్దగా తనను పెడితే తనతో కాదని స్పష్టం చేశారు. ఏమైనా ఉంటే.. మీ నాయకులు విష్ణువర్థన్ రెడ్డి, సుధీర్ రెడ్డి సమక్షంలో ఆయా ఇబ్బందులను సరి చేసుకోవాలంటూ కేడర్‌కు సూచించారు. ఎన్నికల హామీలు అమలు చేయమంటే .. తనను కోసుకుని తినమంటూ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారంటూ గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని తాను గతంలో ఎప్పుడూ చూడలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు కన్పించరంటూ జోస్యం చెప్పారు. పేదలకు గులాబీ జెండానే దిక్కు అంటూ వారికి గుర్తు చేశారు. కేసులకు భయపడొద్దు.. కార్యకర్తలను కాపాడుకుంటామంటూ బీఆర్ఎస్ క్యాడర్‌కు ఈ సందర్బంగా కేటీఆర్ భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు వాళ్లు అగ్రస్థానంలో ఉండాలన్నదే ఆలోచన: సీఎం
మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ
టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్
For TG News And Telugu News