KCR Meeting: బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ కీలక భేటీ.. చర్చించిన అంశాలివే
ABN , Publish Date - Dec 30 , 2025 | 01:31 PM
నందినగర్‌లోని నివాసంలో బీఆర్‌ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చించారు.
హైదరాబాద్, డిసెంబర్ 30: బీఆర్‌ఎస్ నేతలతో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR) ఈరోజు (మంగళవారం) సమావేశమయ్యారు. నందినగర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao), పలువురు బీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రధానంగా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు సంబంధించి అసెంబ్లీ వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టాలన్నదే బీఆర్‌ఎస్ వ్యూహం.
ఇందులో భాగంగానే ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో గత పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని, ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను మాత్రమే నిర్మించిందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో అటు కృష్ణా, ఇటు గోదావరి రెండు నదులపై చేపట్టిన ప్రాజెక్టులు, నీటి వాటాలు పరిష్కరించామని ఆ పార్టీ చెప్పుకొస్తోంది.
ఇదే విషయంపై కొద్దిరోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం మధ్య మాటల యుద్ధం వ్యక్తిగత దూషణలకు దారి తీసింది. వీటన్నింటికీ అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్ రావు, ఇతర నాయకులు సమావేశమయ్యారు. ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది?.. ప్రభుత్వం చెప్పే ప్రతీ అంశంపై సమాధానంతో సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పార్టీ నేతలకు కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన మహిళ.. ఎంత డబ్బు పోగొట్టుకున్నారంటే..
శాంతి భద్రతలు అదుపులోనే.. వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ
Read Latest Telangana News And Telugu News