Share News

Bhatti Vikramarka: హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

ABN , Publish Date - Oct 10 , 2025 | 04:12 PM

హైదరాబాద్‌లో రెండు సంవత్సరాల్లో రూ.20 వేల కోట్లు కేటాయించి చేపట్టిన పనుల ఫలితాలు ఇప్పుడే కనిపిస్తున్నాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ పనులు నగర రూపురేఖలను మార్చబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Bhatti Vikramarka: హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..
Deputy CM Bhatti Vikramarka

హైదరాబాద్: నగర సమగ్రాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రియల్ ఎస్టేట్ వేగంగా దూసుకెళ్తుందని పేర్కొన్నారు. నరెడ్కో 15వ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాయదుర్గంలో ఎకరం రూ.177 కోట్లు పలికిందని గుర్తు చేశారు. మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాలను బిల్డర్లు దృష్టిలో పెట్టుకోవాలని భట్టి సూచించారు. భవిష్యత్తులో నగరంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే ఉంటాయని చెప్పారు. ప్రతి సంవత్సరం నగర అభివృద్ధికి ప్రణాళిక వ్యయంలో భాగంగా బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.


ఫలితాలు కనిపిస్తున్నాయి..

హైదరాబాద్‌లో రెండు సంవత్సరాల్లో రూ.20 వేల కోట్లు కేటాయించి చేపట్టిన పనుల ఫలితాలు ఇప్పుడే కనిపిస్తున్నాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ పనులు నగర రూపురేఖలను మార్చబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల 39 STP ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల పనులకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. తాగునీటి అవసరాల కోసం సుమారు రూ.11,927 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. రూ.13,704 కోట్ల వ్యయంతో మరికొన్ని తాగునీటి, సీవరేజ్‌ ప్లాంట్ పనులు ప్రతిపాదనలో ఉన్నాయని స్పష్టం చేశారు. మొత్తంగా సీవరేజ్‌, తాగునీటి సరఫరా కోసం రూ.25,631 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఎలివేటెడ్ కారిడార్..

ప్యారడైజ్ జంక్షన్ నుంచి నేషనల్ హైవేను కలుపుతూ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు రూ.1,487 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు భట్టి చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఢిల్లీలో మకాం వేసి కేంద్ర డిఫెన్స్ మంత్రిని ఒప్పించారని గుర్తు చేశారు. శామీర్‌పేటలో రూ.3,619 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నామని తెలిపారు. దేశంలోని ఇతర ఏ నగరాల్లో లేనివిధంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు, మంచినీటి సరఫరా హైదరాబాద్ నగరంలో సరఫరా జరుగుతుందని భట్టి తెలిపారు.


ఒక్కో పాఠశాలను రూ.25 కోట్లు..

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఉచితంగా విద్యను అందించేందుకు ఒక్కో పాఠశాలను రూ.25 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం నిర్మిస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకుగాను రూ.11,500 కోట్ల బడ్జెట్ కేటాయించి పాఠశాలల నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు చెప్పారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విల్లాలు, హై రైజ్ బిల్డింగులకే బిల్డర్లు పరిమితం కావొద్దని సూచించారు. మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేయాలని పేర్కొన్నారు. మీ సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్

హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..

Updated Date - Oct 10 , 2025 | 04:19 PM