Hyderabad Robbery: స్నేహితుడి ఇంటికి కన్నం.. ఆడ వేషంలో డబ్బులు, నగదు స్వాహా
ABN , Publish Date - Sep 21 , 2025 | 10:27 AM
స్నేహితుడి ఇంటికే కన్నం వేసిన ఘటన హైదరాబాద్, బంజారాహిల్స్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఉదయ్ నగర్‌కు చెందిన శివరాజ్ ఈ నెల 16వ తేదీన కుటుంబ సభ్యులతో నిజామాబాద్ వెళ్లాడు.
హైదరాబాద్: డబ్బులు సంపాదించాలనే ఆశతో.. మనుషులు మానవతా విలువలు మరిచిపోయి.. స్వార్థం, రాక్షసత్వానికి అలవాటు పడుతున్నారు. జల్సాలకు అలవాటు పడి అప్పులపాలు అవుతూ.. దొంగతనాలు, మోసాలు చేస్తున్నారు. డబ్బు కోసం మన, తన అనే తేడాలు లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే ఒకటి నగరంలో చోటుచేసుకుంది. డబ్బు కోసం తన స్నేహితుడి ఇంటికే కన్నం వేశాడు ఓ మిత్రుడు. స్నేహితుడి ఇంట్లో బంగారం, డబ్బులు ఉన్నాయని తెలుసుకుని.. దొంగతనానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన హైదరాబాద్, బంజారాహిల్స్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఉదయ్ నగర్‌కు చెందిన శివరాజ్ ఈ నెల 16వ తేదీన కుటుంబ సభ్యులతో నిజామాబాద్ వెళ్లాడు. ఊరికి వెళ్తున్న విషయాన్ని తన స్నేహితుడు హర్షిత్‌కు చెప్పాడు. అయితే అప్పటికే.. హర్షిత్ పూర్తిగా అప్పుల్లో మునిగిపోయి ఉండడంతో అదే అదునుగా భావించి.. శివరాజ్ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఆడవేషంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం ఇంట్లో ఉన్న 6.75 తులాల బంగారం, రూ. 1.10 లక్షల నగదు తీసుకుని బయటపడ్డాడు. శివరాజ్ కుటుంబంతో ఇంటికి వచ్చినప్పుడు బంగారం, నగదు లేకపోవడంతో.. హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌తో వివరాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. హర్షిత్ ఆడవేషంలో.. చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు గుర్తించారు. వాటి ఆధారంగా హర్షిత్ చోరీకి పాల్పడ్డట్లు నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. హర్షిత్‌ను అరెస్ట్ చేసి.. అతని వద్ద నుంచి 6.75 తులాల బంగారం, రూ. 85 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు
మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్