Harish Rao: సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే ఫలితాలు: హరీష్ రావు
ABN , Publish Date - Dec 17 , 2025 | 02:59 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలను చూసి కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యిందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. మూడో దశ ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీనీ నిరాశపరచక తప్పదని అన్నారు.
మెదక్ జిల్లా, డిసెంబర్ 17: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయని.. రేవంత్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిందని మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) అన్నారు. బుధవారం నాడు గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలనికి చెందిన పలువురు సర్పంచ్‌లను హరీష్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయని... ప్రజల తీర్పు చూసి కాంగ్రెస్ నాయకులకు షాక్ తగిలిందన్నారు. మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయ్యారని.. రెండో దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయ్యిందంటూ కామెంట్స్ చేశారు. ఇక ఈ రాత్రి వచ్చే మూడో దశ ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీనీ నిరాశపరచక తప్పదని అన్నారు.
ఈ ఓటమి భయంతోనే ఇప్పుడు డబ్బు సంచులు పట్టుకొని హైదరాబాద్ నుంచి బయలుదేరారని తెలిపారు. పోలీసులను అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. నాడు ఢిల్లీలో అవార్డులు ఇస్తే తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా జాబితా ఉండేది కాదని.. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో తెలంగాణకు ఒక్క అవార్డు కూడా రాలేదని అన్నారు. పల్లెలు అపరిశుభ్రంగా మారాయని... కనీసం కేసీఆర్ కొనిచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు.
ఆనాడు కేసీఆర్ ప్రతి నెలా పల్లెలకు నిధులు విడుదల చేసేవారని.. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు బంద్ అయ్యాయన్నారు. పల్లె ప్రకృతి వనాలు, డంపు యార్డులు అన్నీ మూలకు పడ్డాయని తెలిపారు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని కాంగ్రెస్ నాయకులను మాజీ మంత్రి హెచ్చరించారు. దాడులు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.
బీఆర్ఎస్‌లో గెలిచిన వారిని బలవంతంగా పార్టీలో చేర్చుకోవాలని చూసినా కుదరదన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులని గుర్తుంచుకోవాలని.. వారు బెదిరింపులకు లొంగరని స్పష్టం చేశారు. దేశం వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా వెళ్తోందని.. బహుశా మరో ఆరు నెలల్లోనో ఏడాదిలోనో ఎన్నికలు రావచ్చని చెప్పుకొచ్చారు. రెండేళ్లలో కచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని... మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన సర్పంచులంతా ధైర్యంగా ఉండాలని.. మళ్ళీ గ్రామాలకు మంచి రోజులు వస్తాయని... అభివృద్ధి పథంలో గ్రామాలన్నీ ప్రయాణిస్తాయని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఒక్కో ఓటుకు రూ.3 వేలు.. డబ్బులు తీసుకుని కూడా..
తుది దశ గ్రామపంచాయతీ పోరు.. పలు చోట్ల ఉద్రిక్తతలు.. టెన్షన్ టెన్షన్
Read Latest Telangana News And Telugu News