Kishan Reddy: హెల్త్‌కేర్ రంగాన్ని మరింతగా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Feb 26 , 2025 | 07:12 PM
Kishan Reddy: కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో అంతర్జాతీయంగా పరిశోధనలు, ఏఐ- హెల్త్ కేర్, తయారీ రంగంలో ఎంతో వృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: హైదరాబాద్ ముత్యాల నగరంగానే కాకుండా, ప్రపంచ ఫార్మసీగా, అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రులు హబ్‌గా ఖ్యాతికెక్కిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో 22వ ఎడిషన్ బయో ఆసియా-2025 లాంటి గ్లోబల్ ఈవెంట్స్ నగర వేదికగా జరగడం, హెల్త్‌కేర్ రంగంలోని సాంకేతికత, సుస్థిరమైన పద్ధతుల గురించి చర్చించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇవాళ(బుధవారం) బయో ఏషియా-2025 సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో వినూత్నమైన ఆవిష్కర్తలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహుమతులు అందజేశారు. అనంతరం మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. లైఫ్‌సైన్సెస్, ఫార్మాసూటికల్స్, హెల్త్‌కేర్ రంగాల్లో భారతదేశం విశేషమైన పురోగతి సాధిస్తోందని చెప్పారు. డ్రగ్స్, ఫార్మాసూటికల్స్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని గుర్తుచేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మందులు అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో ప్రపంచ అవసరాల్లో 60 శాతానికి పైగా వ్యాక్సిన్లు, 20 శాతం జెనరిక్ మందులను భారత్ నుంచే సరఫరా చేస్తున్నామని చెప్పారు. పదేళ్లలో భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల విలువ దాదాపు రెట్టింపు అయిందన్నారు. 2014లో 15 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి కాగా, 2024లో ఇది 27.85 బిలియన్ డాలర్లకు పెరిగిందని అన్నారు. భారత్‌లో ఫార్మా ఉత్పత్తులతోపాటు వివిధ రంగాల్లోనూ ఎగుమతులు పెరిగాయని చెప్పారు. ఇన్‌ఫ్రాస్ర్టక్చర్ రంగంపై కేంద్ర ప్రభుత్వం పెద్దమొత్తంలో పెట్టుబబడులు పెడుతున్న కారణంగానే.. ఈ మార్పులు సాధ్యమవుతున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశంలో వస్తున్న ఆర్థిక సంస్కరణల కారణంగా.. భారతదేశం ఇటీవలే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. సమీప భవిష్యత్తులోనే మూడో స్థానానికి ఎగబాకుందనే విశ్వాసం తమకుందని అన్నారు.
‘‘ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దూరదృష్టి ఫలితంగా.. రక్షణ రంగంలో దిగుమతులు చేసుకునే పరిస్థితి నుంచి టాప్ -25 ఎగుమతుల దేశాల జాబితాలో చేరాం. 2014లో ఒక్క మొబైల్‌ఫోన్ కూడా ఎగుమతి చేయలేని పరిస్థితి నుంచి.. ఇప్పుడు రూ.1.28 లక్షల కోట్ల విలువైన మొబైల్‌ఫోన్లను ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం. రానున్న రెండేళ్లలో భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. 2030 నాటికి ఏకంగా 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం. 2047కల్లా భారత్ 18 వేల డాలర్ల తలసరి ఆదాయంతో 30 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజన్, వేగంగా సమర్థవంతంగా పథకాల అమలు, యువశక్తి సామర్థ్యం, వివిధ రంగాల్లో నిపుణులు, పారిశ్రామికవేత్తలందరి కృషికారణంగానే ప్రగతి సాధిస్తున్నాం. 2014కు ముందు ‘ఫియర్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి 2014 తర్వాత ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ దిశగా దేశం పరివర్తనం చెందింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల కారణంగానే సాధ్యమైంది. జీఎస్టీ అమల్లో అన్ని రంగాల పరిశ్రమలు లబ్ధి పొందాయి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కారణంగా.. మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా భారత్‌లో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని పలు అంతర్జాతీయ సంస్థలు తమ నివేదికల్లో పేర్కొన్నాయి. ఇటీవల కేంద్రం ప్రకటించిన బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని రూ.12 లక్షల వరకు పెంచడం.. భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలాన్నిస్తుంది. హైదరాబాద్ నగరం ‘బల్క్ డ్రగ్ క్యాపిటల్’, ‘వ్యాక్సిన్ క్యాపిటల్’గా పురోగతి సాధించింది. అలాగే ఐటీ ఎగుమతుల్లో లీడర్‌గా నిలిచింది. 2024లో భాగ్యనగరంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీల ద్వారా రూ.1.2 లక్షల కోట్ల ఐటీ సేవలు ఎగుమతులు జరిగాయి. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో అంతర్జాతీయంగా పరిశోధనలు, ఏఐ- హెల్త్ కేర్, తయారీ రంగంలో ఎంతో వృద్ధి చెందుతూ ‘వసుదైవ కుటుంబకం’ భావనకు ప్రతిబింబంగా భారత్ నిలుస్తోంది’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘భారత్ ఫార్మా రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలోని ఫార్మా ఆదాయంలో 35 శాతం, బల్క్ డ్రగ్స్ లో 40 శాతం ఆదాయం భాగ్యనగరం నుంచే వస్తోంది. 800 ఫార్మా, బయోటెక్, మెడిటెక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌లో ఐఐటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ (నైపర్), సీసీఎంబీ, ఐఎస్‌బీ, నల్సార్, డీఆర్‌డీవో వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి టాలెంటెడ్ యువకులు ఆయా రంగాల్లో సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్కు వంటివి విదేశీ పెట్టుబడులను ఆకర్షించి, 2047 నాటికి 500 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ ఎకానమీ సృష్టి దిశగా అడుగులు వేసే అవకాశాలు హైదరాబాద్‌లో మెండుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ రంగానికి ఊతమిచ్చేందుకు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘మెడ్‌టెక్ మిత్ర’ వంటి వేదికలు.. ఆవిష్కర్తలకు, స్టార్టప్స్, భాగస్వామ్యపక్షాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు దోహదపడుతున్నాయని చెప్పారు. గ్లోబల్ హెల్త్‌కేర్ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ఇన్నొవేటర్లు, శాస్ర్తవేత్తలు భారత్‌తో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలి. మనమంతా కలిసి హెల్త్‌కేర్ రంగాన్ని మరింతగా తీర్చిదిద్దుదాం’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.