HYDRA In Gajularamaram: కొరడా ఝులిపించిన హైడ్రా.. గాజులరామారంలో బిగ్ ఆపరేషన్..
ABN , Publish Date - Sep 21 , 2025 | 10:53 AM
కుత్బుల్లాపూర్‌లోని గాజులరామారంలో హైడ్రా బిగ్ ఆపరేషన్ చేపట్టింది. సర్వే నెంబర్ 307లో అక్రమ కట్టడాల కూల్చివేస్తుంది. ఈ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు.
హైదరాబాద్: నగరంలో మరోసారి హైడ్రా తన కొరడా ఝులిపించింది. ఈ మేరకు కుత్బుల్లాపూర్‌లోని గాజులరామారంలో హైడ్రా బిగ్ ఆపరేషన్ చేపట్టింది. సర్వే నెంబర్ 307లో అక్రమ కట్టడాల కూల్చివేస్తుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే.. కూల్చివేతలను ఆపాలని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో హైడ్రా అధికారులకు స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ ఇళ్ళను కూల్చి వేస్తున్నారంటూ.. బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవేందర్ నగర్, బాలయ్య బస్తీ, పోచమ్మ బస్తీలలో వందలాది ఇళ్లను అధికారులు నేలమట్టం చేశారు. అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.
తాజాగా.. ఈ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. గాజులరామారం సర్వే నంబర్ 307లో ఉన్న 317 ఎకరాల ప్రభుత్వ భూముల్లో కబ్జాలను తొలగిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ డిపార్ట్మెంట్, హైడ్రా, పోలీస్ విభాగం సంయుక్తంగా భారీ స్థాయిలో ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు ఆక్రమించిన వందల ఎకరాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. సుమారు 40 ఎకరాల్లో పేదలు నివసిస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక రాజకీయ నాయకులు, పేదలకు అక్రమంగా 50, 100 గజాలుగా విక్రయించినట్లు విచారణలో బయటపడిందని చెప్పారు. గత 6 నెలల్లో అన్ని శాఖల అధికారులతో ఐదు సార్లు సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ అనుమతులు పొందిన తరువాతే ఇవాళ(ఆదివారం) ఆపరేషన్ చేపట్టినట్లు రంగనాథ్ స్పష్టం చేశారు.
పేదల ఇళ్లు కూల్చవద్దని ఫీల్డ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు రంగనాథ్ తెలిపారు. పొలిటీషియన్స్ , రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారులు ఆక్రమించిన భూమిలో ఉన్న కట్టడాలను మాత్రమే కూల్చీ ఆ భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే కమర్షియల్ షెడ్లు, కాంపౌండ్ వాల్‌లు, గదులు కట్టుకొని ఆక్రమించిన భూములను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. కొందరికి ఇచ్చిన పత్రాలు ఫోర్జరీ చేసిన నకిలీ పత్రాలుగా బయటపడడంతో సంబంధిత అధికారులు వాటిని రద్దు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మొత్తం 275 ఎకరాల కంటే ఎక్కువ భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ చేస్తామని ఆయన వివరించారు. ఈ భూముల అంచనా విలువ 12 నుంచి 15 వేల కోట్లుగా ఉంటుందని రంగనాథ్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు
మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్