Hyderabad Dead Bodies: హైదరాబాద్‌లో మహిళల మృతదేహాల కలకలం..
ABN , Publish Date - Sep 17 , 2025 | 10:55 AM
చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గోనెసంచిలో మహిళా మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
హైదరాబాద్: నగరంలో మహిళల మృతదేహాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిన్న(మంగళవారం) ఒకే రోజు నగరంలోని రెండు వేరువేరు ప్రాంతాల్లో మహిళల మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. ఓ మహిళా మృతదేహాన్ని బ్రిడ్జి కింద పడేయగా.. మరో మహిళా మృతదేహాన్ని సంచిలో పెట్టుకొచ్చి రైల్వేస్టేషన్ వద్ద వదిలి వెళ్లారు. ఈ రెండు ఘటనలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
గోనెసంచిలో మహిళా మృతదేహం..
చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో.. ఓ గోనెసంచిలో మహిళా మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మహిళ ఎవరు అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో.. గోనె సంచిలో కాళ్లు చేతులు కట్టేసి ఓ మహిళా మృతదేహాన్ని గర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు పోలీసులు పరిశీలించారు. మహిళా మృతదేహాన్ని ఓ ఆటోలో తీసుకువచ్చి అక్కడ పడేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
బ్రిడ్జి కింద కుళ్లిన మహిళ మృతదేహం..
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి కిస్మత్‌పుర సమీపంలోని ఓ బ్రిడ్జి కింద మహిళ డెడ్ బాడీ తీవ్ర కలకలం రేపింది. నిన్న(మంగళవారం) డెడ్ బాడీని చూసిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం ఒంటిపై బట్టలు లేవని పోలీసులు పేర్కొన్నారు.
ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతదేహం ఎవరిదో గుర్తించినట్లు తెలిపారు. మృతురాలు అఘాపురాకు చెందిన బేగంగా చెప్పారు. మృతురాలు ఆఘాపురా నుంచి ఆటోలో కిస్మత్‌పుర వచ్చినట్లు వివరించారు. అనంతరం మహిళ కిస్మత్‌పురలోని కల్లు కపౌండ్‌లో కల్లు తాగినట్లు పోలీసులు తెలిపారు. ఆపై ఆమెను తీసుకువెళ్లింది ఎవరు..? ఆమెను హత్య చేసింది ఎవరు..? అన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతుంది. అత్యాచారం ఆపై హత్య కోణంలో దర్యాప్తు జరుగుతుంది. కేసుకు సంబంధించి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు రాజేంద్రనగర్ పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు
డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు